వ్యవస్థల మధ్య ఘర్షణ సబబేనా? | Quarrel between Systems good | Sakshi
Sakshi News home page

వ్యవస్థల మధ్య ఘర్షణ సబబేనా?

Published Wed, Jul 29 2020 12:35 AM | Last Updated on Wed, Jul 29 2020 8:25 AM

Quarrel between Systems good - Sakshi

విశ్లేషణ
ప్రభుత్వాలు అయినా, కోర్టులు అయినా రాజ్యాంగం ప్రకారమే పని చేయాలి. ప్రభుత్వ విధానాలలో జోక్యం తగదని ఒక సందర్భంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే రాజ్యాంగానికి అతీతంగా ఏ వ్యవస్థా పనిచేయరాదని జస్టిస్‌ లావు నాగేశ్వరరావు చెప్పారు. అలా ఎవరి పరిధిలో వారు ఉండకపోవడం వల్లే వివాదాలు వస్తున్నాయి. వ్యవస్థల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. రెండు వ్యవస్థలలోని వారి మధ్య ఈగో క్లాష్‌ కూడా ఏర్పడుతోంది. ఆ పరిస్థితి కొనసాగడం సమాజానికీ, దేశానికీ మంచిది కాదు. ప్రభుత్వంలోని లోపాలు, అవకతవకలను న్యాయ వ్యవస్థ బహిర్గతం చేయడం మంచిదే. కానీ, ప్రభుత్వాలను చీటికీమాటికీ ఇబ్బందిపెట్టేలా న్యాయ వ్యవస్థ వ్యవహరించడం కూడా పద్ధతి కాదు.

ఈ మధ్యకాలంలో న్యాయ వ్యవస్థకు, పాలనా వ్యవస్థకు మధ్య తరచుగా వివాదాలు ఏర్పడుతున్నాయి. పాలనా వ్యవస్థపై దూకుడుగా న్యాయ వ్యవస్థ ఉంటోందని ఒక భావన అయితే, తాము ఇచ్చిన ఆదేశాలను పాలన వ్యవస్థ సరిగా పాటించడం లేదన్నది న్యాయ వ్యవస్థ అసహనంగా  కనిపిస్తుంది. ఈ రెండు వ్యవస్థల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడటం అంత మంచిది కాదు. ప్రభుత్వంలో ఎక్కడైనా పెద్ద తప్పులు దొర్లితేనో, రాజ్యాంగానికి విఘాతం కలిగేలా ప్రభుత్వాల చర్యలు ఉంటేనో కోర్టులు తీవ్రంగా స్పందించడం మంచిదే. కానీ చీటికీమాటికీ జోక్యం చేసుకోవడం సరైనదేనా అన్న చర్చ సహజంగానే వస్తుంది. ప్రత్యేకించి కొన్ని రాష్ట్రాలలో ఈ సమస్య మరీ అధికంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఎవరికీ మనం ఉద్దేశాలు ఆపాదించజాలం. న్యాయమూర్తులను గౌరవించాలి. వారిని ఒక్క మాట అనకూడదు. అందులో సందేహం లేదు. కాని గౌరవ న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులలో, లేదా వ్యాఖ్యలలో అనేక వైరుధ్యాలు కనిపిస్తుండడం ఆశ్చర్యం అనిపిస్తుంది.

పలు హైకోర్టులలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరిట సాగుతున్న వ్యాజ్యాల వ్యవహారం వీటన్నిటికి కీలకంగా మారుతున్నట్లుగా అనిపిస్తుంది. తెలంగాణ హైకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌ వద్ద జరిగిన సమీక్షలో అధికారులు తమ ఆవేదన వ్యక్తం చేశారంటూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కరోనాపై తెలంగాణ హైకోర్టు 87 పిల్స్‌ తీసుకుందని ప్రభుత్వం లెక్కవేసి చెప్పింది. కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరి భిన్నంగా ఉండవచ్చు. దానిపై  ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం తప్పు కాదు. కానీ ప్రతి పిటిషన్‌ను ఎంటర్‌టైన్‌ చేయడం వల్ల తాము అసలు విధులు నిర్వర్తించడం కష్టం అవుతోందని అధికారులు అన్నారంటే, అది హైకోర్టుకు కూడా మంచి విషయం కాదని చెప్పాలి.

తెలంగాణకు చెందిన అదనపు అడ్వకేట్‌ జనరల్‌  రామచంద్రరావు కొద్ది సంవత్సరాల క్రితం  సుప్రీంకోర్టు ప్రాంగణంలో నిలబడి న్యాయ వ్యవస్థను కొన్నిసార్లు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎలా మేనేజ్‌ చేస్తున్నది మీడియా ముందు చెబితే, ఎందుకు ఆయనపై ఇంతవరకు  కోర్టు ధిక్కార అభియోగం మోపలేదో అర్థం కాలేదు. మరో సందర్భం గుర్తు చేసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటూ చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఎలా దొరికిపోయింది అంతా చూశాం. కానీ ఒక గౌరవ న్యాయమూర్తి అప్పట్లో అవసరం లేకపోయినా, ఇందులో చంద్రబాబు పాత్ర ఏముందని అన్నారని వార్తలు వచ్చాయి. ఆ వ్యాఖ్య  ప్రజలందరికి ఆశ్చర్యం కలిగించేదే. ఆ విషయాన్ని అప్పట్లో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బహిరంగంగానే విమర్శించేవారు.

అంతకుముందు వైఎస్‌ జగన్‌పై వచ్చిన ఆరోపణలపై కోర్టులు స్పందించిన తీరుకు, చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలకు స్పందించిన తీరుకు ఉన్న తేడాను కూడా ప్రజలు గుర్తించారన్నది ఎక్కువ మంది భావన. అందువల్లే 2019 ఎన్నికలలో చంద్రబాబును ప్రజలు అంత ఘోరంగా ఓడించారని చాలా మంది నమ్ముతారు. అయినా ప్రజా తీర్పు వేరు, కోర్టుల నిర్ణయాలు వేరుగా ఉండడం తప్పు కాదు.

కాని ఏపీలో కొన్ని కేసులలో అక్కడి గౌరవ హైకోర్టు తీసుకున్న నిర్ణయాలు, వాటికన్నా కోర్టువారు  చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రజల దృష్టిలో వివాదాస్పదంగా కనబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కానీ, ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ ఆస్తులు అమ్మడం, భూములు వంటివాటిని అమ్మడం జరుగుతోంది. కాని ఏపీలో హైకోర్టు.. దివాలా తీశారా అని ఒకటికి రెండుసార్లు ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించడం ఇబ్బందికరంగా మారుతుంది. ఇదే సందర్భంలో హైకోర్టు విధానపరమైన నిర్ణయాలలో నిగ్రహంగా ఉండాలని మిషన్‌ ఏపీ బిల్డ్‌ సంస్థ డైరెక్టర్‌ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. 

స్పీకర్‌ తమ్మినేని సీతారాం పాలన వ్యవహారాలలో కోర్టుల జోక్యం తగదని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఒక డాక్టర్‌ మద్యం తాగి నడిరోడ్డుపైన చేసిన అరాచకం గురించి హైకోర్టులో జరిగిన పరిణామాలు కూడా గమనించాం. చివరికి సీబీఐ విచారణ వరకు వెళ్లింది. మరి ఆ కేసు ఏమైందో తెలియదు. ఆంగ్లమీడియం విషయంలో కూడా కోర్టు అభిప్రాయానికి, ప్రజల అభిప్రాయానికి మధ్య తేడా కనిపించింది. అసలు పిటిషనర్‌ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆచరించని తెలుగు మీడియంను పేద ప్రజలు మాత్రమే పాటిం చాలన్నట్లుగా వేసిన పిటిషన్‌లో పిటిషనర్‌ అర్హతను కూడా గౌరవ హైకోర్టువారు పరిగణనలోకి తీసుకుని ఉంటే బాగుండేదనిపిస్తుంది.

ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ వ్యవహారంలో కూడా కోర్టు తీర్పుకు, ప్రభుత్వానికి మధ్య వైరుధ్యం అధికంగా కనిపించింది. అలాంటివి రెండు వ్యవస్థలకు మంచిది కాదు. అలాగే పేదల ఇళ్ళస్థలాల విషయంలో టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లి అడ్డంకులు సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. ఎవరికైనా కోర్టుకు వెళ్లే హక్కు ఉంటుంది. అయితే వాటిలో వ్యక్తిగత పిటిషన్‌లు అయితే ఒక తరహాలోను, విధానపరమైన పిటిషన్‌లు అయితే మరో తరహాలోను హైకోర్టు వారు విచారణ చేయగలిగితే బాగుంటుందనిపిస్తుంది. కాని పదేపదే పిల్స్‌ను అనుమతించడం మంచిదేనా? అన్న చర్చ చాలాకాలంగా సాగుతోంది.

ఇక్కడ కొన్ని ఆసక్తికర విషయాలు గుర్తుచేసుకోవడం కూడా బాగానే ఉంటుంది. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఆమె ఏకంగా రాజ్యాంగాన్నే తనకు అనుకూలంగా మార్చే యత్నం చేశారు. కొన్ని రాజ్యాంగ సవరణలు కూడా తెచ్చారు. అప్పట్లో అత్యవసర పరిస్థితి అంటే ఎమర్జెన్సీని విధించారు. దానిని సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ తర్వాత వచ్చిన జనతా ప్రభుత్వం  ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగే ఆ సవరణలను తీసివేస్తూ మళ్లీ సవరించింది. వీటిని కూడా కోర్టు సమర్థించింది. మరి ఇప్పుడు ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని సామాన్యుడు ప్రశ్నిస్తే ఏమి చెబుతాం? ఈ మధ్య కాలంలో పూరి జగన్నాథుని రథయాత్రపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా గమనించదగినవే. రథయాత్ర కరోనా సమయంలో చేస్తే దేవుడు కూడా క్షమించడని గౌరవ కోర్టువారు అన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అదే కోర్టువారు పరిమిత సంఖ్యలో రథయాత్రకు అనుమతించారు. ఈ పాయింటు ఎందుకు ప్రస్తావించవలసి వస్తున్నదంటే విధానపరమైన నిర్ణయాలలో కోర్టులు జోక్యం చేసుకోవడం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయని చెప్పడానికే.

దేశాన్ని పాలించే ప్రధాని మోదీకి, ఒడిశాను పాలించే నవీన్‌ పట్నాయక్‌కు కూడా కరోనా సమస్య గురించి తెలుసుకదా.. వారు మాత్రం ఎందుకు పెద్ద ఎత్తున జనాన్ని అనుమతిస్తారన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కోర్టువారి ఉద్దేశం మంచిదే కావచ్చు. కాని ముందే ప్రభుత్వం వారు జాగ్రత్తలు తీసుకుని రథయాత్ర చేసుకోవచ్చని చెప్పి ఉంటే అసలు చర్చకు ఆస్కారమే ఉండదనిపిస్తుంది. నేనేమీ న్యాయ నిపుణుడిని కాను. కేవలం అనేక సంవత్సరాలుగా కోర్టుల తీరును గమనిస్తున్న జర్నలిస్టుగా, ఒక కామన్‌ సెన్స్‌తో మాత్రమే ఈ విషయాలు రాస్తున్నాను. నేను చెప్పేవాటిలో చట్టాల ప్రకారం ఏవైనా తప్పులు ఉంటాయేమో తెలియదు. కాని ఒకటి మాత్రం వాస్తవం. ప్రభుత్వాలు అయినా, కోర్టులు అయినా రాజ్యాంగం ప్రకారమే పని చేయాలి. ప్రభుత్వ విధానాలలో జోక్యం తగదని ఒక సందర్భంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే రాజ్యాంగానికి అతీతంగా ఏ వ్యవస్థా పనిచేయరాదని జస్టిస్‌ లావు నాగేశ్వరరావు చెప్పారు.

ప్రభుత్వాలు అన్నీ తమ ఇష్టం అని చేసుకుపోవడం కరెక్టు కాదు. అలాగే న్యాయ వ్యవస్థ ప్రభుత్వంలోని వారికన్నా తామే తెలివైనవారమని, తమకే అన్నీ తెలుసు అన్నట్లుగా వ్యవహరించకూడదని మాత్రం చెప్పక తప్పదు. అలా ఎవరి పరిధిలో వారు ఉండకపోవడం వల్లే వివాదాలు వస్తున్నాయి. వ్యవస్థల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. రెండు వ్యవస్థలలోని వారి మధ్య ఈగో క్లాష్‌ కూడా ఏర్పడుతోంది. ఆ పరిస్థితి కొనసాగడం సమాజానికి, దేశానికి మంచిది కాదు. ప్రభుత్వంలోని లోపాలు, అవకతవకలను న్యాయవ్యవస్థ బహిర్గతం చేయడం మంచిదే. అదే సమయంలో ప్రతిదానికి ప్రజా ప్రయోజన వాజ్యాల పేరిట ప్రభుత్వాలను చీటికీమాటికీ ఇబ్బంది పెట్టేలా న్యాయవ్యవస్థ  వ్యవహరించడం కూడా పద్ధతి కాదన్న అభిప్రాయం కలుగుతుంది. ప్రభుత్వాలు కూడా న్యాయస్థానాలు ఇలాగే చెబుతాయిలే అన్నట్లు కాకుండా వారు చెప్పిన ప్రకారం లోపాలను గుర్తించి సరిచేసుకోవడం మంచిది. కాని ఇప్పుడు ఉన్న వాతావరణంలో ఈ పరిస్థితులు మారతాయా అంటే సందేహమే!


వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
కొమ్మినేని శ్రీనివాసరావు

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement