సదరం సర్టిఫికెట్ల పరిశీలన పకడ్బందీగా నిర్వహించాలి
ఏలూరు (మెట్రో): సదరం సర్టిఫికెట్ల జారీపై వైద్య బృందాల పరిశీలన కోసం సూక్ష్మ ప్రణాళిక, రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం అమరావతి నుంచి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కె.కన్నబాబు, సెర్ఫ్ సీఈఓ వీరపాండ్యన్ సదరం సర్టిఫికెట్ల పంపిణీపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ సదరం సర్టికెట్ల పరిశీలనను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
మైనార్టీ యువత నుంచి దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (టూటౌన్): సీడ్ ఏపీ ద్వారా 2025–2026 ఆర్థిక సంవత్సరంలో నైపుణ్య శిక్షణ కోసం మైనారిటీ యువతీ యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌చార్జి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ శాఖ సహాయ సంచాలకులు ఎన్‌ఎస్ కృపావరం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన మైనారిటీ యువత (ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు, బుద్ధులు, పార్సిలు, జైనులు) తమ బయోడేటాను ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏలూరు వారికి పంపాల్సినదిగా కోరారు. వివరాలకు కార్యనిర్వాహక సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, కలెక్టరేట్ కాంపౌండ్, ఏలూరు, ఫోన్ 08812–242463లో సంప్రదించాలన్నారు.
‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
బుట్టాయగూడెం: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని జాయింట్ కలెక్టర్, ఐటీడీఎ ఇన్‌చార్జి పీఓ పి. ధాత్రిరెడ్డి విద్యార్థులకు సూచించారు. మండలంలోని పాలకుంట గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను జేసీ గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులను పాఠ్యాంశాలపై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అనంతరం పాఠశాలలో సుమారు రూ.2 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ప్రయోగశాలను జేసీ పరిశీలించారు. విద్యార్థినులకు జేసీ చేతుల మీదుగా నోట్ పుస్తకాలు, పెన్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కూరం పద్మ, ఐటీడీఏ డీవైఈఓ రామ్మోహన్‌రావు, ఏటీడబ్ల్యూ శ్రీవిద్య, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం అర్జునరావు పాల్గొన్నారు.
రేపు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా స్థాయిలో విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్‌ఫెయిర్) ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జిల్లాలోని 27 మండలాల్లో మండల స్థాయిలో సైన్స్ ఫెయిర్‌లు నిర్వహించామని, ఆ సైన్స్ ఫెయిర్‌లలో ఉత్తమ ఆవిష్కరణలుగా ఎంపిక చేసిన ప్రాజెక్టులు వివిధ విభాగాల్లో జిల్లా స్థాయిలో పోటీపడనున్నాయన్నారు. ఈ సైన్స్‌ఫెయిర్ కొవ్వలిలోని పీఎంశ్రీ ఎస్‌వీఎస్‌ఆర్‌బీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమౌతుందన్నారు. రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారథి, ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొంటారని తెలిపారు.
డీఎంహెచ్‌ఓ స్వచ్ఛంద పదవీ విరమణ
భీమవరం (ప్రకాశం చౌక్): పశ్చిమగోదావరి జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మహేశ్వరరావు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఆయన మరో ఏడేళ్ల సర్వీసు ఉండగానే వాలంటరీ రిటైర్మ్‌ంట్ ప్రకటించారు. వ్యక్తగత కారణాల వల్ల ముందస్తుగా రిటైర్‌మెంట్ తీసుకున్నట్లు ఆయన చెబుతున్నా పని ఒత్తిడే కారణమని తెలుస్తోంది. డాక్టర్ మహశ్వరరావు డీఎంహెచ్‌వోగా సమర్థవంతగా పనిచేశారు. గత ప్రభుత్వంలో నిర్వహించిన ఆరోగ్య సురక్ష క్యాంపులు, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో ఆయన ఎంతో శ్రమించి కలెక్టర్, నాటి ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment