అభిప్రాయం
2024 లోక్ సభ, శాసన సభ ఎన్నికల నేపథ్యంలో రాయల సీమ ప్రాంత సమస్యలను జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు నిర్దిష్టంగా తమ మ్యానిఫెస్టోలలో చేర్చాలని కోరుతున్నాం.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రాయలసీమ ప్రయోజనాలతో ముడిపడిన అనేక అంశాలు ఉన్నాయి. సాక్షాత్తు భారత పార్లమెంటుచే ఆమోదం పొంది చట్టబద్ధంగా అవకాశం ఉన్న ఆ హక్కుల అమలు జరగాలి. వీటితో పాటు ఇతర అనేక అంశాలను కూడా రాయలసీమ పౌరసమాజం, ప్రజా సంఘాలూ కోరుతున్నాయి. రాజకీయ పార్టీలు ఈ అంశాలకు చోటు కల్పించాలని మనవి చేస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడింట ఒక భాగం జనాభా ఉన్న అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవ స్థల విషయంలో సీమ వాసుల ఆకాంక్షల మేరకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలి. ఇతర రంగాల అభివృద్ధిలోనూ ప్రాధాన్యత ఇవ్వాలి. కోటి ఎకరాల భూభాగం ఉన్న రాయలసీమకు తుంగభద్ర–కృష్ణా నదీ జలాలలో 133 టీఎంసీల నికరజలాలపై హక్కు ఉంది. ఆ నీటిని అందేలా చూడాలి. పెండింగ్ ప్రాజె క్టులను నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చేసి ఆయకట్టు స్థిరీకరించాలి.
విభజన చట్టం సెక్షన్ 46లో వెనకబడిన ప్రాంతాల కోసం ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి తగిన ఆర్థిక వెసులుబాటులు చేయా లని ఉంది. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రల అభివృద్ధి కోసం ప్యాకేజీ రూపొందించాలని ఉంది. ఈ ప్యాకేజీని కనీసం లక్షకోట్లతో సమగ్రంగా చేపట్టాలి. సెక్షన్ 94 ప్రకారం ఇరు రాష్ట్రాలలో పారిశ్రామిక అభివృద్ధి కోసం పన్ను మినహాయింపుతో సహా తగిన ఆర్థిక చర్యలు తీసుకొంటామని పేర్కొన్నారు.
కాబట్టి రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేక పన్ను మినహాయింపుతో సీమ ఖనిజ వనరులు వెలికితీతతో పాటు, స్థానికంగా ఉత్పాదక పరిశ్రమలకు తోడ్పాటు ఇవ్వాలి. సీమ యువతకు ఆయా రంగాలలో ప్రత్యేక నైపుణ్యాలు అభివృద్ధి చేసేలా కేంద్రాలు నెలకొల్పాలి. యువతకు నిరుద్యోగ భృతి కల్పించి ఆత్మవిశ్వాసం నింపాలి.
విభజన చట్టం సెక్షన్ 93 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11 జాతీయ ప్రాధాన్యత ఉన్న విద్యాసంస్థలను కేటాయించింది. ఇందులో రాయలసీమకు సంబంధించినవి కేంద్రీయ విశ్వవిద్యాలయం (అనంతపురము), రెండు ఐఐటీలు (తిరుపతి, కర్నూలు), ఐఐఎస్‌ఇఆర్ (తిరుపతి) ఉన్నాయి.
విభజన చట్టంలో పేర్కొన్న విధంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ కడప జిల్లాలో సమగ్ర ఉక్కు కర్మాగారాన్ని విశాఖపట్నం ఉక్కు కర్మాగారం స్థాయిలో ఈ ప్రాంతానికి లబ్ధి చేకూరేలా నిర్మాణం చేయాలి. ముద్దనూరు – పుట్టపర్తి, కడప –రాయచోటి– కదిరి – పుట్టపర్తి– చిక్ బళ్ళాపురం, రాయచోటి – మదనపల్లె– బెంగుళూరు, కళ్యాణదుర్గం– పావగడ్డ – తుమకూరు, నంద్యాల – కర్నూలు తదితర రైల్వేలైన్లలను నిర్మించాలి. కర్నూలు, నంద్యాల జిల్లాలను సీడ్ హబ్‌లుగా అభివృద్ధి చేయాలి. రైతులకు ఉపయోగపడేలా సీమలో శీతల గిడ్డంగులు నిర్మాణం చేయాలి. సీజనల్ వలస కూలీలకు ఉపాధి కల్పించాలి.
రాయలసీమ పురావస్తు, చరిత్ర అవశేషా లనూ, సంస్కృతి, సాహిత్యం, మాండలికం, జానపదకళల సంరక్షణకు ప్రత్యేక సంస్థను నెలకొల్పాలి. 1800 నాడు బ్రిటిష్ వారిపై పాలేగాళ్ల తిరుగుబాట్లను ప్రథమ స్వాతంత్య్ర పోరాటంగా గుర్తించాలి. రాయలసీమలోని పర్యా టక, చారిత్రక స్థలాలు సంరక్షించి, కనీస వసతులు కల్పించాలి. ప్రసిద్ధ ప్రాంతాలతో టూరిజం సర్క్యూ ట్‌లు నెలకొల్పాలి. సీమ వాతావరణం, కరువు నివారణ, నీటి సంరక్షణ, కృత్రిమ వర్షాలు, మైనింగ్, తదితర అంశాల నేపథ్యంగా పరిశోధన సంస్థలు నెలకొల్పాలి. స్వయంప్రతిపత్తితో కూడిన రాయల సీమ బోర్డును నెలకొల్పాలి.
డా‘‘ అప్పిరెడ్డి హరినాథరెడ్డి
వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత ‘ 99639 17187
Comments
Please login to add a commentAdd a comment