ఆశాజనకంగా వర్జినియా
27,137 హెక్టార్లలో సాగు
ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతంలోని ఐదు వేలం కేంద్రాల్లో 2024–25 పంటకాలానికి 25,621 హెక్టార్లలో రైతులు పొగాకు సాగు చేస్తున్నారు. 12,270 మంది రైతులు ఉండగా, 14,145 బ్యారన్లను రిజిస్ట్రేషన్ చేశారు. 24,847 హెక్టార్లు రిజిస్ట్రేషన్ చేయగా, 774 హెక్టార్లలో అదనంగా పంట వేసినట్టు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అయితే బోర్డు అనుమతి లేకుండా దాదాపు రెండు వేల హెక్టార్లలో పంట సాగు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికి బాడవ భూముల్లో పలువురు రైతులు పొగాకు నాట్లు వేస్తున్నారు.
– తెగుళ్ల నుంచి తేరుకున్న పొగాకు తోటలు
– రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
– 27,137 హెక్టార్లలో పంట సాగు
– 12,270 మంది రైతులు
– 14,145 బ్యారన్ల రిజిస్ట్రేషన్లు
– కేంద్ర ప్రభుత్వానికి రూ.12,005 కోట్ల ఆదాయం
– మెట్ట ప్రాంతంలో ప్రధాన వాణిజ్య పంట
– అంతర్జాతీయ మార్కెట్‌కు దీటుగా పండిస్తున్న రైతులు
దేవరపల్లి: మన జిల్లాతో పాటు ఏలూరు జిల్లాలోని మెట్ట ప్రాంతంలో ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేస్తున్న వర్జినియా పొగాకు తోటలు ఆశాజనకంగా ఉన్నాయి. వాతావరణం అనుకూలించడం, తోటలకు అవసరమైన సూర్యరశ్మి ఉండడంతో తోటలు ఆశాజనకంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మొన్నటి వరకు నల్లకాడ, ఆకుముడత వంటి తెగుళ్లతో ఉన్న తోటలు ప్రస్తుతం తేరుకోవడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. తోటలు ఆశాజనకంగా ఉండడంతో రై తుల ఆశలు చిగురిస్తున్నాయి. రెండు జిల్లాల్లోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో పంట సాగు చేస్తున్నారు. 2024–25 పంట కాలానికి రైతులు బ్యారన్లకు రిజిస్ట్రే షన్ ప్రక్రియ పూర్తి చేసుకుని పంట సాగు చేస్తున్నారు.
58.75 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి
2024–25 పంట కాలంలో ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతంలోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో 58.75 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తికి పొగాకు బోర్డు అనుమతించింది. బ్యారన్‌కు 41.25 క్వింటాళ్లు చొప్పున రైతులు ఉత్పత్తి చేయవలసి ఉంది. గత ఏడాది బ్యారన్‌కు 35 క్వింటాళ్లు అనుమతి ఇవ్వగా, ఈ ఏడాది ఆరు క్వింటాళ్లు అదనంగా పండించడానికి అనుమతించింది. అయితే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో దాదాపు 80 మిలియన్ల కిలోల ఉత్పత్తి అవుతుందని అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది 48 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, 67 మిలియన్ల కిలోలు ఉత్పత్తి జరిగింది. గత ఏడాది మార్కెట్‌లో రైతులకు ఊహించని లాభాలు రావడంతో ఈ ఏడాది ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేస్తున్నారు. కిలో గరిష్ట ధర రూ.400 పలికి పొగాకు చరిత్రలో రికార్డు సృష్టించింది. దీంతో జీడిమామిడి, ఆయిల్‌పామ్, కొబ్బరి వంటి తోటలను తొలగించి పొగాకు పంట సాగు చేస్తున్నారు.
రూ.6,192 కోట్ల విక్రయాలు
2023–24 సంవత్సరం పంట కాలంలో రాష్ట్రంలోని 16 వేలం కేంద్రాల ద్వారా రూ. 6,192 కోట్ల విలువ గల 215 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి జరిగింది. 142 మిలియన్ల కిలోల ఉత్పత్తి లక్ష్యం కాగా, 205 మిలియన్ల కిలోలు ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే లక్ష్యాన్ని అధిగమించి 215.35 మిలియన్ల కిలోల ఉత్పత్తి జరిగింది. 2023–24 ఏడాది పొగాకు ఎగుమతుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సుమారు రూ. 12,005 కోట్ల ఆదాయం వచ్చింది. పొగాకు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటిస్థానంలో నిలిచినట్టు అధికారులు తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్‌కు దీటుగా సాగు
అంతర్జాతీయ మార్కెట్‌కు దీటుగా మన రాష్ట్రంలోని ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంత రైతులు వర్జినియా పొగాకు సాగు చేస్తున్నారు. ఎన్‌ఎల్‌ఎస్ (నార్తరన్ లైట్ సాయిల్) పొగాకుకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. బ్రెజిల్, జింబాబ్వే, కెన్యా దేశాలతో పోటీపడి ఇక్కడ రైతులు పంట సాగు చేస్తున్నారు. గత ఏడాది ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతంలో రూ.2,179 కోట్ల విలువ గల పొగాకు విక్రయాలు జరిగాయి. ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతంలోని ఐదు వేలం కేంద్రాల్లో సాగు చేస్తున్న పొగాకు విస్తీర్ణం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
సకాలంలో తల తుంచాలి
పొగాకు మొక్క మొగ్గల తలను సకాలంలో తుంచాలి. దీనివల్ల పిలకలను నివారించవచ్చు. దిగుబడి 15 నుంచి 20 శాతం పెరుగుతుంది. తలతుంచిన వెంటనే పిలకలు రాకుండా జిడ్డు మందు వాడాలి. నాణ్యమైన పొగాకును ఉత్పత్తి చేసి అంతర్జాతీయ మార్కెట్ నాణ్యత ప్రమాణాలకు దీటుగా ఎన్‌ఎల్‌ఎస్ ప్రతిష్టను ఇనుమడింప జేయాలి. పొగాకు తోటలు ఆశాజనకంగా ఉన్నాయి. సంక్రాతి పండగకు క్యూరింగ్‌లు ప్రారంభమవుతాయి. జంగారెడ్డిగూడెం ప్రాంతంలో క్యూరింగ్‌లు ప్రారంభించారు. రంగులు బాగున్నాయి. మొక్కకు 20 నుంచి 22 ఆకులు ఉంచి తల తుంచాలి. తెగుళ్ల నుంచి తోటలు కోలుకున్నాయి. ఇప్పటి వరకు 27,137 హెక్టార్లలో నాట్లు వేశారు.
– జీఎల్‌కే ప్రసాద్, రీజనల్ మేనేజర్,
పొగాకు బోర్డు, రాజమహేంద్రవరం
వేలం కేంద్రం రైతులు బ్యారన్లు విస్తీర్ణం
(హెక్టార్లలో)
దేవరపల్లి 2,395 2,703 4,813
జంగారెడ్డిగూడెం–1 2,437 2,895 5,780
జంగారెడ్డిగూడెం–2 2,673 2,923 5,849
కొయ్యలగూడెం 2,585 2,977 5,704
గోపాలపురం 2,180 2,646 4,994
Comments
Please login to add a commentAdd a comment