నిమ్మ రైతు డీలా
యాదవోలు టు కోల్‌కతా..
యాదవోలు మార్కెట్ నుంచి నిమ్మకాయలు ప్రధాన నగరాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడి రైతులే వ్యాపారులుగా మారి మార్కెట్లో కాయలు కొనుగోలు చేసి, కోల్‌కతా, ఒడిశా, విశాఖపట్నం, రాజమహేంద్రవరం వంటి నగరాలకు ఎగుమతి చేస్తారు. దళారీ వ్యవస్థకు చెక్ పెట్టి రైతులే కమిటీగా ఏర్పడి కాయలు కొనుగోలు చేస్తూంటారు. రైతుల నుంచి ఎటువంటి కమీషన్ తీసుకోకుండా గిట్టుబాటు ధరకు కాయలు కొంటారు. చుట్టుపక్కల పది మండలాల రైతులు యాదవోలు మార్కెట్‌కు నిమ్మకాయలు తీసుకు వచ్చి అమ్ముకుంటారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ మార్కెట్ పని చేస్తుంది.
దేవరపల్లి: మార్కెట్లో ధర బాగున్నప్పటికీ దిగుబడులు తగ్గడంతో నిమ్మ రైతులు నిరాశ చెందుతున్నారు. సాధారణంగా నిమ్మ తోటల నుంచి ఏటా ఆరుసార్లు దిగుబడులు వస్తాయి. అటువంటిది కొంత కాలం నుంచి నాలుగు పర్యాయాలకు మాత్రమే పరిమితం కాగా, ప్రస్తుతం రెండుసార్లు మాత్రమే దిగుబడి వస్తోంది. ఏటా వర్షాకాలంలో పూతలు వచ్చి డిసెంబర్, జనవరి నెలల్లో దిగుబడి వస్తూంటుంది. కానీ, గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన అధిక వర్షాలకు నిమ్మ తోటలు దెబ్బ తిన్నాయి. తోటలు ఇవక వేసి, పూతలు నేల రాలిపోయాయి. ఫలితంగా ఈ ఏడాది దిగుబడులు సగానికి పడిపోయాయని రైతులు చెబుతున్నారు. ఏటా వేసవి, దసరా (అక్టోబర్) సమయంలో నిమ్మకాయలకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది. ఈ రెండు సీజన్లలో వచ్చిన ఆదాయం రైతుకు లాభసాటిగా ఉంటుంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చిన పూతలకు ఫిబ్రవరి నుంచి దిగుబడి వస్తుంది. ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ నిమ్మకాయలకు మంచి ధర లభిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈసారి దిగుబడులు పడిపోవడంతో రైతులు డీలా చెందుతున్నారు.
కౌలు రైతు కుదేలు
జిల్లాలోని గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల, చాగల్లు, నిడదవోలు మండలాల్లోని సుమారు 3 వేల ఎకరాల్లో రైతులు నిమ్మ సాగు చేస్తూంటారు. అలాగే, రాజానగరం, కోరుకొండ మండలాల్లో కూడా నిమ్మ సాగు జరుగుతోంది. ఎక్కువ మంది కౌలు రైతులే నిమ్మసాగు చేపడుతున్నారు. గోపాలపురం, దేవరపల్లి నల్లజర్ల తదితర ప్రాంతాల్లోని రైతులు ఎకరం భూమిని రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలకు కౌలుకు తీసుకుంటారు. రెండేళ్లుగా నిమ్మకు మంచి ధర లభిస్తూండటంతో రైతులు కౌలు రేట్లు పెంచేశారు. వేసవిలో కిలో నిమ్మకాయలు రూ.70 నుంచి రూ.75 వరకూ పలికాయి. దీంతో నాలుగు డబ్బులు మిగులుతాయనే ఆశతో రైతులు ఎక్కువ రేటుకు భూములు కౌలుకు తీసుకుని నిమ్మ సాగు చేపట్టారు. తోటల సాగుకు ఎకరానికి రూ.30 వేల నుంచి, రూ.35 వేల వరకూ పెట్టుబడి పెట్టారు. పూత, పిందె దశ బాగున్న సమయంలో అధిక వర్షాలు వర్షాలు వారి ఆశలపై నీళ్లు జల్లాయి. దసరాకు యాదవోలు మార్కెట్‌కు రోజుకు 40 నుంచి 50 టన్నుల నిమ్మకాయలు వస్తాయని, ప్రస్తుతం 15 టన్నులు కూడా రావడం కష్టమని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకూ నష్టం వస్తుందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధర బాగున్నా.. దిగుబడులు లేవు
మూడేళ్ల క్రితం కాయల కోత కూలి డబ్బులు కూడా రాక చెట్ల కింద కాయలు రాలిపోయి ఉండేవి. కిలోకు రూ.3 మాత్రమే ధర లభించేది. అటువంటిది రెండేళ్లుగా మార్కెట్లో ధర ఆశాజనకంగా ఉంటోంది. వర్షాకాలంలో వినియోగం తక్కువగా ఉండటం వల్ల కొనే నాథుడు లేక సాధారణంగా ఆషాఢం, శ్రావణ మాసాల్లో మార్కెట్లో నిమ్మకాయలకు ధర తక్కువగా వస్తుంది. దసరా నుంచి మార్కెట్ ఊపందుకుంటుంది. కానీ, గత ఏడాది ఆషాఢం, శ్రావణ మాసాల్లో కూడా గిట్టుబాటు ధర లభించింది. దసరాకు కిలో రూ.45 నుంచి రూ.55 వరకూ పలికింది. ప్రస్తుతం కిలో నిమ్మకాయలకు రూ.35 ధర వస్తోంది. ధర బాగున్నప్పటికీ నిమ్మకాయల దిగుబడులు లేవని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం రోజుకు 200 బస్తాల (10 టన్నులు) కాయలు మాత్రమే మార్కెట్‌కు వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
ఫ అధిక వర్షాలకు రాలిపోయిన పూత
ఫ ధర బాగున్నా తగ్గిన దిగుబడులు
తోటలు ఎండిపోతున్నాయి
భూసారం తగ్గడం వల్ల వర్షాలకు తట్టుకోలేక తోటలు ఇవక వేసి, చెట్ల కొమ్మలు ఎండిపోతున్నాయి. కలుపు మందులు ఎక్కువగా కొట్టడం వల్ల చెట్టుపై ప్రభావం పడుతోంది. కలుపు మందుల పిచికారీ వల్ల కూడా భూసారం దెబ్బ తింటుంది. అధిక వర్షాలకు భూమిలో తేమ ఎక్కువగా ఉండి, రోజుల తరబడి ఆరకపోవడంతో ఊట వేసి పూతలు రాలిపోతున్నాయి. కలుపు మందు పిచికారీ చేయని తోటలు బాగున్నాయి. అవి వాడిన తోటలు దెబ్బ తిన్నాయి. దిగుబడి 50 శాతం తగ్గింది. మార్కెట్లో ధర బాగున్నప్పటికీ దిగుబడులు లేక ఆదాయం తగ్గింది. ఏడాదికి రెండు పంటల దిగుబడి వస్తోంది.
– సింగులూరి రామ్మోహనరావు, రైతు, యాదవోలు, దేవరపల్లి మండలం
కోలుకోలేని దెబ్బ
భారీ వర్షాల వల్ల నిమ్మ రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇవక వేసి ఆశాజనకంగా ఉన్న పూత, పిందెలు రాలిపోయాయి. దీని వల్ల దసరా పంట నష్టపోయాం. దసరాకు ఎకరాకు సుమారు 30 బస్తాల దిగుబడి వస్తుంది. అధిక ధరకు తోటలు కౌలుకు తీసుకుని, పెట్టుబడులు పెట్టిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం కిలో కాయల ధర రూ.35 ఉంది. రోజుకు 10 టన్నుల కాయలు మార్కెట్‌కు వస్తున్నాయి. శీతాకాలంలో గూడూరు, తెనాలి, కనిగిరి మార్కెట్లో నిమ్మకాయలకు డిమాండ్ ఉంది. వేసవిలో యాదవోలు మార్కెట్ ఊపందుకుంటుంది. ప్రస్తుతం మార్కెట్ నిలకడగా కొనసాగుతోంది.
– అనిశెట్టి సూర్యచంద్రరావు, రైతు, యాదవోలు, దేవరపల్లి మండలం
Comments
Please login to add a commentAdd a comment