మొక్కబడి వ్యాపారం | - | Sakshi
Sakshi News home page

మొక్కబడి వ్యాపారం

Published Thu, Jan 23 2025 12:16 AM | Last Updated on Thu, Jan 23 2025 12:15 AM

మొక్కబడి వ్యాపారం

మొక్కబడి వ్యాపారం

వ్యాపారం బాగోలేదు

ఏటా సీజనల్స్‌ వ్యాపారం బాగుండేది. అయితే ఈ ఏడాది సగం వ్యాపారం కూడా అవ్వలేదు. రూ.5 లక్షలు వెచ్చించి, చామంతి, గులాబీ, బంతి తదితర అలంకరణ మొక్కలు తీసుకువచ్చాం. వీటి నిర్వహణ, కూలిఖర్చులు, పొలాల శిస్తులను లెక్కేస్తే రూ.7 లక్షల నుంచి 8 లక్షల వరకు పెట్టుబడులు అవుతుంది. కానీ రూ.మూడు లక్షల విలువైన మొక్కలు కూడా అమ్మకం కాలేదు. ఎండలు పెరిగితే వీటిని కాపాడుకోవడం కష్టమవుతుంది. నష్టం తప్పేలా లేదు.

– వేంకటేశ్వరరావు, సీజనల్స్‌ వ్యాపారి, వేమగిరి.

కడియం: సంక్రాంతి పండగ వెళ్లిపోయింది కానీ.. కడియం ప్రాంత నర్సరీల్లో సీజనల్స్‌ మాత్రం వెళ్లలేదు. ఏటా నూతన సంవత్సర వేడుకలు, పండగ తదితర ముఖ్య రోజులను పురస్కరించుకుని నర్సరీ రైతులు పెద్ద ఎత్తున సీజనల్స్‌ తీసుకువస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి సేకరించి తెచ్చి, ఇక్కడ అభివృద్ధి చేసి అమ్మకాలు సాగిస్తారు. అయితే ఈ ఏడాది సీజనల్స్‌ వ్యాపారం దెబ్బతీసిందని పలువురు నర్సరీ రైతులు వాపోతున్నారు. ఏటా డిసెంబర్‌ ఆఖరి వారం మొదలు జనవరి నెల మొత్తం సీజనల్స్‌ కొనుగోలు చేసేందుకు వచ్చే సందర్శకులతో నర్సరీల వద్ద సందడి నెలకొంటుంది. అయితే అందుకు భిన్నంగా ఈ ఏడాది అంతంత మాత్రంగానే వ్యాపారం సాగిందని వివరిస్తున్నారు. తెచ్చిన స్టాక్‌లో సగం కూడా అమ్ముడు కాకపోవడంతో ఈ ఏడాది సీజనల్స్‌ వ్యాపారం నష్టం మిగిల్చిందంటున్నారు.

నామమాత్రంగా అమ్మకాలు

బంతి, చామంతి, ఐటమ్‌ రోజెస్‌, నాటు గులాబీ మొక్కలతో పాటు, అలంకరణకు వాడే మొక్కలు కూడా సీజనల్స్‌ జాబితాలో ఉంటాయి. అయితే ఈ ఏడాది వీటన్నిటి అమ్మకాల్లోను వెనుకబడ్డామని రైతులు వివరిస్తున్నారు. ముఖ్యంగా మంచు కురిసే సమయంలోనే ఆకట్టుకునే విధంగా ఉండే చామంతి, బంతి మొక్కల అమ్మకాలు కూడా నామమాత్రంగానే ఉండడం రైతులను ఆందోళన పరుస్తోంది. ప్రస్తుత సీజన్‌లో వీటిని అమ్మకపోతే, ఆ తరువాత వచ్చే వేసవిలో ఈ మొక్కలు కళను కోల్పోతుంటాయి. ఒకటి రెండు నెలలు అత్యంత ఆకర్షణీయంగా కన్పించే ఈ మొక్కలు తిరిగి వచ్చే ఏడాది మంచు సీజన్‌లోనే ఆ కళను పొందుతాయి. వీటిని ఇప్పుడు అమ్మకపోతే, వచ్చే సీజన్‌ వరకు కాపాడుకోవడం రైతుల తలకు మించిన భారంగా మారుతుంది. ఏటా ఈ సీజన్‌లో లక్షలాది మొక్కల అమ్మకాలు సాగేవి. ఈ ఏడాది అందుకు విరుద్ధంగా వ్యాపారం ఉందంటున్నారు. సీజన్‌ వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టి వీటిని ఇక్కడికి తెచ్చారు. అయితే అమ్మకాలు ఆశించినంతగా లేకపోవడంతో పెట్టుబడులు కూడా వస్తాయో? రావోనన్న ఆందోళన నెలకొంది. నర్సరీల్లో ప్రధాన ఆకర్షణగా ఉండే సీజనల్స్‌ అమ్మకాలు పడిపోవడానికి ప్రధాన కారణంగా కొనుగోలుదారుల్లో ఆసక్తి తగ్గడమేనంటున్నారు. ఈ మొక్కలు సైజుని బట్టి ఒక్కొక్క మొక్క రూ.100 నుంచి రూ.150 వరకు ధర పలుకుతాయి. కొనేవారు లేకపోవడంతో ధర తగ్గించి మరీ అమ్ముకోవాల్సి వస్తోంది. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెట్టుబడులు పెట్టి వీటిని తీసుకువచ్చారు. అయితే సగం సరకు కూడా అమ్మకం కాలేదంటున్నారు.

నర్సరీ రైతులకు నష్టాన్ని మిగిల్చిన సీజనల్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement