వేర్వేరు కేసుల్లో ఐదుగురి అరెస్ట్
వివరాలు వెల్లడించిన ఎస్పీ శివకిషోర్
ఏలూరు టౌన్: వేర్వేరు కేసుల్లో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ వివరాలు వెల్లడించారు.
● ఇటీవల ద్వారకాతిరుమల ప్రాంతానికి చెందిన కొల్లి వెంకట సుబ్రహ్మణ్యం అలియాస్ సుభాష్ అనే వ్యక్తికి రూ.2.50 లక్షలు ఒరిజినల్ నోట్లు ఇస్తే... నకిలీ నోట్లు రూ.15 లక్షలు ఇస్తామని నమ్మించారు. ఈ నకిలీ నోట్ల వ్యవహారాన్ని గుర్తించిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ద్వారకాతిరుమలో పట్టుకున్నారు. ఈ కేసులో ద్వారకాతిరుమలకు చెందిన షేక్ నాగూర్ మీరావలి, వీరంకి రాజేష్, రిసీవర్ కొల్లి సుభాష్‌లను అరెస్ట్ చేయగా పాత నేరస్తుడు కోడూరు రవితేజ పరారీలో ఉన్నాడు.
● 2024 నవంబర్ 25న ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి గ్రామానికి చెందిన నందమూరి సత్యనారాయణ మోటారు సైకిల్‌లో ఉన్న రూ.2.50 లక్షల నగదు చోరీ జరిగింది. ఈ కేసులో గుండుగొలను గ్రామానికి చెందిన సప్పా రామును అరెస్ట్ చేసి చోరీ సొత్తును బాధితుడికి అందజేశారు.
● 2024 డిసెంబర్ 16న చేబ్రోలు వద్ద జాతీయ రహదారిపై నడిచి వెళుతున్న వృద్ధురాలిని ఇంటి వద్ద దించుతానని చెప్పి మోటారు సైకిల్ ఎక్కించుకుని కొంతదూరం వెళ్లాక ఆమె మెడలోని మూడున్నర కాసుల బంగారు సూత్రాల తాడును లాక్కుని పారిపోయాడు. ఈ కేసులో నిందితుడు రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన మహేందర్ సింగ్‌ను అరెస్ట్ చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఆయా కేసుల ఛేదనలో ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment