తగ్గనున్న టెన్‌షన్
మార్చి 17 నుంచి పది పబ్లిక్ పరీక్షలు
పదో తరగతి పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. సోషల్ పరీక్షను రంజాన్ పర్వదినాన్ని బట్టి మార్చి 31 లేదా ఏప్రిల్ ఒకటో తేదీన నిర్వహించే అవకాశముంటుంది. పరీక్షల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేశారు. ఆరు సబ్జెక్టులకు ఏడు పేపర్లు మాత్రమే ఉంటాయి. సైన్స్ సబ్జెక్టు తప్ప మిగిలిన అన్ని సబ్జెక్టులకు 100 మార్కులకు ఒకే రోజు పరీక్ష ఉంటుంది. ఫిజిక్స్, బయాలజీలకు ఒక్కో సబ్జెక్టుకు 50 మార్కులకు రెండు రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి పరీక్షకు మధ్య ఒక రోజు విరామం ఇవ్వడం వల్ల విద్యార్థులకు కొంత విశ్రాంతి లభిస్తుంది.
● ఆరు సబ్జెక్టులు..ఏడు పేపర్లు
● ప్రతి సబ్జెక్టుకు 100 వంతున మార్కులు
● పరీక్షల్లో మార్పులతో
పది విద్యార్థులకు ఊరట
రాయవరం: పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం పలు మార్పులు చేపట్టింది. పదవ తరగతి పరీక్షలు అనగానే ఎక్కడ లేని హడావుడి ప్రారంభమవుతుంది. విద్యార్థులతో పాటుగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటారు. పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులకు ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం పరీక్షకు పరీక్షకు మధ్య ఒక రోజు విరామాన్ని కూడా ప్రకటించింది. పది పబ్లిక్ పరీక్షల్లో చేపట్టిన సంస్కరణలు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు కానున్నాయి. గతేడాది విద్యా సంవత్సరంలో మాదిరిగానే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఏడు పేపర్లుగా నిర్వహిస్తారు.
గతంలో ఇలా..
పదవ తరగతిలో కొన్నేళ్లపాటు 11 పేపర్లను నిర్వహించారు. హిందీ మినహా తెలుగు, ఇంగ్లిషు, గణితం, సోషల్ సబ్జెక్టుల్లో ప్రతి సబ్జెక్టుకు 50 మార్కుల వంతున రెండు పేపర్లు నిర్వహించేవారు. సైన్సులో ఫిజికల్ సైన్స్, బయాలజీ సబ్జెక్టుకు 50 మార్కుల వంతున రెండు పేపర్లు ఉండేవి. ఒక్కో పరీక్షను ఒక్కో రోజు వంతున 11 రోజుల పాటు పరీక్షలు నిర్వహించేవారు. కరోనా ప్రభావంతో 2019–20, 2020–21 విద్యా సంవత్సరాల్లో పబ్లిక్ పరీక్షలను రద్దు చేశారు. కరోనా తీవ్రత తగ్గడంతో 2021–22 విద్యా సంవత్సరంలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించగా, 11 పేపర్లను ఏడు పేపర్లకు కుదించారు. తెలుగు, హిందీ, ఇంగ్లిషు, గణితం, సోషల్ సబ్జెక్టులకు ఒక్కో పేపరుకు 100 మార్కులకు వంతున పరీక్ష నిర్వహించగా, ఫిజికల్ సైన్స్, బయాలజీ పేపర్లను ఒక్కో పేపరును 50 మార్కుల వంతున నిర్వహించారు.
ఈ ఏడాది పరీక్షలు ఇలా..
2022–23 విద్యా సంవత్సరంలో పది పబ్లిక్ పరీక్షలను ఆరు పేపర్లకు కుదించారు. తెలుగు, హిందీ, ఇంగ్లిషు, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో ఒక్కో సబ్జెక్టుకు 100 మార్కులకు పేపరు నిర్వహిస్తున్నారు. సైన్స్ సబ్జెక్టులో మాత్రం ఫిజికల్ సైన్స్, బయాలజీ సబ్జెక్టులకు సంబంధించి ఒకే ప్రశ్నాపత్రం ఇచ్చారు. అయితే జవాబులు మాత్రం వేర్వేరు సమాధాన పత్రాల బుక్‌లెట్స్‌లో రాయాల్సి వచ్చేది. గత విద్యా సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో పీఎస్, బయాలజీ జవాబు పత్రాలను సంబంధిత ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయడానికి వీలుగా ఇలా వేర్వేరు జవాబు పత్రాల్లో రాయించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి, పరీక్షల పట్ల ఉన్న భయాన్ని పోగొడుతుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో నిర్వహించే పది పబ్లిక్ పరీక్షల్లో కూడా ఆరు సబ్జెక్టులకు ఏడు పరీక్షలుగా నిర్వహిస్తున్నారు.
ఒత్తిడి తగ్గుతుంది
పది పబ్లిక్ పరీక్షల్లో ఆరు సబ్జెక్టులకు ఏడు పేపర్లు ఉండడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం నిర్వహించే 100 మార్కుల పేపరు మోడల్‌కు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం.
– బి.హనుమంతురావు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్, అమలాపురం
అంచనా వేసేందుకు వీలవుతుంది
100 మార్కులకు ఒకటే పేపరు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో భయాందోళనలు తగ్గుతాయి. విద్యార్థుల అకడమిక్ స్థాయిని కచ్చితంగా అంచనా వేయడానికి వీలవుతుంది.
– డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈవో, అమలాపురం
Comments
Please login to add a commentAdd a comment