బడుగు జీవులపై ‘పిడుగు’ | - | Sakshi
Sakshi News home page

బడుగు జీవులపై ‘పిడుగు’

Published Thu, Oct 31 2024 2:27 AM | Last Updated on Thu, Oct 31 2024 2:28 AM

బడుగు

బడుగు జీవులపై ‘పిడుగు’

ఆ ఇంట్లో మరో విషాదం

కావలిపురం గ్రామానికి చెందిన విప్పర్తి వెంకటేశ్వరరావు గత కొన్నేళ్లుగా బాణసంచా తయారీ కేంద్రంలో పని చేస్తున్నారు. సీజన్‌ పూర్తయ్యాక ఇటుకల బట్టీలో పనిచేస్తుంటారు. వెంకటేశ్వరరావు, కుమారి దంపతులకు కుమారుడు, కుమార్తె కాగా కుమార్తె లక్ష్మీశోభకు గొల్లపల్లి సురేష్‌తో వివాహం చేశారు. అయితే 20 రోజుల క్రితమే అల్లుడు సురేష్‌ గుండెపోటుతో మృతి చెందాడు. ఇంతలోనే ఆ ఇంట్లో మరో ప్రమాదం ఎదురైంది. బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో వెంకటేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులు వీరే..

బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం

పిడుగు పడి భారీ విస్ఫోటనం

ఘటనా స్థలంలోనే ఇద్దరు దుర్మరణం, ఐదుగురికి తీవ్ర గాయాలు

ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో ఘటన

బాధితులంతా ‘పశ్చిమ’ వాసులు

తణుకులో ప్రాథమిక చికిత్స అనంతరం ఏలూరు తరలింపు

తణుకు: వారంతా రోజువారీ కూలీలు.. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు.. దీపావళికి వెలుగులు నింపే బాణసంచా తయారీలో నిమగ్నం అయ్యారు. దురదృష్టవశాత్తూ సమీపంలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడి.. ఆ పిడుగు ధాటికి బాణసంచా కేంద్రంలో విస్ఫోటనం సంభవించింది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా మరో ఐదుగురు తీవ్ర గాయాలపాయ్యారు. దువ్వ గ్రామానికి చెందిన వేగిరోతు శ్రీవల్లి (50), పెంటపాడు మండలం రావిపాడు గ్రామానికి చెందిన గుమ్మడి సునీత (35) ఘటనా స్థలంలోనే మృతి చెందగా కడిమి కుమారి (దువ్వ), చుక్కా పెద్దింట్లు (దువ్వ), మందలంక కమలరత్న (రావిపాడు), శీలం లక్ష్మి (రావిపాడు), విప్పర్తి వెంకటేశ్వరరావు (కావలిపురం)లకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే 90 శాతం కాలిన గాయాలు ఉండటంతో వీరందరినీ ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పరామర్శించి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.అరుణను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

బాధితులంతా రోజువారీ కూలీలే

బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేస్తున్న వారంతా రోజువారీ కూలీలే. ఏటా దీపావళికి రెండు నెలల ముందు నుంచి బాణసంచా తయారీ కేంద్రంలో కూలీలుగా పనిచేస్తుంటారు. ఈ కేంద్రంలో సుమారు 20 మంది కూలీలు పనిచేస్తున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు బాణసంచా తయారు చేస్తుంటారు. వీరికి రోజు వారి కూలీ రూ.300 నుంచి రూ.350 వరకు చెల్లిస్తున్నారని బాధితులు చెబుతున్నారు.

డబ్బులు ఎక్కువ వస్తాయని వెళితే..

తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన కడిమి కుమారి భర్త త్రిమూర్తులు కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. కుమారుడు జయరాజు తాపీ పని చేస్తున్నాడు. కొన్నేళ్లుగా ఐస్‌క్రీం ఫ్యాక్టరీకు వెళుతున్న కుమారి డబ్బులు ఎక్కువ వస్తున్నాయని రెండు నెలలుగా బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేస్తుంది. అనుకోని రీతిలో జరిగిన ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది.

నాలుగు రోజుల నుంచే వెళుతోంది..

పెంటపాడు మండలం రావిపాడు గ్రామానికి చెందిన మందలంక కమలరత్న, వెంకట్రావు దంపతులకు ఇద్దరు కుమారులు. వారు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. గత నాలుగు రోజుల నుంచే కమలరత్న బాణసంచా తయారీ పనిలోకి వెళుతోంది. అయితే కేంద్రంలో హఠాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.

రెండు నెలలుగా పనిచేస్తూ..

పెంటపాడు మండలం శీలం లక్ష్మి రెండు నెలలుగా బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేస్తోంది. ఆమె భర్త దుర్గారావు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. బాణసంచా కేంద్రంలో జరిగిన విస్ఫోటనంలో లక్ష్మికి తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.

నెలరోజులుగా పనిచేస్తూ..

తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన చుక్కా పెద్దింట్లు నెల రోజులుగా బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేస్తోంది. భర్త ముసలయ్య కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. సాధారణ రోజుల్లో పెద్దింట్లు వంట పనులకు వెళుతూ ఉంటుందని కుమార్తె ప్రసన్న ప్రవల్లిక చెబుతున్నారు.

ఏడేళ్ల క్రితం తల్లిదండ్రులు.. ఇప్పుడు భార్య

తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన వేగిరోతు రామ శివాజీ, శ్రీవల్లి దంపతులు. వీరికి కుమార్తె, కుమారుడు సంతానం. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు 9వ తరగతి చదువుతున్నాడు. తణుకులోని వెంకట్రాయపురంలో వీరు నివాసం ఉంటున్నారు. శివాజీ గతంలో తణుకు మండలం దువ్వ గ్రామంలోని వయ్యేరు గట్టు కింద బాణసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహించేవారు. సుమారు ఏడేళ్ల క్రితం దువ్వ గ్రామంలోని తన నివాసంలో బాణసంచా నిల్వలు పేలిపోవడంతో శివాజీ తల్లిదండ్రులు సజీవదహనం అయ్యారు. అయినప్పటికీ తయారీ కేంద్రం కొనసాగిస్తున్నారు. గతేడాది పశ్చిమగోదావరి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలకు అప్పటి కలెక్టర్‌ పి.ప్రశాంతి అనుమతులు ఇవ్వలేదు. దీంతో శివాజీ దువ్వ సమీపంలోని సూర్యారావుపాలెం గ్రామంలో పొలాల వద్ద షెడ్‌ ఏర్పాటు చేసుకుని బాణసంచా తయారీ ప్రారంభించారు. ఈ ఏడాది కూడా అన్ని అనుమతులు తీసుకుని మందుగుండు సామగ్రి తయారు చేస్తున్నారు. గత నెల రోజులుగా శివాజీకి సహాయంగా అతని భార్య శ్రీవల్లి తయారీ కేంద్రంలో పనులు చూసుకుంటోంది. దురదృష్టవశాత్తూ బుధవారం సాయంత్రం కొబ్బరిచెట్టుపై పిడుగుపడి దాని విస్ఫోటనం కారణంగా బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో శివాజీ భార్య వేగిరోతు శ్రీవల్లి ప్రాణాలు కోల్పియింది. దీంతో కుటుంబంలో తల్లిదండ్రులతోపాటు భార్యను కూడా తాను నమ్ముకున్న కుటీర పరిశ్రమ మింగేయడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
బడుగు జీవులపై ‘పిడుగు’ 1
1/5

బడుగు జీవులపై ‘పిడుగు’

బడుగు జీవులపై ‘పిడుగు’ 2
2/5

బడుగు జీవులపై ‘పిడుగు’

బడుగు జీవులపై ‘పిడుగు’ 3
3/5

బడుగు జీవులపై ‘పిడుగు’

బడుగు జీవులపై ‘పిడుగు’ 4
4/5

బడుగు జీవులపై ‘పిడుగు’

బడుగు జీవులపై ‘పిడుగు’ 5
5/5

బడుగు జీవులపై ‘పిడుగు’

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement