పారిశుద్ధ్య కార్మికులకు నేటికీ అన్యాయం
ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానం పారిశుద్ధ్య కాంట్రాక్టులో అవకతవకలు కారణంగా నష్టపోయిన కార్మికులకు నేటికీ న్యాయం జరగలేదు సంబంధిత కాంట్రాక్టరు నుంచి దేవస్థానం అధికారులకు ఇంతవరకు సమాధానం అందలేదు. అయినా ఆ కాంట్రాక్టును ఇంకా కొనసాగిస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం 2022 అక్టోబర్ 1 నుంచి, 2024 సెప్టెంబర్ 30 వరకు పారిశుద్ధ్య పనులను సెవెన్‌హిల్స్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌కు అప్పగించింది. టెండర్ షరతుల ప్రకారం మినిమం 132 మంది సిబ్బందితో, 1,17,165 చదరపు మీటర్ల పరిధిలోని భవనాలు, ఓపెన్ ఏరియాల్లో పనులు జరిపించాలి. కార్మికులతో 3 షిఫ్టులుగా(ఒక్కో షిఫ్టు 8 గంటలు) పనులు చేయించాలి. నెలకు నాలుగు సెలవులు ఇవ్వాలి. కాంట్రాక్టరు ప్రతి నెలా కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐలు కట్టాలి. అదనంగా పనిచేసిన సమయానికి ఓటీలు చెల్లించాలి. ఆ నిబంధనలేవీ ఇక్కడ అమలు కాలేదు. 50 మంది కార్మికులను తక్కువగా నియమించి, రెండు షిఫ్ట్‌ల్లో (ఒక్కో షిఫ్టు 12 గంటలు) పనులు చేయించారు. నెలకు నాలుగు సెలవులు ఇవ్వకపోగా, ఒక్కరోజు సెలవు పెట్టినా జీతంలో కోత విధించారు. 8 గంటలకు బదులు 12 గంటలు పనిచేసినా ఓటీలు ఇవ్వలేదు. అత్యంత దారుణంగా సగానికి సగం పీఎఫ్ సొమ్మును దిగమింగారు. పర్యవేక్షించాల్సిన ఇంజనీరింగ్ విభాగ అధికారులు చోద్యం చూస్తూ కూర్చున్నారు.
కాంట్రాక్టును కొనసాగించడంపై సందేహాలు
ప్రతి నెలా కాంట్రాక్టరుకు పూర్తి బిల్లును ముట్టజెప్పారు. మరో ఏడాది పాటు పారిశుద్ధ్య కాంట్రాక్టు కాల పరిమితిని పొడిగించేందుకు ప్రయత్నించారు. ఈ అవకతవకలపై సాక్షిలో ఇటీవల వరుస కథనాలు ప్రచురితమయ్యా యి. వీటిపై స్పందించిన ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యనారాయణ మూర్తి ఆదేశాలతో సంబంధిత అధికారులు సెవెన్‌హిల్స్ కాంట్రాక్టరుకు 15 రోజుల లోపు సమాధానం చెప్పాలని సుమారు నెల క్రితం నోటీసు జారీ చేశారు. ఇంత వరకు కాంట్రాక్టర్ సమాధానం ఇవ్వలేదు. ఈ ఏడాది జులైలో కార్మికుల ఖాతాల్లో జమకాని పీఎఫ్ సొమ్ము కొద్దిరోజుల క్రితం జమైంది. ఇదిలా ఉంటే ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న సెవెన్‌హిల్స్ పారిశుద్ధ్య కాంట్రాక్టు గడువు గత నెలాఖరుతో ముగిసినప్పటికీ.. అధికారులు కుంటిసాకులు చెబుతూ ఇంకా అదే కాంట్రాక్టును కొనసాగిస్తుండటం విడ్డూరంగా ఉంది. అలాగే దేవస్థానం అధికారులు ఇచ్చిన నోటీసుకు కాంట్రాక్టర్ సమాధానం ఇవ్వకపోవడం, అధికారులు దాన్ని పట్టించుకోకపోవడం హాస్యాస్పదంగా ఉంది. అయితే పారిశుద్ధ్య కార్మికులు తమకు న్యాయం చేయాలని ఆ చినవెంకన్నను వేడుకుంటున్నారు. దీనిపై ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యనారాయణ మూర్తి వివరణ ఇస్తూ పారిశుధ్య కాంట్రాక్టరుకు తాము నోటీసు ఇచ్చామని, వారి నుంచి ఇంకా సమాధానం రాలేదని తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
పీఎఫ్, ఇతర అవకతవకలపై స్పందించని కాంట్రాక్టర్
అయినా కాంట్రాక్టును కొనసాగిస్తున్న శ్రీవారి ఆలయ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment