జోన్–2 బాలికల గురుకుల పోటీలు ప్రారంభం
భీమడోలు: జోన్–2 బాలికల గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ క్రీడలు గురువారం పోలసానిపల్లి బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల కళాశాలలో ఆట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల నుంచి 29 కళాశాలలకు చెందిన 1050 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. తొలుత పోటీలను అడిషనల్ కార్యదర్శి సునీల్‌రాజ్‌కుమార్ ప్రారంభించారు. క్రీడాకారులు క్రీడాజ్యోతితో ప్రాంగణంలో ప్రదర్శన నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రిన్సిపాల్ వీవీ రమణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా సునీల్‌రాజ్‌కుమార్‌తోపాటు డీసీవో ఎన్.భారతి, జోనల్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శ్యామల, ఎంఈవోలు ఈదుపల్లి శ్రీనివాసరావు, అయినపర్తి భాస్కర్‌కుమార్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తిని చాటి క్రీడాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని ఆకాక్షించారు. తొలుత దేశ తొలి ప్రధాని నెహ్రూ, బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాలుగురోజులపాటు జరగనున్న ఈ పోటీల్లో తొలిరోజు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, త్రోబాల్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ కార్యక్రమాల్లో కళాశాల పీడీ సాయిలక్ష్మీ, వట్లూరు, జంగారెడ్డిగూడెం, ఆచంట, ద్వారకాతిరుమల, నూజివీడు, తుని గురుకుల పాఠశాల ప్రిన్సిపాళ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment