నేటి నుంచి ‘గాడ్’ జన్మదిన వేడుకలు
రాయవరం: మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) 89వ జన్మదిన వేడుకలు శుక్రవారం నుంచి పీఠంలో నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పీఠం అడ్మినిస్ట్రేటర్ వి.వి.బాపిరాజు గురువారం విలేకరులకు తెలిపారు. ఉదయం 10 గంటలకు జ్యోతి వెలిగించడం, గోపూజ, లక్ష్మీగణపతి హోమంతో ప్రారంభమయ్యే జన్మదిన వేడుకల సందర్భంగా పీఠంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
అరుణాచలేశ్వరుడి కల్యాణం
గాడ్ జన్మదిన వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు తమిళనాడులోని అరుణాచల దేవస్థానం ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అరుణాచలేశ్వరునికి ఆలయ సంప్రదాయంతో అభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు అరుణాచలేశ్వరుడు, అపితకుచాంబ దేవిల దివ్య కల్యాణం నిర్వహిస్తారు. 18న ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం వైఖానస పండితుల ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవిజయవేంకటేశ్వరస్వామి వారి దివ్య కల్యాణం నిర్వహించనున్నారు. సాయంత్రం విజయదుర్గా అమ్మవారికి ప్రత్యేక అర్చనలు, హారతులు నిర్వహిస్తారు. 19న ఉదయం గాడ్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విజయవేంకటేశ్వరస్వామి, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, వరసిద్ధి వినాయకుడు, భవానీ శంకరుడు, శ్రీరామచంద్రమూర్తి, శ్రీవిజయదుర్గాదేవి ఉత్సవ మూర్తులకు పుష్పయాగం నిర్వహిస్తారు.
పోస్టల్ స్టాంప్ ఆవిష్కరణ
గాడ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 19న జరిగే సభలో ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను ఆవిష్కరించనున్నారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఆర్.అనంతపద్మనాభరావు అధ్యక్షతన జరిగే సభలో అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టరు డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మ, నీతి అయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment