అంతర్రాష్ట్ర నేరస్తుడి అరెస్ట్
ఏలూరు టౌన్: జంగారెడ్డిగూడెంలో గురువారం జరిపిన వాహన తనిఖీల్లో అంతర్రాష్ట్ర నేరస్తుడు పట్టుబడ్డాడు. అతడిపై తెలుగు రాష్ట్రాల్లో సుమారు 80కిపైగా చోరీ కేసులు నమోదు కావడం గమనార్హం. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. కామవరపుకోట మండలం పాత కొండగూడెం గ్రామానికి చెందిన చీకట్ల సతీష్ అలియాస్ పండు టెన్త్ వరకూ చదివాడు. తడికలపూడి పోలీస్‌స్టేషన్‌లో డీసీ షీట్ కలిగిన బావ మానుకొండ అనిల్‌తో కలిసి నేరాలను ప్రారంభించాడు. 2009లో ఉమ్మడి ఏపీ అశ్వారావుపేట, నల్లజర్ల మండలాల్లో రాత్రివేళల్లో ఇంట్లో చోరీలు చేస్తూ మొదటిసారి అశ్వారావుపేట పోలీసులకు పట్టుబడ్డాడు. వారు సతీష్‌ను అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. బయటకు వచ్చిన తరువాత కూడా నేరప్రవృత్తి కొనసాగించాడు. ఏలూరు త్రీటౌన్, ఏలేశ్వరం, తడికలపూడి, చాగల్లు, ద్వారకాతిరుమల, లక్కవరం, సమిశ్రగూడెం, నరసాపురం, కాకినాడ, పాల్వంచ, జంగారెడ్డిగూడెం, హైదరాబాద్, రాజమహేంద్రవరం, పెదపాడు, దెందులూరు, కై కలూరు, సింగరాయకొండ, తాడేపల్లిగూడెం, దేవరపల్లి, గన్నవరం, ఆగిరిపల్లి ఇలా అనేక ప్రాంతాల్లో ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. అతడిపై ఏకంగా 80కిపైగా చోరీ కేసులు నమోదు కాగా వాటిలో 35 కేసుల్లో శిక్షలు కూడా అనుభవించాడు.
పీడీ యాక్ట్ కేసులు సైతం
చీకట్ల సతీష్ 2013లో బుట్టాయగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలో కామవరం గ్రామంలో ఒక వ్యక్తిని హత్య చేసి కారును చోరీ చేశాడు. ఈ కేసుల్లో అరెస్టయి జైలుకు వెళ్లాడు. ఇతడి నేరాలు శ్రుతిమించడంతో 2020లో పాల్వంచలో పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపగా 9 నెలలు అనంతరం రిలీజ్ అయ్యాడు. 2022లో తడికలపూడి పోలీసులు సైతం పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపగా 11 నెలలు జైలులో ఉన్నాడు. ఈ ఏడాది జూలైలో గంజాయి అక్రమంగా రవాణా చేస్తూ తడికలపూడి పోలీసులకు చిక్కటంతో జైలుకు వెళ్లాడు.
ఇద్దరు మహిళలపై దాడి.. రాబరీ
2024 జూలైలో గంజాయి కేసులో అరెస్ట్ అయిన చీకట్ల సతీష్‌కు జైలులో జంగారెడ్డిగూడెం వాసి వెల్డింగ్ పనులు చేసుకునే అబ్ధుల్లాతో పరిచయం ఏర్పడింది. అతనితో కలిసి జంగారెడ్డిగూడెం రాజులకాలనీలో అపార్ట్‌మెంట్ వద్ద పల్సర్ మోటారు సైకిల్‌ను చోరీ చేశాడు. ఈ క్రమంలోనే అబ్ధుల్లా, నక్కా కిషోర్ అనే ఇద్దరు ముందుగా వేసుకున్న పథకంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం సాగిపాడులోని ఒక ఇంట్లో ఈనెల 2న రాత్రి సతీష్, అబ్ధుల్లా భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలను ఇనుప రాడ్లతో తలపై కొట్టి, చేతులు, కాళ్లను కట్టేసి బంగారు ఆభరణాలు, వెండి, రూ.3 లక్షల నగదును దోచుకువెళ్లారు.
కేసును ఛేదించిన పోలీసులు
అత్యంత పాశవికంగా మహిళలను రాడ్లతో కొట్టి రాబరీ చేసిన దొంగలను పట్టుకునేందుకు పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో జంగారెడ్డిగూడెం డీఎస్పీ యూ రవిచంద్ర ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన ఏలూరు జిల్లా ఎస్‌బీ సీఐ బీ.ఆదిప్రసాద్, గణపవరం సీఐ ఎంవీ సుభాష్, జంగారెడ్డిగూడెం సీఐ కృష్ణబాబు ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఎస్సై ఎస్‌కే జబీర్, ఏఎస్సై ఎన్‌వీ సంపత్‌కుమార్, కానిస్టేబుళ్లు ఎస్‌కే షాజహాన్, ఏలూరు సీసీఎస్ సిబ్బంది నాగరాజు, రజనీకుమార్ బృందాలుగా ఏర్పడి నేరస్తులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా గురువారం జంగారెడ్డిగూడెంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా చీకట్ల సతీష్ పట్టుబడ్డాడు. అతడి నుంచి మోటారు సైకిల్, చోరీ సొత్తు 47.1/2 కాసుల బంగారు అభరణాలు, 4 కిలోల వెండి వస్తువులు, రూ.2,46,150 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అత్యంత ప్రతిభ చూపిన పోలీస్ అధికారులకు ఎస్పీ శివకిషోర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, నగదు పురస్కారాలను అందజేశారు. విలేకరుల సమావేశంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు ఉన్నారు.
కామవరపుకోట మండలానికి చెందిన చీకట్ల సతీష్‌గా గుర్తింపు
అతడిపై తెలుగు రాష్ట్రాల్లో 80కి పైగా కేసులు
వివరాలు వెల్లడించిన ఏలూరు జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్
Comments
Please login to add a commentAdd a comment