సీటొస్తే నవోదయమే.. | - | Sakshi
Sakshi News home page

సీటొస్తే నవోదయమే..

Published Fri, Jan 17 2025 2:10 AM | Last Updated on Fri, Jan 17 2025 2:10 AM

సీటొస

సీటొస్తే నవోదయమే..

రాయవరం: ఉన్నత ప్రమాణాలతో కూడిన బోధన, క్రీడలు, సాహస కృత్యాలు, పౌష్టికాహారంతో పాటు వివిధ రంగాల్లో అధునాతన శిక్షణకు జవహర్‌ నవోదయ విద్యాలయాలు వేదికగా నిలుస్తున్నాయి. వీటిలో ప్రవేశాల కోసం ఏటా వేలాది మంది విద్యార్థులు పోటీ పడతారు. ఒకసారి 6వ తరగతిలో ప్రవేశం పొందితే +2(ఇంటర్‌) వరకు విలువలతో కూడిన ఉచిత విద్య లభిస్తుంది. నవోదయ విద్యాలయంలో ఆరవ తరగతిలో ప్రవేశానికి ఈ నెల 18న పరీక్ష నిర్వహించనున్నారు.

8,971 మంది విద్యార్థులు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో పెద్దాపురం జవహర్‌ నవోదయ విద్యాలయం ఉంది. 2025–26 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 80 సీట్లకు 8,971 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. కరోనా నేపథ్యంలో 2021లో 5,371 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోగా, 2022లో 10,741 మంది, 2023లో 8,779, 2024లో 8,506 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల అనంతరం విద్యార్థుల ఓఎంఆర్‌ షీట్లను మూల్యాంకనం కోసం ఢిల్లీకి పంపిస్తారు. అక్కడే విద్యార్థుల ఎంపిక జరుగుతుంది.

ఉమ్మడి జిల్లాలో 80 సీట్లు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి పెద్దాపురం నవోదయ విద్యాలయంలో 80 సీట్లు ఉన్నాయి. కాకినాడ జిల్లాలో 15, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో 17, తూర్పుగోదావరి జిల్లాలో ఏడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన చీఫ్‌ సూపరింటెండెంట్లు, డీవోలు, ఇన్విజిలేటర్ల నియామకం చేపట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద అత్యవసర సమయంలో ప్రాథమిక చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. 144 సెక్షన్‌ అమలవుతుంది.

80 ప్రశ్నలు..100 మార్కులు

పేపర్‌లో 80 ప్రశ్నలకు వంద మార్కులు కేటాయిస్తారు. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కులు ఉంటాయి. మెంటల్‌ ఎబిలిటీలో 40 ప్రశ్నలకు 50 మార్కులు, గణితంలో 20 ప్రశ్నలకు 25 మార్కులు, భాషా పరిజ్ఞానంలో 20 ప్రశ్నలకు 25 మార్కులు కేటాయించారు. విద్యార్థులు ఉదయం 10.30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 10.45 గంటలకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఆలస్యంగా కేంద్రానికి చేరుకుంటే పరీక్ష రాసేందుకు అనుమతి ఉండదు.

విద్యార్థులకు సూచనలివీ..

విద్యార్థులు రెండు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక హాల్‌ టికెట్‌ను ఇన్విజిలేటరుకు అందించాలి. ఏదో ఒక గుర్తింపు కార్డును విద్యార్థి వెంట తీసుకు వెళ్లాలి. బ్లూ లేదా బ్లాక్‌ పెన్నుతోనే పరీక్ష రాయాలి. పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థులు పాఠశాల యూనిఫామ్‌, లేదా సివిల్‌ డ్రెస్‌లో హాజరు కావచ్చు. ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు వెంట తీసుకురాకూడదు.

ఇవీ వివరాలు

జిల్లా పరీక్షా దరఖాస్తు చేసిన

కేంద్రాలు విద్యార్థులు

కోనసీమ 17 3,869

తూర్పుగోదావరి 07 1,439

కాకినాడ 15 3,663

ఉజ్వల భవిత..ఉన్నత ప్రమాణాలు

రేపు నవోదయ ప్రవేశ పరీక్ష

హాజరు కానున్న

8,971 మంది విద్యార్థులు

ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం

1.30 గంటల వరకు నిర్వహణ

ఏర్పాట్లు పూర్తి

నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇప్పటికే ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులతో పరీక్షను సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహించే విషయంపై చర్చించాం. పరీక్షా కేంద్రాల సీఎస్‌, డీవో, ఇన్విజిలేటర్ల నియామకం పూర్తి చేశాం. సెంటర్‌ లెవల్‌ అబ్జర్వర్లను నియమించి శిక్షణ ఇస్తున్నాం.

– కేఆర్‌ కృష్ణయ్య, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌, జవహర్‌ నవోదయ విద్యాలయ, పెద్దాపురం

డీఈవోలకు ఆదేశాలిచ్చాం

ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేందుకు డీఈవోలకు ఆదేశాలిచ్చాం. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.

– జి.నాగమణి, పాఠశాల విద్యాశాఖ,

ఆర్‌జేడీ, కాకినాడ

No comments yet. Be the first to comment!
Add a comment
సీటొస్తే నవోదయమే..1
1/2

సీటొస్తే నవోదయమే..

సీటొస్తే నవోదయమే..2
2/2

సీటొస్తే నవోదయమే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement