పొంగిన గుండేటి వాగు
కుక్కునూరు: కుక్కునూరులో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి కుక్కునూరు–దాచారం మధ్యలో గుండేటి వాగు ఉప్పొంగింది. వాగు ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఇసుకలో బోరు పాయింట్ దింపేందుకు వెళ్లిన జేసీబీ కొట్టుకుపోయింది. జేసీబీ డ్రైవర్ వాహనాన్ని వదిలి ఒడ్డుకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నాడు.
దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి: కలెక్టర్
ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ కె. వెట్రిసెల్వి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, దుష్టశుక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీకని పేర్కొన్నారు. టపాసులు కాల్చేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
యోగా పోటీలకు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
నూజివీడు: ఈ నెల 29, 30 తేదీల్లో అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిర్వహించిన 68వ రాష్ట్ర స్థాయి అండర్–19 బాలబాలికల యోగాసన పోటీలలో నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు 12 మంది ప్రతిభ కనబర్చడంతో ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టు ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించింది. త్వరలో మహారాష్ట్రలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే జాతీయ స్థాయి యోగాసన పోటీలలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే 14 స్థానాలకు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు 11 స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. విజేతలను ఎస్‌జీఎఫ్ సెక్రటరీ రవికాంత, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, అభినందించారు.
కార్తీక మాసోత్సవాలకు ముస్తాబు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి ఉపాలయమై క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం కార్తీక మాసోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. వచ్చే నెల 2 నుంచి కార్తీకమాసం ప్రారంభం కానుంది. ఇప్పటికే దేవస్థానం సిబ్బంది ఆలయంలో చలువ పందిరిని నిర్మించారు. అలాగే రంగులతో ఆలయాన్ని, పరిసరాలను ముస్తాబు చేశారు. విద్యుద్దీప అలంకారాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
స్థల వివాదంలో పోలీసుల జోక్యం
ఏలూరు టౌన్: ఏలూరు పాత బస్టాండ్ సమీపంలో డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం వద్ద మూడు దశాబ్దాలుగా లీజుకు తీసుకున్న స్థలంలో వ్యాపారం చేస్తూ ఉపాధి పొందుతున్న కుటుంబంపై స్థల యజమాన్ని దౌర్జన్యానికి దిగడంతో బాధితులు ఆందోళనకు దిగారు. పోలీసు అధికారుల ప్రోద్బలంతోనే స్థల యజమాని తమను బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ బాధితులు ఆరోపించారు. వారి కథనం ప్రకారం.. ఏలూరుకు చెందిన బచ్చు సత్యనారాయణ 30 ఏళ్లుగా లీజు స్థలంలో పుల్లల ఆడితి నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేయగా వెంటనే ఖాళీ చేసి వెళ్లడం సాధ్యం కాదని చెప్పారు. స్థల యజమాని లీజుదారులను అక్కడ నుంచి పంపించేందుకు కొంతమంది వ్యక్తులను పంపి దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బడేటి చంటి క్యాంపు కార్యాలయానికి వెళ్ళి తమ గోడు చెప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment