మద్ది హుండీ ఆదాయం రూ.45.64 లక్షలు
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయ హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. తాడేపల్లిగూడెం దేవదాయ ధర్మదాయ శాఖ తనిఖీదారు సీహెచ్ ఉదయ్‌కుమార్ బాబు, లక్కవరం ఏఎస్సై భాస్కర్ పర్యవేక్షణలో హుండీ ఆదాయం లెక్కింపు నిర్వహించారు. కేవీబీ బ్యాంక్ సిబ్బంది సమక్షంలో హుండీ లెక్కింపు నిర్వహించగా, 51 రోజులకు గాను దేవాలయ హుండీల ద్వా రా రూ.43,77,549, అన్నదానం హుండీ ద్వా రా రూ.1,87,021, వెరశి మొత్తం ఆదాయం రూ.45,64,570 వచ్చినట్లు ఈవో, ఆలయ సహాయ కమిషనర్ ఆర్‌వీ చందన తెలిపారు.
ఉరి వేసుకుని యువకుడు మృతి
చింతలపూడి: చింతలపూడి మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన రేగుల శ్రీనివాసరావు (17 ) చెట్టుకు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గురువారం ఉదయం స్థానికులు శ్రీనివాసరావు మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే శ్రీనివాసరావు బుధవారం రాత్రి సమీపంలోని తోటలో చెట్టుకి ఉరేసుకుని చనిపోయినట్లు భావిస్తున్నారు.
కల్తీ పెట్రోల్ విక్రయాలు ఆపాలని ఆందోళన
పెట్రోల్ బంక్ సిబ్బందిపై
వాహనచోదకుల ఆగ్రహం
బుట్టాయగూడెం: కల్తీ పెట్రోల్ విక్రయాలు ఆపాలంటూ గురువారం ద్విచక్ర వాహనచోదకులు బుట్టాయగూడెం శివాలయం సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఆందోళనకు దిగారు. గత కొద్దిరోజులుగా అనేకమంది వాహనదారులు ఇక్కడ కొట్టిస్తున్న పెట్రోల్ కారణంగా తమ వాహనాలు పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ పెట్రోల్ విక్రయాలు ఆపాలని, తమకు జరిగిన నష్టంపై సమాధానం చెప్పాలని పెట్రోల్ బంక్ సిబ్బందిని నిలదీశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు వాహనదారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే కల్తీ పెట్రోల్ విక్రయాలు నిలిపి వేయాలని వాహనదారులు పట్టుపట్టారు. దీంతో రెవెన్యూ అధికారులు పెట్రోల్ శాంపిల్స్‌ను తీసుకుని పరీక్షలకు పంపించారు. పరీక్షల రిపోర్టు వచ్చేవరకూ విక్రయాలు నిలిపివేశారు. ఇక్కడ పెట్రోల్ వినియోగించిన సుమారు 50 వాహనాల వరకూ పాడైపోయినట్లు వాహనదారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment