ప్రజా ఉద్యమంతో అడ్డుకుంటాం
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల
భీమవరం: భీమవరం పట్టణంలో అన్ని వర్గాల ప్రజలకూ అందుబాటులో ఉన్న కలెక్టరేట్‌ను వేరే నియోజకవర్గానికి తరలించాలని చూస్తే సహించేది లేదని, ప్రజా మద్దతుతో దానిని అడ్డుకుని తీరతామని వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల స్పష్టం చేశారు. మంగళవారం భీమవరంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కలెక్టరేట్ ఉండి నియోజకవర్గానికి తరలిపోతోందంటూ ప్రచార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని, దీనిపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో అందరికీ అందుబాటులో ఉండేలా భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారని తెలిపారు. అన్ని హంగులతో తాత్కాలికంగా కలెక్టరేట్ ఏర్పాటుచేసినా శాశ్వత భవనాల నిర్మాణం కోసం వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంతంలో 16 ఎకరాలు కేటాయించారని గుర్తుచేశారు. వైఎస్సార్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు చినమిల్లి వెంకట్రాయుడు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment