అరెస్టులకు బెదిరేది లేదు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : అరెస్టులకు వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా బెదిరేది లేదని, తొలి నుంచి తమ పార్టీది పోరాట పంథా అని మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి
రాంబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు ఎదురొడ్డి పోరాడతామని తెగేసి చెప్పారు. పోలీసులు అరెస్టు చేసిన వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ మేకా వెంకటరామిరెడ్డిని గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో బుధవారం పార్టీ లీగల్ సెల్ సభ్యులతోపాటు అంబటి, నగర అధ్యక్షుడు డైమండ్ బాబు, మంగళగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి, మిర్చి యార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ పరామర్శించారు. స్టేషన్ సీఐ వీరానాయర్‌తో మాట్లాడారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు. పోలీసులు అధికారపార్టీ నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మంత్రి లోకేష్, డెప్యూటీ సీఎం పవన్ ఆదేశాల మేరకు అరెస్టులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. గతంలో ఎప్పుడో పెట్టిన పోస్టులకు ఇప్పుడు అరెస్టులు చేయడం అన్యాయమన్నారు. డీజీపీ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని, 30 ఏళ్ల క్రితం కేసులూ తోడతామని ఆయన చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పాత కేసులు తోడినా తమకేం అభ్యంతరం లేదని, కానీ ప్రభుత్వాలు స్థిరంగా ఉండవని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన విచారణను ఆయన తప్పు బట్టడం సరికాదని విమర్శించారు. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎన్ని కేసులు పెట్టినా బెదరరని, మరింత రాటుదేలతారని పేర్కొన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలకు పార్టీ అండగా ఉందని స్పష్టం చేశారు. సంస్కారవంతంగా పోస్టులు పెట్టడంలో తమ పార్టీ కార్యకర్తలు ముందుంటారన్నారు. సూపర్ సిక్స్ హామీలపై కూటమి ప్రభుత్వాన్ని అంబటి నిలదీశారు. మాజీ మంత్రి విడదల రజినిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేస్తే చర్యలు లేవని, ఆ పోస్టులు డీజీపీకి కనపడలేదా అని ప్రశ్నించారు. విడదల రజిని ఫిర్యాదుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగారు. డీజీపీ గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని, ఆయన రాజకీయ నేత కాదని, పోలీసులు పెట్టిన కేసుల విషయం తాము న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని అంబటి స్పష్టం చేశారు. అనంతరం అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఉన్న పార్టీ సోషల్ మీడియా కార్యకర్త వైజాగ్‌కు చెందిన ఇంటూరి రవికిరణ్‌ను పరామర్శించారు. ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాసరావుతో మాట్లాడారు. రవికిరణ్‌కు పార్టీ లీగల్ సెల్ బృందం అండగా ఉంటుందని చెప్పారు.
వైఎస్సార్ సీపీ సోషల్ మీడియాది పోరాట పంథా రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు ఎదురొడ్డి పోరాడతాం డెప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ ఆదేశాల మేరకే అరెస్టులు డీజీపీ రాజకీయ వ్యాఖ్యలు చేయడం విడ్దూరం మాజీ మంత్రి విడదల రజినిపై అసభ్యకర పోస్ట్ పెడితే చర్యలు లేవు వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్లకు అండగా లీగల్ సెల్ విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు
Comments
Please login to add a commentAdd a comment