లారీ ఢీకొని ఆటో డ్రైవర్‌ మృతి | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని ఆటో డ్రైవర్‌ మృతి

Published Mon, May 6 2024 1:25 AM

లారీ

నూజివీడు: ఆటోను లారీ ఢీకొన్న సంఘటనలో ఆటో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. హనుమంతులగూడెంకు చెందిన ఆటో డ్రైవర్‌ కర్నికోటి రాంబాబు (35) ఆదివారం ఆటో నడుపుకుంటూ నూజివీడు వస్తుండగా విస్సన్నపేట వైపు వెళ్తున్న లారీ వేగంగా వస్తూ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కాగా పాటు ఆటో డ్రైవర్‌ లారీ చక్రాల కింద పడటంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ప్రమాదం సంభవించినప్పుడు ఆటోలో ప్రయాణికులు ఎవరూ లేరు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

గోడ కూలి భవన నిర్మాణ కార్మికుడి మృతి

పోలవరం రూరల్‌: శిథిలావస్థలో ఉన్న ఇంటి గోడ కూలి భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందినట్లు స్టేషన్‌ హెచ్‌సీ కె.శ్రీనివాస్‌ చెప్పారు. పోలవరం గ్రామానికి చెందిన పోలవరపు వీరభద్రం (46) భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం తన ఇంటి సమీపంలో శిథిలావస్థలో ఉన్న ఇంటి గోడ వద్ద ఉండగా ఒక్కసారి గోడ కూలి మీద పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలవరం వైద్యశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ తెలిపారు.

మూగజీవాల దాహార్తి తీర్చేందుకు కృషి

పాలకొల్లు సెంట్రల్‌: వేసవిలో మూగ జీవాల దాహార్తి తీర్చేందుకు పలు చోట్ల నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నట్లు రామ్‌శ్లోక్‌ ఫౌండేషన్‌ సభ్యులు మంతెన గోపాలం చెప్పారు. ఆదివారం స్థానిక వెటర్నరీ ఆసుపత్రిలో రామ్‌శ్లోక్‌ ఫౌండేషన్‌, నెస్ట్‌ కన్సర్‌వేషన్‌ సొసైటీ ఆర్గనైజేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో నీటి తొట్టెలు పంపిణీ చేశారు. గోపాలం మాట్లాడుతూ పట్టణంలో రోడ్లపై తిరిగే గోవులు, కుక్కలు, పక్షులు వంటి మూగ జీవాలకు వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. రోడ్డుపై మూగజీవాల కొరకు నీటిని అందించాలనుకునే వ్యక్తులకు వీటిని పంపిణీ చేస్తామన్నారు. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ పాలకొల్లు, మాంటిస్సోరిస్‌ స్కూల్‌ లజపతిరాయ్‌పేట సంస్థలు ఒకొక్కరు రూ. 10 వేలు చొప్పున 100 తొట్టెలను అందజేశారన్నారు. నెస్ట్‌ ఆధ్వర్యంలో పట్టణంలో పలు కూడళ్లలో నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఇంటి వద్ద ప్రహరీలపై పక్షుల కొరకు నీటిని ఏర్పాటు చేయడానికి కూడా చిన్న కుండీలను ఏర్పాటుచే స్తున్నామన్నారు. నెస్ట్‌ ఆర్గనైజేషన్‌ సభ్యులు మనీష్‌, రామ్‌శ్లోక్‌ పౌండేషన్‌ సభ్యులు లేళ్ల వాసు, నంబూరి స్వామి, తాడి శ్రీనివాసు, చేగొండి ప్రభాకర్‌, గోటేటి రాజా, సలాది వేణు, గనిరాజు పాల్గొన్నారు.

లారీ ఢీకొని ఆటో డ్రైవర్‌ మృతి
1/1

లారీ ఢీకొని ఆటో డ్రైవర్‌ మృతి

Advertisement
Advertisement