ట్రావెల్స్ బస్సులో మంటలు
తప్పిన పెను ముప్పు
ఏలూరు టౌన్ : గురువారం రాత్రి 9 గంటల సమయం.. ఏలూరు పాతబస్టాండ్ సమీపంలోకి వచ్చిన ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికీలలు తీవ్రం కావటంతో బస్సులోని ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.. ఏలూరు నగరంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రమాదం చోటుచేసుకోవటంతో పెను ప్రమాదం తప్పిందని, జాతీయ రహదారిపై రన్నింగ్‌లో మంటలు చెలరేగితే పెను విపత్తు జరిగేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణికులను ఎక్కించుకుని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రారంభమైన మార్నింగ్ స్టార్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఏలూరు పాత బస్టాండ్ వద్దకు వచ్చేసరికి బస్సు వెనుకపక్కన ఉన్న ఇంజిన్‌లో నుంచి మంటలు చెలరేగాయి. రాజమహేంద్రవరం నుంచి బెంగళూరు వెళ్లే ఏపీ 07 టీటీ 3333 నంబర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఏలూరు చేరుకున్న తర్వాత ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులంతా బయటికి వచ్చేశారు. ఏలూరు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వటంతో సంఘటనా స్థలానికి క్షణాల్లో చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఏవిధమైన నష్టం లేకుండా అగ్నిప్రమాదం నుంచి బయట పడడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. బ్యాటరీలో సాంకేతిక సమస్య కారణంగా మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పిన తర్వాత బస్సు యథావిధిగా ప్రయాణికులతో వెళ్లిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment