న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత డిమాండ్
రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.గిరిప్రసాద్‌వర్మ డిమాండ్ చేశారు. తమ సంఘం ఆధ్వర్యాన గత నెల 14న నిర్వహించిన సభలో కోరిన విధంగా తమ డిమాండ్లు నెరవేర్చేందుకు తక్షణ కార్యాచరణ ప్రకటించాలని కోరారు. బొమ్మూరులోని సంఘం జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన సంఘం అత్యవసర కార్యవర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బకాయిల విడుదలకు దశల వారీ కార్యాచరణ చేపడుతున్నారని, ఇది ఉద్యోగులకు ఏమాత్రం సంతృప్తి కలిగించదని చెప్పారు. ఇప్పటికై నా ప్రభుత్వం చొరవ తీసుకొని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిపి, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. సంఘం జిల్లా కార్యదర్శి సీహెచ్‌ఎస్ విల్సన్‌పాల్ మాట్లాడుతూ, వైద్య, ఆరోగ్య శాఖ, సచివాలయ ఉద్యోగుల సమస్యలపై లోతైన పరిశీలన చేశామని, త్వరలోనే తగిన కార్యాచరణ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని చెప్పారు. నూతన పేరివిజన్ కమిటీని నియమించాలని, తాత్కాలిక భృతి ప్రకటించాలని, సరెండర్ లీవ్, జీపీఎఫ్ ఏపీజీఎల్‌ఐ తదితర బకాయిలు, పెండింగ్ డీఏలు వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా తీర్మానించారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.రవికుమార్, ఎ.శ్రీనివాసరావు, రామగుర్రెడ్డి, శ్రీవల్లి, గూడూరి వెంకటరాజు, జె.రాజారావు కూడా మాట్లాడారు. సమావేశంలో సంఘం నగర అధ్యక్షుడు జీబీ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment