ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణంపై నీలినీడలు | - | Sakshi
Sakshi News home page

ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణంపై నీలినీడలు

Published Thu, Sep 26 2024 12:58 AM | Last Updated on Thu, Sep 26 2024 12:58 AM

ఫిషిం

నరసాపురం: సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న నరసాపురంలో దశాబ్దాల కలగా ఉన్న ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో జిల్లాకు మంజూరు చేసిన ఈ భారీ ప్రాజెక్ట్‌ గత మూడు నెలలుగా పడకేసింది. ఎన్నికలకు ముందు పనులు ప్రారంభం కాగా నేడు అసలు హార్బర్‌ నిర్మాణం జరుగుతుందా? లేదా? అనే సందేహం వ్యక్తమవుతోంది. దీంతో తీరప్రాంత మత్స్యకారులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి పశ్చిమ జిల్లా అభివృద్ధిలోనే గీటురాయిగా మొత్తం గోదావరి జిల్లాలకు మణిహారంగా నరసాపురంలో మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణ పనులను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టింది. నరసాపురం మండలం బియ్యపుతిప్పలో మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి 2022 మే నెలలో ఏపీ మారిటైమ్‌ బోర్డు టెండర్లు పిలవగా, విశ్వసముద్ర సంస్థ పనులు దక్కించుకుంది. అప్పటి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపించడంతో ఈ ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులతో పాటు ఇతర సాంకేతిక అనుమతులు కూడా వెంటనే తెప్పించారు. టెండర్లు పిలవడంతో విశ్వ సముద్ర సంస్థ పనులు దక్కించుకుంది. రూ.429.43 కోట్లతో నిర్మించే హార్బర్‌కు సంబంధించిన ప్రాథమిక పనులు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించారు.

కూటమి సర్కార్‌ రాకతో పడకేసిన పనులు

కూటమి సర్కార్‌ వచ్చిన తరువాత ఈ ప్రాజెక్ట్‌ అంశంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తికావడం, ప్రాథమికంగా పనులు ప్రారంభమయ్యాయి. కూటమి సర్కార్‌ గద్దెనెక్కిన తరువాత పనులు చేపట్టడంలో విశ్వసముద్ర సంస్థ వెనకడుగు వేసినట్టు సమాచారం. దీంతో అసలు హార్బర్‌ కల సాకారమవుతుందా? లేదా? అనే సందేహం వ్యక్తయవుతోంది. 19 కిలోమీటర్లు సముద్ర తీరప్రాంతం ఉన్న నరసాపురంలో బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించాలనే డిమాండ్‌ దశాబ్దాలుగా ఉంది. ఈ ప్రాంతంలో 5 వేల మత్స్యకార కుటుంబాలు వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి.

తీరంలో అపార మత్స్యసంపద

మత్స్య సంపద, ఆక్వా ఎగుమతుల్లో ఉమ్మడి పశ్చిమ జిల్లాకు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. పశ్చిమ నుంచి దేశ, విదేశాలకు భారీగా ఆక్వా ఎగుమతులు జరుగుతుంటాయి. రొయ్యలు, చేపల సాగు పెరగడం ఆక్వా రంగం పుంజుకుంది. ఏటా కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యం ఆక్వా పుణ్యమాని జిల్లాకు వస్తోంది. ఇటు తీరప్రాంతంలో సముద్ర మత్స్యసంపదతో భారీగా ఆదాయం సమకూరుతుంది. ఏటా నరసాపురం తీరంలో రూ.300 కోట్ల విలువచేసే మత్స్య ఎగుమతులు సాగుతాయి. హార్బర్‌ లాంటి మౌలిక వసతులు ఉంటే మరో 40 శాతం ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంతోనే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హార్బర్‌ నిర్మాణానికి పూనుకుంది. బియ్యపుతిప్ప వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ను 600 ఎకరాల విస్తీర్ణంలో రూ.429.43 కోట్లతో నిర్మించ తలపెట్టి పనులు మొదలుపెట్టారు.

రూ 429.43 కోట్లతో హార్బర్‌ నిర్మాణానికి జగన్‌ సర్కార్‌ శ్రీకారం

గత 3 నెలల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడని వైనం

మత్స్యకారుల్లో ఆందోళన

హార్బర్‌ పూర్తి చేయాలి

ఫిషింగ్‌ హార్బర్‌ను దశాబ్దాలుగా మత్స్యకారులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ఖర్చు భరించేలా నిర్మాణానికి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం చేశారు. టెండర్లు పిలిచి, పనులు విశ్వసముద్ర సంస్థకు అప్పగించాం. పనులు ప్రాథమికంగా ప్రారంభమయ్యాయి. హార్బర్‌ నిర్మాణం చేయాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వం మీద ఉంది. కొత్త ప్రభుత్వం హార్బర్‌ నిర్మాణం పూర్తిచేస్తే మేం ఆనందిస్తాం.

– ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణంపై నీలినీడలు 1
1/1

ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణంపై నీలినీడలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement