సాక్షి, భీమవరం: ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపిస్తున్నారు భీమవరంలోని ఇమ్మానియేల్ చిల్డ్రన్ హోంకు చెందిన విద్యార్థినులు. దేశీయ పోటీల్లో సత్తా చాటడం ద్వారా 9వ ఇంటర్నేషనల్ (క్లబ్) ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్ కేఎల్ మేయర్స్ కప్ పోటీలకు అర్హత సాధించారు.
ఈనెల 27 నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు మలేషియాలో జరిగే పోటీల్లో వీరు పాల్గొంటారు. బి.జేస్సీ (9వ తరగతి) చిల్డ్రన్ హోం నిర్వాహకుడు ఇమ్మానియేల్ కుమార్తె కాగా, మిగిలిన ఇద్దరూ నిరాదరణకు గురై చిన్ననాటి నుంచి చిల్డ్రన్‌హోంలో ఆశ్రయం పొందుతున్నవారే. డి. ప్రియ పదవ తరగతి, ఎన్ అశ్విని 9వ తరగతి చదువుతున్నారు.
కరాటే పట్ల వీరికున్న ఆసక్తిని గమనించిన ఇమ్మానియేల్ దాతల సహకారంతో గత ఐదేళ్లుగా పట్టణంలోని జఫాన్ హయాషీ –హా షిటో ర్యూ కై ఇండియా కోచింగ్ సెంటర్‌లో చేర్పించి శిక్షణ ఇప్పిస్తున్నారు. గతంలో ముగ్గురు విద్యార్థినులు జిల్లా, రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని పలు బెల్టులు, మెడల్స్ గెలుపొందారు.
ఇప్పటివరకు జెస్సీ తొమ్మిది బెల్టులు, 19 మెడల్స్ సాధించగా, ప్రియ రెండు బెల్టులు, ఐదు మెడల్స్, అశ్విని రెండు బెల్టులు, రెండు మెడల్స్ సాధించారు. ఈనెల 27 నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు కౌలాలంపూర్‌లోని తితీవాంగ్సా ఇండోర్ స్టేడియంలో జరిగే ఓపెన్ కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో వీరు పాల్గొంటారని ఇమ్మానియేల్ తెలిపారు. టీం మేనేజర్‌గా విజయభాస్కర్ నేతృత్వంలో 26వ తేదీన మలేషియాకు బయలుదేరి వెళతారన్నారు. వీరి ప్రయాణ ఖర్చులు కోసం దాతల సహకారం కోరుతున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment