ఏలూరు(మెట్రో): రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, నిత్యావసర వస్తువుల పంపిణీపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిపై ఉక్కుపాదం మోపాలని సీఎం ఆదేశించారన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా మరింత నిఘా పెట్టి అక్రమార్కులపై 6ఏ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కేసులు నమోదు చేయడంతో పాటు నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటే వ్యవస్థలో భయం ఉంటుందన్నారు. పౌర సరఫరాలు, పోలీసు, తూనికలు కొలతల శాఖల అధికారులు కలిసికట్టుగా ప్రతీవారం దాడులు నిర్వహించాలని, చెక్ పోస్టుల వద్ద పటిష్టమైన నిఘా ఉంచాలన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి కె.సత్యనారాయణరాజు, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment