పోషణ వాటికలు భేష్
● జిల్లా కలెక్టర్ సంతృప్తి
● గర్భిణులకు ఆకుకూరల పంపిణీ
● అంగన్‌వాడీ కేంద్రాల పరిశీలన
దేవరపల్లి: అంగన్‌వాడీ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోషణ వాటికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సంతృప్తి వ్యక్తం చేశారు. వీటిని నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను అభినందించారు. దేవరపల్లి ఇందిరమ్మ కాలనీ, చిన్నాయగూడెం, యాదవోలు గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను గురువారం ఆమె పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ఆర్‌ఓ వాటర్ ప్లాంట్, ఇంకుడు గుంతలు, పోషణ వాటికలను పరిశీలించి, గర్భిణులు, బాలింతలకు ఆకుకూరలు పంపిణీ చేశారు. దేవరపల్లి ఇందిరమ్మ కాలనీలో పోషణ వాటికను పరిశీలించిన కలెక్టర్ అంగన్‌వాడీ కార్యకర్త సత్యవతిని అభినందించారు. అక్కడ పెంచిన ఆరు రకాల ఆకుకూరల గురించి ఆమెను అడిగి తెలుసుకున్నారు. అన్నీ ఒకేసారి కాకుండా వారం వ్యవధిలో అందుబాటులోకి వచ్చేలా ఆకుకూరలు పెంచాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు, ఐసీడీఎస్ అధికారులకు కలెక్టర్ సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. కేంద్రం నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలోని 78 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆర్‌ఓ వాటర్ ప్లాంట్లు, 173 కేంద్రాల వద్ద మరుగుదొడ్లు నిర్మించామని తెలిపారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రం వద్ద పోషణ వాటిక ఏర్పాటు చేసి, పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు సేంద్రియ పద్ధతిలో పండించిన ఆకుకూరలు, కూరగాయలు ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాల మరమ్మతులు, పెయింటింగ్, ప్రహరీల నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. యాదవోలులో ఉపాధి హామీ పథకం నిధులు రూ.40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను కూడా కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ అధికారి కె.విజయకుమారి, తహసీల్దార్ కె.రాజ్యలక్ష్మి, ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బీవీ గిరి, డ్వామా పీడీ ఎ.నాగమహేశ్వరరావు, డీఎల్‌డీఓ ఎ.శ్లీవారెడ్డి, ఈఓ పీఆర్‌డీ వై.రాజారావు, యాదవోలు సర్పంచ్ సున్నం వరప్రసాద్, పీఆర్ ఏఈ వినోధ్, పంచాయతీ కార్యదర్శి ఎన్.రవికిషోర్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు విజయశాంతి, శశికళ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment