విశ్లేషణతో రోడ్డు ప్రమాదాల నివారణ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రమాదాలు జరిగిన ప్రదేశాల్లో, అక్కడ తీసుకున్న పరిష్కార మార్గాలపై విశ్లేషణ చేయాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవం –2025 సందర్భంగా జిల్లా రహదారుల భద్రత కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో గోల్డెన్ అవర్ లో తీసుకున్న చర్యలను సమీక్షించి, వాటిపై అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు. ఈ అధ్యయనాన్ని ఆర్ట్స్ కళాశాల అధ్వర్యంలో కేసుల వారీగా చేయాలని పేర్కొన్నారు. జాతీయ రహదారులు, ట్రాఫిక్ వారీగా, డీఎం హెచ్‌వోలు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం ముఖ్యం అన్నారు. రద్దీ సమయాల్లో ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ మళ్లింపుపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. పోలీసు, జిల్లా యంత్రాంగం సూచించిన 27 బ్లాక్ స్పాట్స్‌లో, 16 ప్రమాద కరమైన రహదారులు, 11 జంక్షన్ ప్రాంతాల్లో లైట్నింగ్, రబ్బర్ స్ట్రిప్స్‌ను జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని అదేశించారు. హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి పరిహారం అందజేయాల్సి ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా ఐఆర్‌ఏడీ (ఐరాడ్ – ఇంటిగ్రేటెడ్ రోడ్డు ప్రమాద డేటా) డేటా ఎంట్రీ నమోదు చేయడంలో సమన్వయ శాఖల అధికారులు కచ్చితంగా విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశాల్లో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రశాంతి
Comments
Please login to add a commentAdd a comment