పండగ సంతోషం ఆవిరి
కుమార్తె మరణంతో
తీవ్ర విషాదం
కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురానికి చెందిన బత్తుల సత్యనారాయణ, లక్షీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారిలో మొదటి కుమార్తె లక్ష్మీ సురేఖ డిగ్రీ ద్వితీయ సంవత్సరం కాకినాడ పీఆర్ కళాశాలలో చదువుతోంది. రెండవ కుమార్తె సారిక దేవి 6వ తరగతి చదువుతోంది. సత్యనారాయణ తాపీ పని చేసుకుంటూ ఇద్దరి కుమార్తెలను చదివిస్తున్నాడు. ఇంతలో కుమార్తె లక్ష్మీ సురేఖ మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ప్రత్తిపాడు: సంక్రాంతి పండగను మూడు రోజులు అక్కాచెల్లెళ్లు, తోడల్లుళ్లు, వారి పిల్లలతో ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన ధారపల్లి జలపాతం వద్ద కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపి ఈ సంక్రాంతిని మరుపురాని తీపి జ్ఞాపకంగా మలచుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా బంధువులందరినీ ఒక్కచోటకు చేర్చి ధారపల్లి జలపాతానికి టెంపో వ్యాన్‌ను బుక్ చేసుకుని పయనమయ్యారు. అయితే హఠాత్తుగా దూసుకొచ్చిన రోడ్డు ప్రమాదం వారి సంతోషాన్ని ఆవిరి చేసింది. మరో పది కిలోమీటర్ల ప్రయాణిస్తే వారు ధారపల్లి చేరుకుంటారు. ఇంతలో అతి వేగంతో వెళ్తున్న వాహనం ఒమ్మంగి గ్రామం దాటిన తర్వాత గోపాలుడు చెరువు (చీకటి తోట) వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టడంతో వారి ఆనందాన్ని ఆవిరి చేసి విషాదాన్ని మిగిల్చింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గోపాలుడు చెరువు వద్ద గురువారం మధ్యాహ్నం టెంపో వ్యాన్ బోల్తా పడింది. పోలీసులు అందించిన సమాచారం మేరకు...
కాకినాడలోని తూరంగికి చెందిన కోమాకుల శ్రీనివాసరావు ఇంటికి తోడల్లుళ్లు, వారి కుటుంబీకులు హైదరాబాద్, విశాఖపట్నం, మిర్యాలగూడ నుంచి సంక్రాంతికి వచ్చారు. వీరితోపాటు తూరంగి, తిమ్మాపురం గ్రామాలకు చెందిన 28 మంది బంధువులతో కలిసి కాకినాడ ఎంఎస్‌ఎన్ చారిటీస్ సెంటర్ నుంచి వినాయక ట్రావెల్స్‌కు చెందిన టెంపో వాహనాన్ని బుక్ చేసుకొని డ్రైవర్‌తో కలిసి 29తో ప్రత్తిపాడు మండలంలోని ధారపల్లి జలపాతాన్ని సందర్శించేందుకు గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న టెంపో వాహనం ప్రత్తిపాడు మండలంలోని ఒమ్మంగి గ్రామం దాటిన తర్వాత గోపాలుడు చెరువు (చీకటి తోట) వద్ద మలుపులో అదుపుతప్పి రోడ్డుకు ఆనుకొని ఉన్న చెట్టు దుంగను ఢీకొని పంట కాలువలో బోల్తా పడింది. ఈ ఘటనలో తూరంగికి చెందిన కోమాకుల శ్రీనివాసరావు భార్య చంద్రావతి (40), తిమ్మాపురానికి చెందిన బత్తుల లక్ష్మీ సురేఖ (19) అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్‌తో సహా మరో 27 మంది గాయపడ్డారు. వీరిలో విశాఖపట్నంకు చెందిన దొడ్డి అంజలి, తూరంగికి చెందిన కూమాకుల శేషారత్నం, కోమాకుల రామలింగేశ్వరరావు, కోమాకుల శ్రీనివాసరావు, హైదరాబాద్‌కు చెందిన కోడూరి సాయిరాం తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో 4 నుంచి 9 తొమ్మిది సంవత్సరాల లోపు చిన్నారులు ఎనిమిది మంది గాయాల పాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇతర వాహనాలపై ధారపల్లి వెళ్తున్న మరికొంత మంది యాత్రికులు, స్థానికులు తక్షణం స్పందించి వాహనంలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి స్థానిక పోలీసులకు, 108 వాహనానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ప్రత్తిపాడు సీఐ బి.సూర్య అప్పారావు, ఎస్సై లక్ష్మీకాంతం తమ సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 వాహనంలో ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. క్షతగాత్రులను ప్రత్తిపాడు సీహెచ్‌సీ వద్ద ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పరామర్శించాడు. ప్రాథమిక చికిత్స అనంతరం గాయపడిన 27 మందిని కాకినాడలోనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సకాలంలో సహాయక చర్యలు చేపట్టడంతో ప్రాణనష్టం తగ్గింది. ప్రమాద సమయంలో వాహనంలో విలువైన బంగారు వస్తువులు, మొబైల్ ఫోన్లు వాహనంలోనే ఉండిపోయాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రమాద తీవ్రతను తగ్గించిన భారీ దుంగ
గోపాలుడు చెరువు వద్ద ఉన్న పంట కాలువను ఆనుకొని భారీ దుంగ ఉంది. ధారపల్లి జలపాతాన్ని తిలకించేందుకు వెళ్తున్న టెంపో వాహనం ఆ ప్రాంతంలో అదుపు తప్పి నేరుగా పంట కాలువలో బోల్తా కొట్టి ఉంటే ప్రమాద తీవ్రత మరింత దారుణంగా ఉండేది. కాలువలో బోల్తా కొట్టే ముందు కాలువకు ఆనుకొని ఉన్న భారీ దుంగను వాహనం ఢీకొంది. దీంతో వాహనం నేరుగా కాలువలోకి వేగంగా బోల్తా కొట్టకుండా ఆ దుంగ నియంత్రించింది. ఇదే జరగకుంటే మృతుల సంఖ్య మరింత పెరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. పండగ వేళ ఇంతటి ఘోర ప్రమాదం జరగడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.
మిన్నంటిన రోదనలు
కోమాకుల చంద్రవతి సంక్రాంతి పండగను ఉల్లాసంగా గడిపింది. మరింత సంతోషంగా తన కుటుంబ సభ్యులతో గడుపుదామని ధారపల్లి జలపాతానికి బయలుదేరగా ప్రమాదం రూపంలో ఆమెను మృత్యువు కబళించింది. ఆమె మృతి చెందడంతో ఆ బంధుగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రత్తిపాడు కమ్యునిటీ హెల్త్ సెంటర్ వద్ద మృతులు, క్షతగాత్రుల బంధువుల రోదనలు మిన్నంటాయి.
ఒమ్మంగిలో టెంపో వ్యాన్ బోల్తా
ఇద్దరు మృతి, 27 మందికి గాయాలు
వీరిలో ఐదుగురికి తీవ్ర గాయాలు
కాకినాడ నుంచి ధారపల్లి
జలపాతంకు వెళ్తుండగా ఘోరం
ఆస్పత్రి వద్ద హాహా కారాలు
కాకినాడ రూరల్: ప్రత్తిపాడు సీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అనంతరం అచ్చంపేట జంక్షన్ వద్ద గల మెడికవర్ ఆస్పత్రికి అంబులెన్స్‌ల్లో క్షతగాత్రులను తరలించారు. తమ శరీర భాగాలకు తగిలిన గాయాల నుంచి వస్తున్న అధిక రక్త స్రవంతోనే ప్రాణ భయంతో హాహాకారాలు చేశారు. మొత్తం 28మంది ఆస్పత్రిలో చేరగా వారిలో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉండగా అంజలిదేవి, రామలింగేశ్వరరావు, సాయిరామ్, శేషారత్నం పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలియజేశారు. 20మంది గాయాలతో కోలుకుంటుండగా వీరిలో చిన్నారులు హాసిని, విక్కి, అమృత, హిమన్ష్వి, సారిక, హర్ష, సితార, సాయి స్నేహత ఉన్నారు.
వైద్య నిపుణులు వీరికి సేవలు అందిస్తున్నారు. ఆస్పత్రి యూనిట్ హెడ్ సుభాకర్ వైద్యసేవలను పర్యవేక్షిస్తున్నారు.
బంధువులు కన్నీరు మున్నీరు
క్షతగాత్రుల బంధువులు ఆస్పత్రి వద్ద కన్నీరు మున్నీరయ్యారు. తమ వారికి ఏమయ్యిందో అంటూ ఆస్పత్రి వద్ద రోదనలు చేస్తూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పండగ కోసం తన బిడ్డ సోమశేఖర్ అత్తారింటికి కాకినాడ జగన్నాథపురం వద్ద గోపికృష్ణ కాలనీకి వచ్చారని విహార యాత్రకు వెళుతూ ప్రమాదానికి గురయ్యాడని తల్లి తిమ్మిశెట్టి భాగ్యలక్ష్మి, కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. సోమశేఖర్ తేరుకుంటున్నట్టు తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారు.
సురేఖ మృతితో తిమ్మాపురంలో విషాదం
బంధువులతో కలిసి సరదాగా విహార యాత్రకు వెళ్లిన తిమ్మాపురం గ్రామం పాత పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో నివాసం ఉంటున్న బత్తుల సురేఖ (18) మృతితో ఆమె కుటుంబం విషాదంలో ముగినిపోయింది. డిగ్రీ చదువుకుంటూ పండగ కోసం అమ్మమ్మ ఇంటికి వెళ్లిన సురేఖ మృతి గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పండగ పూట విషాదంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment