మెషీన్‌లో పడి వలస కూలీ మృతి
తాడేపల్లిగూడెం రూరల్ : పొట్ట చేతపట్టుకుని వచ్చిన వలస కార్మికుడు ప్రమాదవశాత్తు మినుము ఆడే మెషీన్‌లో పడి మృతి చెందిన ఘటన గురువారం తాడేపల్లిగూడెం మండలంలోని నీలాద్రిపురం పంచాయతీ పరిధి కృష్ణాపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా రాజాం మండలం రాజాం గ్రామం నేతల వీధికి చెందిన పాతుల విష్ణు (30) గత పది రోజుల క్రితం మరో ఆరుగురు కూలీలతో కలిసి తాడేపల్లిగూడెం మండలానికి మినుము ఆడే పనిపై వచ్చాడు. గురువారం ఉదయమే కృష్ణాపురం ఆయిల్‌పామ్ వెయింగ్ మెషిన్ సమీపంలోని పొలంలో మినుము ఆడుతుండగా బరకం మెషీన్‌లోకి లాగేయడంతో మెషీన్‌లో ఇరుక్కుని తల నుజ్జయింది. దీంతో విష్ణు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. దీంతో మృతుని కుటుంబానికి న్యాయం చేసే వరకు మెషిన్‌లో నుంచి మృతదేహాన్ని తీసేది లేదంటూ సహచర కార్మికులు పట్టుబట్టారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కార్మికులతో చర్చించారు. ఎట్టకేలకు విష్ణు మృతదేహాన్ని బయటకు తీసి తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విష్ణుకి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment