ధృతరాష్ట్ర ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ధృతరాష్ట్ర ప్రభుత్వం

Published Wed, Nov 6 2024 2:23 AM | Last Updated on Wed, Nov 6 2024 2:23 AM

ధృతరా

ధృతరాష్ట్ర ప్రభుత్వం

సహానా కేసులో కనీసం స్పందించని కూటమి సర్కారు

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో రోజు రోజుకు మహిళలపై దాడులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం ప్రజలను కలవర పెడుతోంది. ఏదైనా ఘటన జరిగినా మహిళ హోంమంత్రిగా ఉండి కూడా బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడం కానీ, వచ్చి పరామర్శించడం కానీ కనిపించని పరిస్థితి నెలకొంది. కొన్ని రోజుల క్రితం గుంటూరు జిల్లా తెనాలిలో సహానా అనే యువతిని తెలుగుదేశం పార్టీకి చెందిన రౌడీషీటర్‌, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అనుచరుడైన నవీన్‌ కారు ఎక్కించుకుని తీసుకెళ్లాడు. గంటన్నర తర్వాత సహానా తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ‘మీ కూతురుకు ఒంట్లో బాగోలేదు. కళ్లు తిరిగిపడిపోయింది. ఆసుపత్రిలో చేర్చాను... వెంటనే రండి’ అంటూ చెప్పాడు. దీంతో యువతి తల్లిదండ్రులు పరుగులు తీసుకుంటూ ఆస్పత్రికి వచ్చారు. అప్పటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తల్లిదండ్రులను చూసిన రౌడీషీటర్‌ నవీన్‌తోపాటు అతని ఇద్దరు స్నేహితులు అక్కడి నుంచి జారుకున్నారు. సహానాకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బ్రెయిన్‌ డెడ్‌ అని తేల్చిచెప్పారు. కుమార్తెను బతికించుకోవడానికి ఆమెను అంబులెన్స్‌లో ఎక్కించుకుని తెనాలి నుంచి బయలుదేరి మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు వరకు వెళ్లారు. తర్వాత మళ్లీ తెనాలి, మళ్లీ గుంటూరు.. ఇలా హాస్పిటళ్లకు తల్లిదండ్రులు తిరిగారు. చివరకు అందరూ చేతులెత్తెయ్యడంతో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. జీజీహెచ్‌లో వైద్యులు అన్ని టెస్టులూ చేసి బ్రెయిన్‌ డెడ్‌ అని, మీరు ఇంటికి తీసుకెళ్లవచ్చని తల్లిదండ్రులకు సూచించారు. కానీ వారు తమ కుమార్తెను ఎలాగైనా బతికించాలని వైద్యులను వేడుకున్నారు. తల్లిదండ్రుల ఆవేదనను చూసిన డాక్టర్లు చలించిపోయారు. వెంటిలేటర్‌పై సహానాను ఉంచి చికిత్స అందించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులకు రౌడీషీటర్‌ నవీన్‌ దొరికిపోయాడు. మూడు రోజులపాటు వెంటిలేటర్‌పైనే ఉన్న సహానా ఆ తర్వాత మృతి చెందింది.

వైఎస్‌ జగన్‌ ప్రకటనతో చలనం

అంతకు ముందు రోజే వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ కుటుంబానికి అండగా ఉంటానని ప్రకటించారు. గుంటూరు జీజీహెచ్‌కు వచ్చి పరామర్శిస్తానని తెలిపారు. కానీ అదే రోజు రాత్రి సహానా మృతి చెందింది. అప్పటి వరకు ప్రభుత్వం, పోలీసు శాఖ ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్వవహరించాయి. జగన్‌ గుంటూరు వస్తానని చెప్పిన వెంటనే హడావుడిగా టీడీపీ నేతలు జీజీ హెచ్‌కు వచ్చి ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోయారు. సహానాపై దాడి చేసిన రౌడీషీటర్‌ నవీన్‌ను మూడు రోజులపాటు తమ అదుపులోనే పోలీసులు ఉంచుకున్నారు. జగన్‌ వస్తారన్న ప్రకటనతో హడావుడిగా అరెస్ట్‌ చూపించారు. అప్పటికే ఘటన జరిగి నాలుగు రోజులైంది. వైఎస్‌ జగన్‌ ప్రకటనతోనే అందరిలో చలనం వచ్చింది.

సాయం ప్రకటించాకే కదిలిన నాదెండ్ల

సహానా మృతి చెందిన మరుసటి రోజు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జీజీహెచ్‌కు చేరుకుని ఆమె కుటుంబాన్ని ఓదార్చారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. సహానా కుటుంబానికి రూ.పది లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆ రోజు రాత్రి హడావుడిగా మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆ కుటుంబానికి రూ.పది లక్షల చెక్కును ప్రభుత్వం తరఫున అందచేశారు. ఆ తర్వాత ఆ కేసు గురించి మర్చిపోయారు. సహానా తల్లిదండ్రులు ఈ కేసులో నవీన్‌తోపాటు మరో ఇద్దరు నిందితులు ఉన్నారని చెబుతున్నా వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పాపాన కూడా పోలేదు.

స్పందించని హోంమంత్రి అనిత, మంత్రులు మనోహర్‌, లోకేష్‌

సహానా తెనాలికి చెందిన యువతి. తెనాలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్‌ కానీ, పక్క నియోజకవర్గానికి చెందిన మరో మంత్రి నారా లోకేష్‌ కానీ సహానాపై జరిగిన దాడిపై కనీసం స్పందించలేదు. ఎప్పుడూ మీడియాలో హడావుడి చేసే హోంమంత్రి అనిత తప్పించుకుని తిరిగారు. నిత్యం మీడియా అటెన్షన్‌ కోరుకునే కేంద్ర మంత్రి పెమ్మసాని కూడా ఈ ఘటనపై నోరు తెరవలేదు. పైగా దాడికి పాల్పడిన రౌడీషీటర్‌ నవీన్‌ తన అనుచరుడు కావడంతో మీడియాకు దూరంగా ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం గుంటూరు జిల్లాలోనే ఉన్నా కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ దారుణంపై స్పందించిన పాపాన పోలేదు.

నాడు రమ్య కేసులో స్పందన భేష్‌

గతంలో ఇలాంటి ఘటనే గుంటూరులో జరిగింది. బీటెక్‌ స్టూడెంట్‌ రమ్యను 2021 ఆగస్టు 15న పరమాయకుంటలో వట్టిచెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన శశికృష్ణ నడిరోడ్డుపైనే హత్య చేశాడు. వెంటనే అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. డీజీపీతో మాట్లాడారు. పది గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్‌ చేశారు. 48 గంటల్లోనే ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ తెప్పించారు. వారంలోనే చార్జిషీట్‌ దాఖలు చేశారు. ప్రత్యేక పీపీని ప్రభుత్వం నియమించింది. 257 రోజుల్లోనే న్యాయస్థానంలో విచారణ పూర్తయింది. చివరకు శశికృష్ణకు కోర్టు ఉరిశిక్ష విధించింది. దీనిపై రమ్య కుటుంబ సభ్యులు అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. హత్య జరిగిన వెంటనే అప్పటి హోంమంత్రి మేకతోటి సుచరితతోపాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు రమ్య ఇంటికెళ్లి భరోసా కల్పించారు. రమ్య కుటుంబ సభ్యులను అప్పటి సీఎం జగన్‌ వద్దకు తీసుకెళ్లారు. రమ్య హత్య జరిగిన మరుసటిరోజే కుటుంబానికి రూ.పది లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు సీఎం. మరుసటిరోజే ఆ చెక్కును కుటుంబ సభ్యులకు అందించారు. ప్రభుత్వం ఇంటిస్థలం కేటాయించింది. చార్జిషీట్‌ వేసిన వెంటనే దళిత వర్గానికి చెందిన రమ్య కుటుంబానికి రూ.8.25 లక్షల ఆర్థికసాయం అందించింది. ఇంటి నిర్మాణం కోసం రూ.1.80 లక్షలు కేటాయించింది. నెలలోనే రమ్య సోదరికి రెవెన్యూ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. డిగ్రీ పూర్తికి ఐదేళ్లు అవకాశం ఇచ్చింది. ఎలవర్రులో రూ.1.60 కోట్ల విలువైన ఐదెకరాల వ్యవసాయ భూమిని తల్లి పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించి ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద రావాల్సిన నిధులను అందించింది. తమ కూతురు హత్యకు గురైతే సొంత కుటుంబసభ్యుడిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలబడ్డారని రమ్య తల్లి చెబుతోంది.

నామమాత్రంగానైనా అటు చూడని

కూటమి పార్టీల నాయకులు

బాధితులకు మాటలతోనైనా

సాంత్వన చేకూర్చని హోం మంత్రి

రమ్య కేసులో నాడు తక్షణమే

స్పందించిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం

7 రోజుల్లోనే చార్జిషీట్‌,

257 రోజుల్లో నిందితుడికి శిక్ష

‘మగ’పుటేనుగుల కాళ్ల కింద మగువ నలిగిపోతోంది. కామాంధుల చేతిలో చిక్కిశల్యమవుతోంది. కుటిలనీతి పాలనలో కన్నీరుపెడుతోంది. చెవులుండీ వినలేని, కళ్లుండీ చూడలేని ధృతరాష్ట్ర రాజ్యంలో.. చేష్టలుడిగిన దుష్ట పాలకుల దుర్నీతికి బలవుతోంది. ఈ రాక్షస పాలన ఇక వద్దని ఆర్తనాదం చేస్తోంది. సాయం చేయాల్సిన కూటమి సర్కారు నిర్దయగా వ్యవహరించడంతో అండగా నిలిచే అసలైన నాయకుల ‘దిశ’గా మహిళ కనులెత్తి దీనంగా చూస్తోంది. అధికారంలో ఉన్నా.. విపక్షంలో ఉన్నా.. బాధితుల పక్షాన వైఎస్సార్‌ సీపీ నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
ధృతరాష్ట్ర ప్రభుత్వం 1
1/1

ధృతరాష్ట్ర ప్రభుత్వం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement