గర్భిణులకు  కాఫీ  సేఫేనా? | Is Coffee Safe For Pregnant Women | Sakshi
Sakshi News home page

గర్భిణులకు  కాఫీ  సేఫేనా?

Published Fri, May 21 2021 12:23 AM | Last Updated on Fri, May 21 2021 12:24 AM

Is Coffee Safe For Pregnant Women - Sakshi

ఉదయాన్నే కాస్తంత టీ లేదా కాఫీ కడుపులోకి వెళ్లందే మన రోజువారీ దినచర్య మొదలవదంటే అతిశయోక్తి కాదు. అంతలా ఇవి ప్రతి ఇంట్లోనూ భాగమయ్యాయి. కొందరైతే రోజుకు నాలుగైదు సార్లు ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగానే టీ/కాఫీ సేవిస్తుంటారు. తలనొప్పి అనిపించినా, అలసటగా ఉన్నా కాస్త టీ/కాఫీని సేవిస్తే వాటి నుంచి విముక్తి లభించినట్లుంటుదని భావించడమే దీనికి కారణం. అయితే, ’అతి సర్వత్ర వర్జయేత్‌’ అనే నానుడి ప్రకారం ఏదయినా సరే మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం. ఆ స్థాయి దాటిందంటే సమస్యలు తప్పవు. ఇటీవల కాలంలో చాలామంది దృష్టికి వచ్చిన తాజా పుకారు.. ’’గర్భిణులు కాఫీ తాగకూడదు!’. మరి ఇది నిజమేనా? వైద్య నిపుణులు ఏమంటున్నారు? చూద్దాం..

కాఫీని కొకోవా, కాఫీ చెట్ల గింజల నుంచి తీసిన పొడితో తయారుచేస్తారనే విషయం తెలిసిందే. ఈ విత్తనాల్లో కెఫేన్‌ అధికంగా ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థ చురుగ్గా వ్యవహరించడంలో తోడ్పడుతుంది. అందువల్లే కాఫీని శక్తిని అందించే, ఉత్తేజపరిచేదిగా భావిస్తారు. కాఫీలోని కెఫేన్‌ మన ఆహారనాళంలో త్వరగా జీర్ణమై కలసిపోవడం వల్లే ఇలా జరుగుతున్నట్లు వైద్య నిపుణులు కనుగొన్నారు. అయితే, గర్భిణులు కాఫీ తాగినప్పుడు వారిలో కెఫేన్‌ జీర్ణమవడానికి చాలా సమయం పడుతుంది. ఈ సమయంలోనే అది గర్భస్త శిశువు రక్తప్రవాహంలోకి చేరుతుంది. ఇక్కడ అది విచ్ఛిన్నమవడం అసాధ్యం. ఫలితం గా పుట్టబోయే చిన్నారులు తక్కువ బరువు కలిగిఉండడం, పెరుగుదల లోపించడం, గర్భస్రావం జరగడం, కొన్ని సార్లు చిన్నారులు అసాధారణ బరువు తో పుట్టడం వంటివి సంభవిస్తాయి. నిజానికి గర్భంపై కెఫేన్‌ వ్యతిరేక ఫలితాలు చూపడానికి ఇతమిత్ధంగా ఇప్పటికీ కారణాలు తెలియదు. అలాగే దీని ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండడమూ వైద్యనిపుణులు గమనించారు. 

రోజుకు 200 మిల్లీ గ్రాములు..
గర్భిణులు కాఫీ తాగొద్దా అంటే మాత్రం నిస్సందేహంగా తాగొచ్చంటున్నారు ది అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆబ్‌స్ట్రెస్టీషియన్స్‌ అండ్‌ గైనకాలజిస్ట్స్‌(ఏసీఓజీ) వైద్యులు. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ రోజువారీ కెఫెన్‌ పరిమాణం 200 మిల్లీగ్రాములకు మించకూడదని చెబుతున్నారు. ఆ స్థాయిని మించితే మాత్రం గర్భంలోని శిశువుపై దుష్పరిణామాలు చూపించే ప్రమాదముందంటున్నారు. సాధారణంగా ఒక కప్పు(240 ఎంఎల్‌) కాఫీలో 96 మిల్లీగ్రాముల కెఫేన్‌ ఉంటుంది. దీని ప్రకారం ఎక్కువ నివేదికలు చెప్పేదేంటంటే రోజుకు గర్భిణులు 2 కప్పుల(475 గ్రాముల) కాఫీకి మించి తాగకూడదు. 

డికాఫ్‌ కాఫీ ప్రత్యామ్నాయమా?
డికాఫ్‌ కాఫీ అంటే కెఫీన్‌ను తొలగించి చేసిన కాఫీ. అయితే, ఇందులో 100 శాతం కెఫేన్‌ తొలగింపు సాధ్యం కాదు. 97శాతం వరకు కెఫేన్‌ తొలగించవచ్చు. ఆ ప్రకారం ఒక కప్పు(240ఎంఎల్‌) డికాఫ్‌ కాఫీలో కేవలం 2.4 మిల్లీగ్రాముల కెఫేన్‌ మాత్రమే ఉంటుంది. కాబట్టి డికాఫ్‌ కాఫీని రోజుకు మూడు, నాలుగుసార్లు తాగిన గర్భిణులపై దుష్ప్రభావం చూపదని వైద్య పుణులు అంటున్నారు. అలాగే సాధారణ కాఫీతోపాటు డార్క్‌ చాకొలెట్, ఎనర్జీ డ్రింక్స్, కోలా, హాట్‌ చాకొలెట్‌ వంటి వాటిలో కెఫేన్‌ పరిమాణం ఎక్కువ కాబట్టి వాటి జోలికి వెళ్లవద్దని సూచిస్తున్నారు. అయితే, వీటన్నింటికీ డికాఫ్‌ కాఫీ ప్రత్యామ్నాయంగా ఎంచుకునే కంటే గర్భిణులు పూర్తిగా కెఫెన్‌కు దూరమవడమే మంచిదంటున్నారు. ఇంకా చెప్పాలంటే వారికి గర్భిణులకు సురక్షితమైన హెర్బల్, ఫ్రూట్‌ టీలు, నిమ్మరసం, తేనె కలిపిన వేడినీరు, పసుపు కలిపిన పాలు తాగడం మేలని సూచిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement