వైద్యురాలి నిర్లక్ష్యం.. రోగులకు ప్రాణసంకటం
గోపాలపురం: ప్రభుత్వ వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు రోగులకు వైద్యం అందక నరకయాతన అనుభవించిన ఘటన గురువారం చోటు చేసుకుంది. తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామానికి చెందిన ఎలిపే ఇంద్రమ్మ ఇంటి వద్ద వేడి నీళ్లు పొయ్యి మీద నుంచి తీస్తుండగా అవి కాళ్లు, పొట్టపై పడటంతో 25 శాతం మేర కాలిపోయింది. ఆమెను కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి గోపాలపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువచ్చారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేరు. దీంతో చేసేది ఏమీలేక ఆసుపత్రిలోనే నరకయాతన అనుభవించినట్లు బాధితురాలు తెలిపింది. బుధవారం అర్ధరాత్రి సుమారు 2గంటల సమయంలో గోపాలపురం గ్రామానికి చెందిన 16 సంవత్సరాల బాలికకు కడుపు నొప్పి రావడంతో సీహెచ్‌సీకి తీసుకొచ్చారు. ఆ సమయంలో కూడా డ్యూటీ డాక్టర్ లేరు. బాలికను ఉదయం డ్యూటీ డాక్టర్ వచ్చి కొవ్వూరు ఆసుపత్రికి తరలించారు. అన్నదేవరపేటకు చెందిన ఎలిపే ఇంద్రమ్మను గురువారం సాయంత్రం 4గంటలకు కొవ్వూరు ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అప్పటి డ్యూటీ డాక్టర్ ఉండ్రాజవరపు రాణికి షోకాజ్ నోటీసు జారీచేశామని గోపాలపురం ఆసుపత్రి సూపరింటెండెంట్ కె.చైతన్య తెలిపారు. దానికి సమాధానం ఇవ్వకపోవడంతో జిల్లా ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment