నేటి నుంచి హైవే భద్రతా మాసోత్సవాలు
పోస్టర్ ఆవిష్కరిస్తున్న జేసీ చిన్నరాముడు తదితరులు
● ఫిబ్రవరి 15 వరకూ నిర్వహణ
● హెల్మెట్‌పై ప్రత్యేక ప్రచారం
చేపట్టాలన్న జేసీ చిన్నరాముడు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రహదారులపై ప్రయాణం చేసే క్రమంలో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, రవాణా వ్యవస్థలోని అందరికీ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు అన్నారు. జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాల పోస్టర్‌ను జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ తదితరులతో కలసి ఆయన గురువారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకూ రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. వాహనాలు నడిపే వారికి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమావళి, హైవేలపై వాహనాలు నడిపే క్రమంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. హెల్మెట్ ధారణపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రహదారి భద్రతపై యువత, ఆటో డ్రైవర్లు, మహిళల్లో విస్తృత స్థాయిలో చైతన్యం తీసుకుని వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని జేసీ చిన్నరాముడు సూచించారు. జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ మాట్లాడుతూ, వాహన చోదకులకు, యువతకు, ఆటో డ్రైవర్లకు, భారీ వాహనాలు నడిపే వారికి ట్రాఫిక్ నియమావళిపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. రాజమహేంద్రవరం నగరంతో పాటు జిల్లావ్యాప్తంగా మండలాలు, మున్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో నెల రోజుల పాటు ఈ మాసోత్సవాలు నిర్వహించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశామని చెప్పారు. చోదకులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆయా శాఖాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment