కూటమిలో కుమ్ములాటలు
చింతలపూడి, పోలవరంలో టీడీపీ వర్సెస్ జనసేన
బుధవారం శ్రీ 30 శ్రీ అక్టోబర్ శ్రీ 2024
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లాలో కూటమికి బీటలు వారుతున్నాయి. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీ నేతలను, జనసేన నేతలు బహిరంగంగా విమర్శించడం, దెందులూరులో జనసేన నేతలను టీడీపీ నేతలు బహిరంగంగా విమర్శించడం ఇలా ప్రతి నియోజకవర్గంలో ఏదోక కుమ్ములాట సర్వ సాధారణమైపోయింది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో హడావుడి చేస్తూ సోషల్ మీడియాలో తారాస్థాయిలో మాటల యుద్ధానికి రెండు పార్టీల నేతలు తెరతీయడం చర్చనీయాంశంగా మారింది. నిన్న, మొన్నటి వరకు ఇసుక, మద్యం షాపుల పంచాయితీల్లో తర్జన భర్జనలు, మాటల యుద్ధం అంతర్గతంగా సాగినా తాజా పరిణామాలతో విభేదాలు రచ్చకెక్కాయి. తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను విమర్శించిన టీడీపీ నేతను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సోమ వారం జనసేన నేతలు ధర్నా చేశారు.
ఏలూరు జిల్లాలో కూటమి రాజకీయం మారుతుంది. జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలకు 4 టీడీపీ, 3 జనసేన దక్కించుకున్నాయి. ఈ క్రమంలో 7 నియోజకవర్గాల్లో రెండు పార్టీల శ్రేణుల మధ్య అంతర్గత సర్దుబాట్ల విషయంలో తరచూ విభేదాలు తలెత్తుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేనకు నామమాత్రంగా కూడా విలువ ఇవ్వడం లేదని, అలాగే జనసేన ఎమ్మెల్యే ఉన్నచోట టీడీపీ వాళ్లకు పనులు కావడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దెందులూరులో తారాస్థాయికి..
దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతలకు ఎన్నికలకు ముందు నుంచే పొసగడం లేదు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జనసేన ఇన్‌చార్జి ఘంటసాల వెంకటలక్ష్మి మధ్య విభేదాలు బహిరంగంగానే కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో అనేక పర్యాయాలు ఇద్దరు నేతలు పరస్పరం విమర్శించుకున్నారు. చింతమనేని గెలిచిన తర్వాత జనసేన నేతలు పట్టించుకున్న పరిస్థితే లేదు. ఈ క్రమంలో చింతమనేని వ్యతిరేకించినా నేతలందరినీ జనసేనలో చేర్చుకోవడంతో వివాదం చెలరేగింది. ఈ క్రమంలో కొల్లేరు టీడీపీ నేత శ్రీపర్రు సర్పంచ్ సోషల్ మీడియా వేదికగా కొల్లేరును పవన్‌కల్యాణ్ సర్వనాశనం చేస్తున్నాడని, జనసేన ఇన్‌చార్జి ఘంటసాల వెంకటలక్ష్మి శ్రీపర్రు గ్రామంలో ఎలా అడుగు పెడుతుందో చూస్తామని తీవ్ర ఆగ్రహంతో మాట్లాడారు. సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్టు చేయడం చర్చగా మారింది. దీనికి ప్రతిగా జనసేన నేతలు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్, ఎస్పీలకు వినతిపత్రం ఇచ్చి శ్రీపర్రు సర్పంచ్ సైదు గోవర్ధన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆదివారం ఏలూరు నగరంలో జరిగిన వారాల పండుగ (గంగానమ్మ సంబరాలు)లో ఫ్లెక్సీ విషయంలో వివాదం చెలరేగి జనసేన కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.
న్యూస్‌రీల్
టీడీపీ, జనసేన మధ్య
పెరుగుతున్న అగాధం
చింతలపూడిలో జనసేన పట్ల టీడీపీ వివక్ష
చింతలపూడి టీడీపీ నేతల తీరుపై జనసేన ఇన్‌చార్జి బహిరంగ విమర్శలు
దెందులూరులోనూ టీడీపీ, జనసేన మధ్య విమర్శల యుద్ధం
డిప్యూటీ సీఎంను విమర్శించిన వారిపై చర్యల కోసం జనసేన డిమాండ్
ఈ పరిణామాల క్రమంలో కూటమికి బీటలు పడేలా చింతలపూడి జనసేన ఇన్‌చార్జి మేకా ఈశ్వ రయ్య బహిరంగ విమర్శలు చేయడం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. కొద్ది రోజుల క్రితం పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో జన సేన నేతలతో జంగారెడ్డిగూడెంలో జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మేకా ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీడీపీ తీరుపె విమర్శలు చేశారు. గత నాలుగు నెలలుగా నియోజకవర్గంలో నామమాత్రపు ప్రాధాన్యం ఇవ్వకుండా టీడీపీ నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నా రని ప్రారంభోత్సవాలు, ఇతర అభివృద్ధి పనులకు కనీసం ఆహ్వానం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ఎన్నికలకు ముందు పొత్తులో భాగంగా చింతలపూడి అసెంబ్లీ టికెట్ టీడీపీకి కేటాయిస్తే చింతలపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ జనసేనకు ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు టీడీపీ నేతకే చైర్మన్ పదవి కట్టబెట్టడానికి స్థానిక ఎమ్మెల్యే సొంగా రోషన్, టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జనసేనను చిన్న చూపు చూస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం వాటా ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరికలు జారీ చేయడంతో చింతలపూడి రాజకీయం వేడెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment