జిల్లాలో 704 పోషణ వాటికలు
దేవరపల్లి: అంగన్‌వాడీ కేంద్రా ల్లోని గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు పోషక విలువలతో కూడిన ఆకుకూరలు, కూరగాయలు ఉచితంగా అందించడానికి సాక్షం కార్యక్రమం ద్వారా పోషణ వాటికలు ఏర్పాటు చేశామని జిల్లా స్రీ, శిశు సంక్షేమ అధికారి కె.విజయకుమారి తెలిపారు. దేవరపల్లిలో గురువారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఒక్కొక్కటి రూ.10 వేల చొప్పున జిల్లాలోని 704 అంగన్‌వాడీ కేంద్రాల వద్ద పోషణ వాటికల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.70.44 లక్షలు విడుదల చేసిందని తెలిపారు. జిల్లాలో 1,554 అంగన్‌వాడీ కేంద్రాలుండగా, సొంత భవనాలున్న 704 కేంద్రాల వద్ద పోషణ వాటికలు ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా 1,554 కేంద్రాల్లోని గర్భిణులకు, బాలింతలకు ఆకుకూరలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 1,554 కేంద్రాల పరిధిలో 93 వేల మంది పిల్లలున్నారన్నారు. జిల్లాలో మొత్తం 1.08 మంది గర్భిణులు, బాలింతలు, పిల్లలు ఉన్నారని వివరించారు. 950 అంగన్‌వాడీ కేంద్రాల మరమ్మతులకు ప్రభుత్వం రూ.3.50 కోట్లు మంజూరు చేసిందని ఆమె తెలిపారు. ఒక్కో అంగన్‌వాడీ కేంద్రం మరమ్మతులు, పెయింటింగ్‌కు రూ.9,500 చొప్పున మంజూరు చేసిందన్నారు. ఈ పనులను గ్రామ పంచాయతీలకు అప్పగించామని పీడీ విజయకుమారి చెప్పారు. కార్యక్రమంలో ఐఈసీడీఎస్ సీడీపీఓ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రెచ్చిపోయిన మట్టి మాఫియా
మట్టి ట్రాక్టర్లను అడ్డుకున్న వీఆర్వోపై దౌర్జన్యం
గోకవరం: మండలంలోని కామరాజుపేటలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. మట్టి ట్రాక్టర్లను అడ్డుకున్న వీఆర్వోపై మట్టి ట్రాక్టర్ డ్రైవర్లు దౌర్జన్యానికి దిగారు. స్థానికుల సమాచారం ప్రకారం.. గ్రామ శివారున పంట పొలాల నుంచి ఒక జేసీబీ, రెండు ట్రాక్టర్లతో మట్టిని వెలికితీసి సమీపంలోని లే అవుట్‌కు తరలిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న స్థానిక వీఆర్వో ధర్మరాజు అక్కడకు చేరుకుని, మట్టి ట్రాక్టర్లను అడ్డుకున్నా రు. దీంతో ట్రాక్టర్ డ్రైవర్లు వీఆర్వోపై దౌర్జన్యాని కి దిగారు. అడ్డు తప్పుకోకపోతే ట్రాక్టర్‌తో ఢీకొట్టి వెళ్లిపోతామని బెదిరింపులకు దిగారు. వీఆర్వో ఒక్కరే ఉండటంతో వారు మట్టి ట్రాక్టర్లను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటనపై తహసీల్దార్ ఆదేశాల మేరకు వీఆర్వో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్
రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలో జేఈఈ మెయిన్ పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ పి.ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని రాజీవ్‌గాంధీ విద్యా సంస్థల్లో జరిగిన పరీక్షలకు మొదటి ిషిఫ్ట్‌లో 886 మందికి 878 మంది హాజరయ్యారన్నారు. రెండో షిఫ్ట్‌లో 884 మందికి గాను 874 మంది హాజరయ్యారని తెలిపారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉందన్నారు.
ఆడపిల్లలు ఆణిముత్యాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆడపిల్లలు మన జాతి ఆణిముత్యాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె.ప్రకాష్‌బాబు అన్నారు. లింగ ఎంపిక నిషేధ చట్టం–2003పై అంగన్‌వాడీ, స్కానింగ్ సెంటర్ల ప్రతినిధులకు స్థానిక వెంకటేశ్వర నగర్‌లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో గురువారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇప్పటికీ, అజ్ఞానం, మూఢత్వంతో తల్లిదండ్రులు అబ్బాయి అయితే తమను కంటికి రెప్పలా చూసుకుంటాడని, తమ వద్దే ఉంటాడని భావిస్తున్నారన్నారు. ఈ రోజుల్లో అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒక్కటేనని, వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పించి, ఉన్నతంగా తీర్చిదిద్దాలని సూచించారు. సమాజంలో ఇప్పటికీ ఆడపిల్లల పట్ల అనాదరణ ప్రబలంగానే ఉందని, పుట్టబోయేది ఆడ శిశువని తెలియగానే, కొన్ని సందర్భాల్లో గర్భస్రావానికి సిద్ధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికితోడు సీ్త్ర భ్రూణ హత్యలు కూడా పెరుగుతూండటం, అత్యంత విచారకరమని అన్నారు. ఈ వివక్ష కారణంగా పలు రాష్ట్రాల్లో మహిళల సంఖ్య తగ్గిపోతూండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. వీటన్నింటినీ అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 1994లో ఒక చట్టం అమలులోకి తెచ్చిందని, దానినే 2003లో సమగ్ర సవరణలతో గర్భధారణ పూర్వ, గర్భస్థ పిండ ప్రక్రియ లింగ ఎంపిక నిషేధ చట్టంగా రూపొందించారని ప్రకాష్‌బాబు వివరించారు. వైద్యాధికారి డాక్టర్ ప్రసన్న మాట్లాడుతూ, లింగ ఎంపిక నిషేధం చట్టం గురించి విశదీకరించారు. ఈ చట్టాన్ని అతిక్రమించే వారికి విధించే శిక్షలు, జరిమానాల గురించి వివరించారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, స్కానింగ్, ఇమేజ్ సెంటర్లు పాటించాల్సిన నిబంధనలు, పాటించకపోతే జరిగే పరిణామాల గురించి వివరించారు. సమావేశంలో లీగల్ కం ప్రొహిబిషన్ ఆఫీసర్ ఎస్.శ్రీగౌరి, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై ఎస్‌కే కుమారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment