ప్రీమియం చెల్లించి పంటల బీమా చేసుకోవాలి
రాజమహేంద్రవరం సిటీ: రబీ వరి, మొక్కజొన్న పంటలకు రైతులు బీమా చేసుకోవాలని కలెక్టర్ ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన కరపత్రాలను కలెక్టరేట్‌లో ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాల వలన పంట దిగుబడి నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందజేయడం ఈ బీమా పథకం ముఖ్యోద్దేశమని చెప్పారు. రైతులు వరికి ఎకరాకు రూ.630 ప్రీమియం చెల్లిస్తే రూ.42 వేల బీమా లభిస్తుందన్నారు. అలాగే, మొక్కజొన్నకు ఎకరాకు రూ.540 చెల్లిస్తే రూ.36 వేల బీమా వస్తుందని చెప్పారు. ఈ నెల 31లోగా ప్రీమియం చెల్లించాలని సూచించారు. బ్యాంకుల ద్వారా పంట రుణం తీసుకునే రైతులు ఆయా బ్యాంకుల ద్వారా నేరుగా బీమా కంపెనీకి ప్రీమియం చెల్లిస్తారని తెలిపారు. పంట రుణాలు తీసుకోని రైతులు కామన్ సర్వీస్ సెంటర్, సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్, పోస్టాఫీసు ద్వారా ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లించవచ్చని పేర్కొన్నారు.
‘ఉపాధి’ ఏపీఓలకు
షోకాజ్ నోటీసులు
రాజమహేంద్రవరం రూరల్: పశువుల షెడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన రంగంపేట, కోరుకొండ, నల్లజర్ల ఉపాధి హామీ పథకం ఏపీఓలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ ప్రశాంతి డ్వామా పీడీని ఆదేశించారు. డ్వామా క్షేత్ర స్థాయి అధికారుల పని తీరుపై తన క్యాంపు కార్యాలయంలో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకంలో నూరు శాతం పని దినాలు సాధించాలని స్పష్టం చేశారు. ఈ నెలాఖరుకు జిల్లాకు కేటాయించిన 44 లక్షల పని దినాల లక్ష్యంలో ఇప్పటి వరకూ 42.90 లక్షలు పూర్తి చేశారని, మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. సగటు వేతనం రూ.256 చెల్లిస్తున్నామని, ఇది రూ.300కు చేరేలా పనుల గుర్తింపు ఉండాలని అన్నారు. రంగంపేట, సీతానగరం ఏపీఓలు లక్ష్యాలు సాధించకపోవడంపై వివరణ కోరారు. పనితీరు మెరుగుపడకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా 715కు గాను ఇప్పటి వరకూ 73 పశువుల షెడ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. 40 రూఫ్, 150 బేస్‌మెంట్, 386 ఫౌండేషన్ స్థాయిల్లోనే ఉండటంపై వివరణ కోరారు. పల్లె పండగ రహదారి పనులు జనవరి 12 కల్లా నూరు శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. 645 సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో 51 పూర్తి కాగా, 169 లేయర్ వరకూ వచ్చాయని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పనులపై ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ కొరవరడటంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. సమావేశంలో డ్వామా పీడీ ఎ.నాగమహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో రత్నగిరి సత్యదేవుని ఆలయ ప్రాంగణం గురువారం కిక్కిరిసిపోయింది. టూరిస్టు బస్సులు, వివిధ వాహనాల్లో శబరిమల వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో సత్యదేవుని దర్శించుకున్నారు. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయ ప్రాంగణంలో రద్దీ ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆలయం ప్రాంగణం, వ్రత మండపాలు భక్త జనసందోహంతో నిండిపోయాయి. సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించారని అధికారులు అంచనా వేశారు. సత్యదేవుని వ్రతాలు 1,200 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment