ప్రాణాలకు ప్రైవేటు గండం | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలకు ప్రైవేటు గండం

Published Fri, Jan 24 2025 2:15 AM | Last Updated on Fri, Jan 24 2025 2:16 AM

ప్రాణ

ప్రాణాలకు ప్రైవేటు గండం

రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహన చోదకుల

గుండెలదిరిపడేలా మితిమీరిన వేగం.. ముందు వెళ్తున్న వాహనాలను రయ్‌రయ్‌మంటూ అత్యంత ప్రమాదకరంగా తప్పించుకుంటూ దూసుకుపోవడం.. ఎదురుగా జంక్షన్లు వస్తున్నా ఏమాత్రం కానరాని వెరపు.. వీటన్నింటికీ తోడు కొంత మంది మద్యం తాగి మరీ స్టీరింగ్‌ తిప్పేస్తూండటం.. వెరసి ప్రైవేటు బస్సులు తరచుగా ప్రమాదాలకు గురవుతూ.. ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తీసుకువస్తున్నాయి.

ఇద్దరిని బలిగొన్న డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌

విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఇటీవల రాజమహేంద్రవరంలో ప్రయాణికులను ఎక్కించుకునేందుకు లాలాచెరువు నుంచి జైలు రోడ్డులో అతి వేగంగా వస్తూ.. ఆర్ట్స్‌ కళాశాల వద్ద ద్విచక్ర వాహనదారులను ఢీకొంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరు, చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ మద్యం తాగి బస్సు నడిపినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది.

అతి వేగంతో తాజా ఘటన

గామన్‌ వంతెన సమీపాన అగ్రహారం వద్ద బుధవారం రాత్రి కావేరీ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడటానికి మితిమీరిన వేగమే కారణమైంది. ఈ బస్సు విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్తోంది. బస్సును అతి వేగంగా నడుపుతున్న డ్రైవర్‌ గామన్‌ వంతెనపై రహదారికి మరమ్మతులు జరుగుతున్న విషయాన్ని దగ్గరకు వస్తేనే కానీ గుర్తించలేకపోయాడు. అకస్మాత్తుగా గమనించి కంగారు పడి బ్రేకు వేయడంతో అతివేగంగా ఉన్న ఆ బస్సు అదుపు తప్పింది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనదారుడిని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 25 మందికి పైగా గాయపడ్డారు.

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఎక్కువ మంది రైళ్లు, ఆర్టీసీ తర్వాత ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులనే ఆశ్రయిస్తూంటారు. రాత్రి వేళ ప్రయాణించే వారికి అనువుగా స్లీపర్‌ కోచ్‌లు, ఇతర సౌకర్యాలు ఎక్కువగా ఉండటంతో కొన్ని వర్గాల ప్రజలు ప్రైవేటు బస్సులకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే, అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, అధికారుల తనిఖీల లేమి వంటి కారణాలతో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు తరచుగా ప్రమాదాలకు గురవుతున్నాయి.

ఎందుకీ వేగం?

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల వేగానికి అంతే లేకుండా పోతోంది. దీనికి సమయం ఓ కారణం. చాలా బస్సులు ఎక్కువగా విశాఖపట్నం, కాకినాడ నుంచి హైదరాబాద్‌, చైన్నె, బెంగళూరు మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. విశాఖపట్నంలో బయల్దేరే సమయంలో ప్రతి బస్సులో సీట్లు పూర్తిగా నిండే వరకూ వేచి చూస్తున్నారు. తర్వాత అన్ని బస్సులూ ఒకేసారి బయలుదేరడం.. దీనికి తోడు విశాఖ నగరంలో ట్రాఫిక్‌ రద్దీ కారణంగా షెడ్యూల్‌లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనికితోడు జాతీయ రహదారికి ఆనుకున్న ప్రధాన ప్రాంతాల్లో వారి పాయింట్ల వద్ద ఆగి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. అక్కడి నుంచి తర్వాతి పాయింటుకు చేరుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రైవేటు బస్సుల వేగానికి పగ్గాలే ఉండటం లేదు.

బస్సు వెళ్తే బెంబేలే..

ట్రావెల్స్‌ బస్సు పక్క నుంచి వెళ్తున్న సందర్భాల్లో దాని వేగానికి, హారన్‌ శబ్దానికి ఆ రహదారిపై వెళ్తున్న ఇతర వాహదారులు, పాదచారులు సైతం భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ద్విచక్ర వాహనదారులు భయంతో అదుపు తప్పి పడిపోయి, గాయపడుతున్న దాఖలాలు కూడా ఉన్నాయి.

సుశిక్షితులైన డ్రైవర్లేరీ!

ట్రావెల్‌ బస్సుల పెరుగుదలకు అనుగుణంగా సుశిక్షితులైన డ్రైవర్లు దొరకడం లేదు. అధిక హార్స్‌పవర్‌ కలిగిన ఆ బస్సులు నడపడానికి ప్రత్యేక శిక్షణ అవసరం. అలా శిక్షణ పొందిన డ్రైవర్లు అధిక జీతాలు డిమాండ్‌ చేస్తూండటంతో ట్రావెల్స్‌ యజమానులు తక్కువ జీతానికి వచ్చే సాధారణ డ్రైవర్లకే ఆ బస్సులను అప్పగిస్తూ, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొంతమంది డ్రైవర్లు దురలవాట్లకు బానిసలై, మద్యం, గుట్కా వంటివి సేవించి స్టీరింగ్‌ తిప్పుతూ, అతివేగంగా బస్సు నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఆకస్మిక మలుపులు, ఇరుకు రహదారులు, డైవర్షన్ల వద్ద బస్సులను అదుపు చేయలేకపోతున్నారు. సాధారణంగా సాయంత్రం సమయంలో బయలుదేరే ఈ బస్సులలో ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. కానీ, ఒక డ్రైవర్‌, ఒక క్లీనర్‌తో సరిపెట్టేస్తున్నారు. రాత్రి సమయంలో మధ్యమధ్యన క్లీనరే బస్సులు నడుపుతున్న ఉదంతాలు కూడా ఉన్నాయి.

తనిఖీలు ముమ్మరం చేయాలి

ట్రావెల్స్‌ బస్సులు బయలుదేరుతున్న ప్రధాన పాయింట్ల వద్దనే అధికారులు తనిఖీలు చేస్తే ప్రమాదాలను నివారించేందుకు అవకాశం ఉంటుంది. విశాఖ నగరాన్ని దాటుతున్నప్పుడు శివారు ప్రాంతాల్లో కచ్చితంగా బ్రీత్‌ అనలైజర్‌తో ఆయా బస్సుల డ్రైవర్లను, క్లీనర్లను తనిఖీ చేయాలి. మార్గం మధ్యలో కూడా ఇటువంటి పరీక్షలు చేయాలి. దీనివలన వారు ఎటువంటి మత్తు పదార్థాలు సేవించినా బయటపడే అవకాశం ఉంటుంది. తక్షణం ఆ బస్సులను నిలిపివేయించి మరో డ్రైవర్‌ను ఇచ్చి పంపేవరకూ బస్సును కదలనీయకుండా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి.

తనిఖీలు చేస్తున్నాం

జాతీయ రహదారి మీదుగా నగరంలోకి బస్సులు వేగంగా ప్రయాణించకుండా తనిఖీలు చేస్తుంటాం. అప్పుడప్పుడు కొన్ని బస్సులు వేగంగా వస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. విశాఖ నుంచి హైదరాబాద్‌, చైన్నె, బెంగళూరు వెళ్లే బస్సులకు మార్గం మధ్యలో జాతీయ రహదారిపై రాత్రి వేళ తనిఖీలు చేసే అవకాశం తక్కువ. ప్రయాణికులు కూడా అసౌకర్యంగా భావిస్తారు. బస్సులు బయలుదేరే ముందే ఆ ట్రావెల్స్‌ నిర్వాహకులు డ్రైవర్లను తనిఖీ చేసి, పంపితే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చు. డ్రైవర్లు కూడా తాము నడిపే బస్సులో ఎన్నో కుటుంబాలు, జీవితాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలి. బస్సు ఎక్కిన ప్రయాణికుడు ఆ డ్రైవర్‌పై నమ్మకంతో ప్రశాతంగా నిద్రించే పరిస్థితి కల్పించాలి.

– ఆర్‌.సురేష్‌, జిల్లా రవాణా శాఖ అధికారి,

రాజమహేంద్రవరం

తరచుగా ప్రైవేట్‌ బస్సులకు ప్రమాదాలు

అతివేగం.. ప్రయాణికుల భద్రతతో చెలగాటం

మద్యం తాగి బస్సులు నడుపుతున్న డ్రైవర్లు

తూతూమంత్రంగా తనిఖీలు

రెండు రోజుల్లో ముగ్గురి మృత్యువాత

జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల ప్రమాదాల వివరాలు

సంవత్సరం ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు

2024 16 7 16

2025

(ఈ నెలలో) 2 3 25

కొనసాగుతున్న చికిత్స

కావేరీ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల్లో ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గురువారం తెల్లవారుజామున కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. శ్రీకాకుళానికి చెందిన చెల్లూరి కోటేశ్వరరావు, తలియ ధనలక్ష్మి, రేణుకలను జీజీహెచ్‌లో చేర్చారు. అయితే, రేణుకను ఆమె కుటుంబ సభ్యులు స్థానిక కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రాణాలకు ప్రైవేటు గండం1
1/1

ప్రాణాలకు ప్రైవేటు గండం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement