అల్లాడుతున్న ఆలపాటి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రంగంలో ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌కు అసమ్మతి సెగ తగులుతోంది. తెలుగు తమ్ముళ్లు సహాయ నిరాకరణ చేస్తున్నారు. పట్టభద్రులను ఓటర్లుగా చేర్పించే అంశంలో చాలా మంది ఆలపాటి రాజాకు సహకరించడం లేదు. మరికొందరు మొక్కుబడిగా కానిచ్చేస్తున్నారు. ఆయన తన సొంత మనుషులు, తన ఎన్‌ఆర్‌ఐ విద్యాసంస్థల ఉద్యోగులు, విద్యార్థులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీనియర్లు కూడా ఆలపాటిని వ్యతిరేకిస్తున్నారు.
మరో అధికార కేంద్రం అవుతారని...
ఆలపాటి రాజా గుంటూరు నగరంలోని లక్ష్మీపురంలో కార్యాలయం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు, తన సామాజికవర్గానికి చెందిన నేతలతో రోజూ సంప్రదింపులు జరుపుతున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత వారికి ఏ పనులు కావాలన్నా తానే చేయిస్తానని చెబుతున్నారు. పెదబాబు, చినబాబులలో ఎవరి వద్దనైనా పనులు చేయిస్తానని పేర్కొంటున్నారు. దీంతో నగరంలో మరో అధికార కేంద్రంగా తన కార్యాలయాన్ని మారుస్తుండటంతో గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. పశ్చిమలో ఓటర్లను చేర్పించే ప్రక్రియ కాస్త జరిగినా, తూర్పులో అనుకున్నంతగా లేదని సమాచారం.
చాలామంది అదే దారిలో...
ప్రత్తిపాడులో ఒక మీటింగ్ పెట్టి సరిపెట్టారు. పొన్నూరులో అయితే రాజాకు అసలు సహకారం అందలేదని సమాచారం. గతంలో సంగం డైరీ డైరెక్టర్ల విషయంలో ధూళిపాళ్ల నరేంద్ర, ఆలపాటి రాజా మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నరేంద్ర సహకరించడం లేదని తెలుగు తమ్ముళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. తన సొంత నియోజకవర్గమైన తెనాలిలో కూడా సొంతంగా ఓటర్లను చేర్పించే ప్రక్రియను తమ సిబ్బందితో చేయిస్తున్నారు. ఫ్లెక్సీలలో నాదెండ్ల మనోహర్ ఫొటో పెట్టినా ఆయన నుంచి సహకారం శూన్యమని చెబుతున్నారు. గత సాధారణ ఎన్నికల సమయంలో మనోహర్‌కు ఆలపాటి రాజా సహకరించలేదన్న భావన బలంగా ఉండటంతో మంత్రి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. పల్నాడులో కూడా యరపతినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, జీవీ ఆంజనేయులు తదితరులు కూడా మొక్కుబడిగా కార్యక్రమాలు చేస్తున్నారు.
తెలుగు తమ్ముళ్ల సహాయ నిరాకరణ దాటవేత ధోరణిలో సీనియర్లు పట్టించుకోని జనసేన నేతలు ఓటు నమోదుకు నేడు చివరి తేదీ పీడీఎఫ్ నుంచి మళ్లీ లక్ష్మణరావు పోటీ టెన్షన్‌లో ఆలపాటి వర్గీయులు
గట్టి పోటీదారుతో టెన్షన్ మొదలు
మరోవైపు పోటీలోకి దిగుతున్నట్లు ప్రస్తుత ఎమ్మెల్సీ, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ప్రకటించారు. దీంతో తమ సామాజిక ఓట్లు చీలిపోతాయనే భయం తెలుగుదేశం పార్టీలో వ్యక్తం అవుతోంది. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ఉద్యమిస్తూ అందరికీ అందుబాటులో ఉండే లక్ష్మణరావు మరోసారి బరిలోకి దిగడం వల్ల తమకు ఇబ్బంది అవుతుందన్న భావన ఆ పార్టీలో ఉంది. పార్టీ అధినేత జోక్యం చేసుకుని అందరితో మాట్లాడితే కొద్దో గోప్పో పరువు నిలుస్తుందని, గెలుపు మాత్రం అంత ఈజీ కాదన్న భావన తెలుగు దేశం నాయకులు, కార్యకర్తలలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment