ఇంటి నుంచి బయటకు వచ్చే దారేది!
నల్లజర్ల: మండలంలోని అనంతపల్లిలో ఓ వృద్ధురాలు మూడు రోజులుగా గృహ నిర్భంధంలో ఉంది. ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చే దారి లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 25 ఏళ్లుగా ఆమె ఉపయోగిస్తున్న దారిని ముందు ఇంటివారు మూసివేశారు. వివరాల్లోకి వెళితే.. అనంతపల్లి పాత పోస్టాఫీసు సమీపంలోని ఓ ఇంట్లో 65 ఏళ్ల మామిడి రూత్ నివసిస్తోంది. ఆమె భర్త జయరాజ్ పాస్టర్‌గా పనిచేస్తూ, పలు గ్రామాల్లో చర్చిలు, విద్యాసంస్థలను నిర్వహించేవారు. ఆయన మృతి చెందాక ఇల్లు నిర్మించుకుని రూత్ జీవిస్తోంది. దాదాపు 25 ఏళ్లుగా తన ఇంటి ముందున్న రోడ్డుపైనే రాకపోకలు సాగించేంది. ఇటీవల ఇంటి ముందున్న వారు ఆ దారిలో నడవడానికి ఆమెకు హక్కు లేదని, రాకపోకలు సాగించవద్దని ఆదేశించారు. ఎవ్వరూ నడవకుండా ముళ్లకంపలు అడ్డుగా వేశారు. దాదాపు నెల రోజుల నుంచి ఈ వివాదం జరుగుతోంది. రూత్‌తో పాటు మరో మూడు కుటుంబాలు ఆ దారినే వినియోగించేవారు. వారికి మరో ప్రత్యామ్నాయ మార్గం దొరికింది. కానీ రూత్ మార్గం మరో దారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. బాధితులందరూ ఈ సమస్యపై ఈ నెల 6న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
మూడు రోజులుగా అవస్థలు
ఆ దారిని నిలిపివేయడంతో మూడు రోజులుగా రూత్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. పాలు, కూరగాయలు, ఆహారం తెచ్చుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఆమె బంధువులను సైతం అక్కడకు రాకుండా ఎదురింటి వారు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంతో తనకు ప్రాణహాని ఉందని రూత్.. అధికారులకు విజ్ఞప్తి చేసింది. దీనిపై ఇన్‌చార్జి తహసీల్దార్ ఎస్‌వీకే నాయుడును వివరణ కోరగా.. ఫిర్యాదు పరిష్కారానికి ఆ ప్రాంతానికి వెళ్లామని, ఆ స్థలమంతా గ్రామకంఠం భూమిగా ఉందన్నారు. స్ధానికంగానే పరిష్కారం చేసుకోవాలని సూచించారు. ఈ విషయమై కోర్టులో రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఎటువంటి పోలీసు ఫోర్సు వినియోగించవద్దంటూ కోర్టు స్టే ఇచ్చిందన్నారు. వృద్ధురాలి గృహ నిర్బంధం విషయం కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత దృష్టికి బుధవారం మధ్యాహ్నం తీసుకెళ్లగా ఇన్‌చార్జి తహసీల్దార్, గ్రామ కార్యదర్శితో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయినా బుధవారం సాయంత్రం వరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
రహదారిని మూసేసిన పొరుగువారు
ఇంట్లోనే చిక్కుకుపోయిన వృద్ధురాలు
మూడు రోజులుగా ఆహారానికి అవస్థలు
Comments
Please login to add a commentAdd a comment