వైభవంగా ముగిసిన కోటసత్తెమ్మ తిరునాళ్లు
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ అమ్మవారి తిరునాళ్లు గురువారం రాత్రి వైభవంగా ముగిశాయి. ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసి, గరగలు ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరిసూర్యప్రకాష్ పర్యవేక్షణలో ఆలయం వద్ద ఉదయం చండీ పారాయణ, సాయంత్రం హోమాలు, ఊయల సేవ నిర్వహించారు. ప్రధానార్చకుడు అప్పారావుశర్మ కోటసత్తెమ్మ తల్లికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పూల గరగలు భక్తులను ఆకట్టుకున్నాయి. ముమ్మడివరపు బాలకోటయ్య బ్రదర్స్ సన్నాయిమేళం, గరగ నృత్యాలు, పిప్పర వారి కేరళ చండా మేళం మంత్రముగ్ధుల్ని చేశాయి. అనంతరం భారీగా కాల్చిన బాణసంచాతో ఆలయ పరిసరాలు వెలుగులు విరజిమ్మాయి. అమ్మవారిని దర్శించుకుని, సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment