పాఠశాల విద్య బలోపేతం
రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయరామరాజు సూచన
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో పాఠశాల విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఫలవంతమయ్యే సూచనలతో ముందుకు రావాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో మానవ వనరుల అధికారులు, హెచ్‌ఎంలతో ఆనం కళాకేంద్రంలో మంగళవారం నూతన విద్యా విధానంపై వర్క్‌షాప్ నిర్వహించారు. వర్క్‌షాప్‌కి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్.షణ్మోహన్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్, మునిసిపల్ కమిషనర్ కేతనగార్గ్, పాఠశాల విద్య ప్రాంతీయ ఆర్జేడీ జి.నాగమణి ఉభయగోదావరి జిల్లాల విద్యాశాఖాధికారులు హాజరయ్యారు. విజయరామరాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా మానవ వనరులు విభాగంలోని మేధావి వర్గంతో శిక్షణ కార్యక్రమాలను చేపట్టామన్నారు. అప్పర్ ప్రైమరీ పాఠశాలలో 6, 7, 8 తరగతి విద్యార్థులు ఉన్నచోట వారి సంఖ్యను బట్టి ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గ్రామంలో మోడల్ ప్రైమరీ పాఠశాల తప్పనిసరిగా వుండాలన్నారు. నూతన ప్రతిపాదిత విధానంలో విద్యార్థుల సంఖ్యను బట్టి శాటిలైట్ ఫౌండేషన్, ఫౌండేషన్, మోడల్ ప్రైమరీ, బేసిక్ ప్రైమరీ, హైస్కూల్‌గా పాఠశాలల ఉన్నతీకరణ చేయడానికి జిల్లాలో క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో 15 నుంచి 25 పాఠశాలలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీటిలో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు క్లస్టర్ మండల, జిల్లా స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. వారి అభిప్రాయాలను సమీకరించి ఒక సమగ్ర అధ్యయన నివేదిక రూపొందించనున్నామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డులో మోడల్ ప్రాథమిక పాఠశాలను గుర్తించడానికి పాఠశాలల పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు, క్లస్టర్ స్థాయి, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా పాఠశాల సామర్థ్యం, సహజ సంప్రదింపుల సమగ్ర అధ్యయనం ఆధారంగా గుర్తింపు ప్రక్రియ జరగాలన్నారు. దీనిలో జిల్లా పాఠశాల విద్యాధికారి, డిప్యూటీ, మండల విద్యా అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఇతర అనుబంధ శాఖల అధికారుల అభిప్రాయాలను సమీకరించనున్నామన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాల్య సంరక్షణ విద్య సజావుగా ఉండేలా, ఉమ్మడి అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలతో అనుసంధానించడం, సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రాలను మార్చడం ద్వారా ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టడం, ఆ మేరకు సూచనలు సలహాలు స్వీకరిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment