అమిత్‌షా వ్యాఖ్యలపై మండిపాటు
ఏలూరు (టూటౌన్): కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా స్థానిక పాత బస్టాండ్ సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అంబేడ్కర్‌ను అవమానించేలా మాట్లాడారంటూ దిష్టిబొమ్మ దహనం, కొవ్వొత్తులతో నిరసన తెలుపుతూ అమిత్‌షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం షెడ్యూల్ కులాల వారిని అవమానించిన అమిత్‌షాపై కేసు పెట్టాలన్నారు. భారతీయ బౌద్ధమసభ, సమతా సైనిక దళ్ రాష్ట్ర అధ్యక్షుడు బేతాళ సుదర్శనం, దాసి లీలా మోహన్, బేతాళ నాగరాజు, చొప్పల సాయిబాబా, ఎ.సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
భౌగోళిక గుర్తింపునకు కృషి
తాడేపల్లిగూడెం: ఉద్యాన పంటలకు భౌగోళిక గుర్తింపు తీసుకురావడానికి డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి చేస్తోందని వక్తలు అన్నారు. వెంకట్రామన్నగూడెంలో ఉద్యాన పంటల ఉత్పత్తుల్లో భౌగోళిక గుర్తింపు, విధానాలు, ప్రక్రియలు అనే అంశంపై గు రువారం ఆన్‌లైన్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐపీఆర్ రిసెల్యూట్ హెడ్ సుభజిత్ సాహా మాట్లాడుౖౖౖతూ భౌగోళిక గుర్తింపు అప్లికేషన్ పద్ధతులు, లోగో తయారీ, సాంకేతిక అవసరాలపై అవగాహన కల్పించారు. ఉద్యాన వర్సిటీ వీసీ కె.గోపాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉద్యాన పంటలకు హబ్‌గా మారిందన్నారు. దుర్గాడ మిరప, అరటి సుగంధాలు, పోలూరు వంకాయ, కాకినాడ రోజ్, నూజివీడు చిన్నరసాలు, పండూరి వారి మామిడి, బాపట్ల వంకాయ, మైదుకూరు పసుపునకు భౌగోళిక గుర్తింపు సాధించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పరిశోధన సంచాలకులు ఎం.మాధవి మాట్లాడుతూ భౌగోళిక గుర్తింపు సాధించేందుకు సహకారం అందిస్తామన్నారు. రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు, డీన్ ఆఫ్ హార్టీకల్చర్ ఎల్.నారం నాయుడు, డీన్ ఆఫ్ పీజీ స్టడీస్ కేటీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.
21న పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ ఎన్నిక
భీమవరం (ప్రకాశంచౌక్): గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపికకు ఈనెల 21న ఎన్నికలను నిర్వహించేందుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు కలెక్టర్ నాగరాణి తెలిపారు. భీమవరం కలెక్టరేట్‌లో కమిటీకి సంబంధించి ఒక అధ్యక్ష, ఒక ఉపాధ్యక్ష పదవులకు అభ్యర్థులను ఎంపికచేస్తామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి 14 డీసీలు, తూర్పుగోదావరి జిల్లా నుంచి 2 డీసీలు, ఏలూరు జిల్లా నుంచి 4 డీసీలు మొత్తం 20 నీటి పంపిణీ సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షులతో డెల్టా ప్రాజెక్ట్ కమిటీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల అధికారిగా జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డిని నియమించామన్నారు.
గంజాయిపై ఉక్కుపాదం
భీమవరం: జిల్లాలో గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టడంతో పాటు మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. గురువారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. అధికారులు గ్రామ సందర్శనలు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ముందస్తుగా బైండోవర్ చేయాలన్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘా మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. సైబర్, సోషల్ మీడియా క్రైమ్స్, మహిళా సంబంధిత నేరాలు, మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అడిషినల్ ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ దేశింశెట్టి వెంకటేశ్వరరావు, సైబర్–సోషల్ మీడియా ఇన్‌స్పెక్టర్ జీవీవీ నాగేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్ అహ్మదున్నిషా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment