పురుగుమందు తాగి మృతి
పెరవలి: భార్య కాపురానికి రావటం లేదని మనస్తాపం చెందిన వ్యక్తి పురుగుమందు తాగి ప్రాణాలు విడిచాడు. పెరవలి ఎస్‌ఐ ఎం.వెంకటేశ్వరరావు గురువారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఖండవల్లి గ్రామానికి చెందిన పల్లేటి రవి (24) లంకమాల్లపల్లి గ్రామానికి చెందిన ఒక యువతిని 2021లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఒక అమ్మాయి పుట్టిన తరువాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావటంతో విడివిడిగా ఉంటున్నారు. ఎన్నిసార్లు కాపురానికి రమ్మన్నా రాకపోవటంతో తీవ్ర మనస్తాపం చెంది బుధవారం సాయంత్రం పురుగుమందు తాగి పంటచేలో పడిఉండటంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు.
గల్లంతైన యువకుడి
మృతదేహం గుర్తింపు
ఎస్.రాయవరం: అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం తీరంలో గల్లంతైన కాకర్ల మణికంఠ(22) మృతదేహం గురువారం నక్కపల్లి మండలం చినతీనార్ల తీరం సమీపంలో పోలీసులు గుర్తించారు. ఎస్‌ఐ విభీషణరావు వివరాల మేరకు.. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం సింహాద్రిపురం గ్రామానికి చెందిన మణికంఠ తుని మండలం లోవ కొత్తూరులో తన మేనమామ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం రేవుపోలవరం తీరానికి వచ్చి గల్లంతైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తీరంలో మునిగిన సాత్విక్‌ను మణికంఠ కాపాడబోయి కెరటానికి కొట్టుకుపోయాడు. ఒడ్డుకు కొట్టుకొచ్చిన మృతదేహానికి పంచనామా నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఎస్‌ఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment