సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
తాడికొండ: తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్‌కుమార్, ట్రాన్స్‌కో జేఎండీ కీర్తి చేకూరిలతో కలిసి పరిశీలించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.
శిశు విక్రయ కేసులో ముగ్గురి అరెస్ట్
నరసరావుపేటటౌన్: శిశు విక్రయ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు నరసరావుపేట టూటౌన్ సీఐ హైమారావు బుధవారం తెలిపారు. పట్టణంలో అక్రమంగా శిశు విక్రయాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ దాసరి శౌరిరాజు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో నిమ్మతోటకు చెందిన పోకులూరి అనిల్ తన శిశువును విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన పాటి శ్రీనివాసరావుకు విక్రయించినట్లు తెలుసుకున్నారు. వారిద్దరితోపాటు మధ్యవర్తిగా వ్యవహరించిన మహిళను అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరిస్తాం
నగరంపాలెం: ప్రజా సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి న్యాయం చేస్తామని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్డులోని గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో బుధవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కారాల వ్యవస్థను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గుంటూరు రేంజ్ పరిధిలోని అన్ని జిల్లాల్లో నిర్వర్తించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పోలీస్ అధికారులు విధిగా హాజరుకావాలని అన్నారు. ప్రజా సమస్యలను అలకించి, చట్ట పరిధిలో న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కరించేందుకు నిరంతరం పోలీసులు అందుబాటులో ఉంటారని అన్నారు.
సబ్ జైలులో
‘మీకు తెలుసా’
గురజాల: స్థానిక సబ్ జైల్‌నందు రీడ్స్ ఆధ్వర్యంలో మీకు తెలుసా కార్యక్రమంపై బుధవారం అవగాహన నిర్వహించారు. పీసీ కె రవికుమార్ మాట్లాడుతూ హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది..ఎటువంటి జాగ్రత్తలు చేపట్టాలి అనే విషయాల గురించి ఖైదీలకు అవగాహన కల్పించారు. ఎయిడ్స్/హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులను చిన్నచూపు చూడరాదని కలిసి జీవించాలన్నారు. క్షయ వ్యాధి, సుఖ వ్యాధుల గురించి తెలియచేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ వెంకయ్య, ఎల్‌టీ కృష్ణ, రీడ్స్ ఏఎన్‌ఎం యలమందమ్మ, పీఈలు, జైలర్ సీహెచ్ విఎన్ సుబ్బారెడ్డి తదితరులున్నారు.
నాగార్జున కొండను
సందర్శించిన శ్రీలంక దేశీయులు
విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండను బుధవారం శ్రీలంక దేశానికి చెందిన 50 మంది బృందం సందర్శించింది. వీరు స్థానిక లాంచీస్టేషన్ నుంచి శాంతిసిరి లాంచీలో నాగార్జునకొండకు చేరుకున్నారు. కొండలోని మ్యూజియంలో ఉన్న తొమ్మిది అడుగుల బుద్ధుని పాలరాతి విగ్రహం, బుద్ధుని పుట్టుకకు సంబంధించిన శిలా ఫలకాలు, రాతి పనిముట్లు, సింహళ విహార్‌లోని మహాస్థూపం, అశ్వమేధ యాగశాల, స్నానఘట్టం తిలకించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రాముఖ్యత గురించి పర్యాటకశాఖ ఉద్యోగులు వారికి వివరించారు. అనంతరం అనుపు, యాంపీ స్టేడియం, ఎత్తిపోతల జలపాతాన్ని తిలకించారు.
Comments
Please login to add a commentAdd a comment