రైతు రాబడి పెంచే చర్య హర్షదాయకం
● కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ
● సీటీఆర్‌ఐలో ఘనంగా నిర్కా అవతరణ దినోత్సవం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): రైతులు ఆదాయం పెంచే దిశగా జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ(నిర్కా) రూపాంతరం చెందడం హర్షదాయకమని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. మంగళవారం ఐసీఏఆర్–సీటీఆర్‌ఐ నుంచి ఐసీఏఆర్–ఎన్‌ఐఆర్‌సీఏ(నిర్కా)(జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ)గా రూపాంతరం చెందిన సందర్బంగా ఐసీఏఆర్–నిర్కా అవతరణ దినోత్సవాన్ని సంస్థ ప్రాంగణంలో డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అధ్యక్షతన నిర్వహించారు.
వేడుకకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, ఐసీఏఆర్ – నిర్కా లోగో, ఐసీఏఆర్ – నిర్కా భవన సముదాయం పేరును, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ నిర్కా వల్ల రైతులు భవిష్యత్తులో ఎంతో లబ్ధి పొందగలరన్నారు. సీటీఆర్‌ఐ పరిధిని పెంచుతూ పొగాకుతో పాటుపసుపు, మిరప, ఆముదం, అశ్వగంధ పంటలను చేర్చడం ఈ ప్రాంత రైతులకు ఉపయోగపడుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల ఆదాయం రెట్టింపు చేసే దిశగా, విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను పెంచి, వ్యవసాయాన్ని వాణిజ్యంగా తీర్చిదిద్ది, దిగుమతులను తగ్గించుకోవాలని కృషి చేస్తున్నారన్నారు. ఐసీఏఆర్–నిర్కా డైరెక్టర్ డాక్టర్ శేషుమాధవ్ మాట్లాడుతూ ఐసీఏఆర్–సీటీఆర్‌ఐ నుంచి ఐసీఏఆర్–నిర్కాగా రూపాంతరం చెందవలసిన ఆవశ్యకత, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికా మొదలైన అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేష్ ద్వారా వివరించారు. ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్(క్రాప్ సైన్సెస్) డాక్టర్ టీఆర్ శర్మ మాట్లాడుతూ ప్రస్తుత వాణిజ్య పంటలలో వోలటైల్ పదార్థాలపై దృష్టి సారించి, పరిశోధనలు చేపట్టాలని సూచించారు. గుంటూరు టుబాకో బోర్డు చైర్మన్ సీహెచ్ యశ్వంత్‌కుమార్ మాట్లాడుతూ గత 77 ఏళ్లుగా పొగాకు పరిశోధనలో అగ్రగామిగా నిలిచిన ఐసీఏఆర్ – సీటీఆర్‌ఐ, ఐసీఏఆర్ – నిర్కాగా అవతరించినప్పటికీ ఇతర పంటలతో పాటు పొగాకులో తన పరిశోధనలు కొనసాగిస్తూ రైతులకు తన సేవలు కొనసాగిస్తుందని ఆశించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు మాట్లాడుతూ సీటీఆర్‌ఐ ఏడు దశాబ్దాలుగా రైతు సేవలో కృషి చేసిందని అన్నారు. అటారి డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా మాట్లాడుతూ ఐసీఏఆర్–నిర్కా పొగాకు, పసుపు, మిరప, అశ్వగంధ, ఆముదం పంటల వాణిజ్య అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ సాంకేతికలను ఉపయోగించుకొని రైతు ప్రయోజనార్థంగా పనిచేయాలన్నారు.
ఐసీఏఆర్–ఎన్.ఐ.ఆర్.సి.ఎ. అవతరణ దినోత్సవ సందర్భంగా అతిథుల చేతులమీదుగా రీడిఫినింగ్ రీసెర్చ్: ట్రాన్స్‌ఫార్మేషన్ ఫ్రం సీటీఆర్‌ఐ టు నిర్కా అనే సాంకేతిక ప్రచురణను విడుదల చేశారు. సంస్థ పూర్వపు డైరెక్టర్ (యాక్టింగ్) డాక్టర్ టీజేకే మూర్తి, క్రాప్ ప్రొడక్షన్ హెడ్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ యు.శ్రీధర్, నాబార్డు డీజీఎం వై. సోమునాయుడు, రైతు ప్రతినిధులు గద్దె శేషగిరిరావు, పొగాకు బోర్డు మేనేజర్ దామోదర్, ఐటీసీ చీఫ్ మేనేజర్, డాక్టర్ బి.ఎస్.ఆర్. రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రైతులు, తమిళనాడు రాష్ట్ర అశ్వగంధ రైతులు, ఏపీసీఎంఎఫ్ ప్రకృతి వ్యవసాయ రైతులు, స్వచ్ఛంధ సేవా సంస్థ సభ్యులు, స్టేక్ హోల్డర్స్, కంపెనీ ప్రతినిధులు, ఐసీఏఆర్ సంస్థల శాస్త్రవేత్తలు, రాష్ట్ర వ్యవసాయ ఉద్యాన శాఖ పంటల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జీనోమ్ ఎడిటింగ్ ప్రయోగశాల ప్రారంభం
ఐసీఏఆర్–నిర్కాలో నూతనంగా ఏర్పాటు చేసిన జీనోమ్ ఎడిటింగ్ ప్రయోగశాలను ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టి.ఆర్.శర్మ ప్రారంభించారు. గ్రీన్‌హౌస్‌లోని జీనోమ్ ఎడిటింగ్ ద్వారా ఉద్భవించిన పొగాకు మొక్కలను పరిశీలించారు. ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కె.సుమన్‌కళ్యాణి ఉత్పత్తుల గురించి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment