సమస్యలు పరిష్కరించండి సార్!
అన్నవరం: రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ శాఖ ఇన్‌చార్జి కమిషనర్‌గా ఆ శాఖ అదనపు కమిషనర్ కె.రామచంద్ర మోహన్‌ను పూర్తి అదనపు బాధ్యతలతో (ఎఫ్‌ఏసీ) నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఇన్‌చార్జి కార్యదర్శి, కమిషనర్‌గా పని చేసిన ఎస్.సత్యనారాయణను బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. రామచంద్ర మోహన్ గతంలో రెండు దఫాలు అన్నవరం దేవస్థానం ఈఓగా పని చేసిన విషయం విదితమే. ఇప్పుడు ఎఫ్‌ఏసీ కమిషనర్‌గా నియమితులవడంతో అన్నవరం దేవస్థానం సమస్యలపై ఆయన దృష్టి సారించాలని ఇక్కడి సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో వివిధ కార్యక్రమాలకు శ్రీకారం
అన్నవరం దేవస్థానం ఈఓగా పని చేసిన కాలంలో రామచంద్ర మోహన్ వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2010–12 మధ్య దేవస్థానంలో రూ.15 కోట్లతో 135 గదుల హరిహర సదన్ సత్రం, 36 హాల్స్‌తో విష్ణు సదన్ వివాహ మండపాల భవనం నిర్మించారు. అలాగే, 2023–24 మధ్య ఈఓగా పని చేసినప్పుడు రూ.3 కోట్లతో ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఏటా కార్తిక పౌర్ణమి నాడు ఉదయం 7 గంటల నుంచి జరిగే సత్యదేవుని గిరి ప్రదక్షిణతో మధ్యాహ్నం వరకూ అన్నవరం మెయిన్ రోడ్డు, రత్నగిరి ఘాట్ రోడ్లపై ట్రాఫిక్ స్తంభించిపోయి భక్తులు చాలా ఇబ్బంది పడేవారు. గత ఏడాది కార్తిక పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణను మధ్యాహ్నం 2 గంటలకు మార్చి, ఎటువంటి ఇబ్బందీ లేకుండా నిర్వహించారు. గతంలో ఈఓగా పని చేసిన ఆయన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న దేవస్థానానికి కమిషనర్ హోదాలో సహాయ సహకారాలు అందిస్తారనే అభిప్రాయం సిబ్బంఇలో వ్యక్తమవుతోంది.
నేతి కొనుగోళ్లపై దృష్టి సారించరూ..
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో అన్ని దేవస్థానాల్లో టెండర్ ద్వారా నేతి కొనుగోళ్లు నిలిపివేశారు. సహకార డెయిరీల నుంచే కొనుగోలు చేస్తున్నారు. అన్నవరం దేవస్థానంలో తయారు చేసే గోధుమ నూక ప్రసాదంలో ఉపయోగించే ఆవు నెయ్యి కొనుగోలుకు ఏటా సుమారు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ దేవస్థానం ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం సహకార డైరీల కొనుగోలు చేస్తున్న నేతికి ఇంకా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. గతంలో కిలో నెయ్యి టెండర్ ద్వారా రూ.584కే కొనుగోలు చేశారు. గత ఏడాది అక్టోబర్ 1 నుంచి నెయ్యి సరఫరాకు టెండర్ పిలవగా అతి తక్కువగా కిలోకి రూ.484కు దాఖలైంది. అయితే, ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఆ టెండర్‌ను కాదని సంగం డెయిరీ నుంచి కిలో రూ.590కి కొనుగోలు చేస్తున్నారు. ఇది టెండర్ ధరకంటే రూ.106 అధికం. ప్రతి నెలా 10 వేల కిలోల నుంచి 15 వేల కిలోల వరకూ కొనుగోలు చేస్తున్నారు. మూడు నెలలుగా ఈవిధంగా దాదాపు రూ.80 లక్షలు అధికంగా చెల్లించారు. ఈ నేపథ్యంలో నెయ్యి కొనుగోలుపై కమిషనర్ రామచంద్ర మోహన్ దృష్టి సారిస్తే దేవస్థానానికి మేలు జరుగుతుంది.
నిర్మాణాలకు నిధులేవీ!
దేవస్థానంలో రూ.90 లక్షలతో టోల్‌గేట్ నుంచి రత్నగిరికి రెండో మెట్ల దారి, రూ.20 కోట్లతో ఎస్‌ఆర్‌సీ సత్రం స్థలంలో 110 గదుల సత్రం, ఇంకా పశ్చిమ రాజగోపురం ముందు షెడ్డు నిర్మాణం వంటి పనులు కూడా ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, అందుకు అవసరమైన నిధులు దేవస్థానం వద్ద లేని పరిస్థితి. దీని కోసం డిపాజిట్లు విత్‌డ్రా చేయాల్సి ఉంటుంది. దీనిపై కూడా రామచంద్ర మోహన్ ఇక్కడి అధికారులకు మార్గదర్శనం చేయాలని దేవస్థానం వర్గాలు ఆశిస్తున్నాయి.
అన్నవరం దేవస్థానం
దేవదాయ శాఖ కమిషనర్‌గా రామచంద్ర మోహన్
గతంలో అన్నవరం దేవస్థానం ఈఓగా పని చేసిన అనుభవం
ఇక్కడి సమస్యలపై దృష్టి పెట్టాలని సిబ్బంది ఆశాభావం
Comments
Please login to add a commentAdd a comment