బాధితురాలికి ఊరట
స్పందించిన అధికారులు
నల్లజర్ల: అనంతపల్లిలో మూడు రోజులుగా గృహ నిర్బంధంలో ఉన్న మామిడి రూత్‌లక్ష్మికి ఊరట లభించింది. వృద్ధురాలు పడుతున్న ఇబ్బందులను వెల్లడిస్తూ ‘ఇంటి నుంచి బయటకు వచ్చే దారేది’ అంటూ ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన వార్తా కథనానికి కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత స్పందించారు. తక్షణం అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి తగు చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి తహసీల్దారు ఎస్.వి.నాయుడును ఆదేశించారు. ఈ మేరకు ఆర్‌ఐ వై.రాధాబాయి, వీఆర్వో సురేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీదేవి, మహిళా సంరక్షణ కార్యదర్శులు కనకదుర్గ, సుస్మిత ప్రియాంక వృద్ధురాలు రూత్‌లక్ష్మిని కలసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎదురింటి యజమాని పాటంశెట్టి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతోను అధికారులు మాట్లాడారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఇంతవరకు ఏవిధంగా దారి వినియోగించారో అదే కొనసాగించాలని సూచించారు. ఇంటి గుమ్మం ముందు ముళ్లకంపలు వేసిన మిగతా ఇళ్లవారి వద్ద వివరాలు సేకరించారు. వృద్ధురాలిని ఇబ్బందులకు గురి చేయవద్దని, ఆర్డీఓ ఉత్తర్వులను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment