మళ్లీ సీఆర్‌డీఏలోకి వేమూరు | - | Sakshi
Sakshi News home page

మళ్లీ సీఆర్‌డీఏలోకి వేమూరు

Published Thu, Nov 7 2024 2:05 AM | Last Updated on Thu, Nov 7 2024 2:05 AM

మళ్లీ సీఆర్‌డీఏలోకి వేమూరు

మళ్లీ సీఆర్‌డీఏలోకి వేమూరు

సాక్షి ప్రతినిధి, బాపట్ల: వేమూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని సీఆర్‌డీఏ కలిపే ప్రతిపాదనకు బుధవారం ఏపీ క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. నియోజకవర్గంలోని వేమూరు, చుండూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమృతలూరు మండలాల పరిధిలో ఉన్న 89 గ్రామాలను సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకోనున్నారు. తాజా ప్రతిపాదనతో 562 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం తాజాగా సీఆర్‌డీఏలో చేరనుంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో బాపట్ల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేసి వేమూరు నియోజకవర్గాన్ని అందులో కలిపారు. అయిదేళ్లుగా వేమూరు బుడాలో ఉంది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి సీఆర్డీఏను పునరుద్ధరించి ఈ నియోజకవర్గాన్ని అందులో కలపాలన్న ప్రతిపాదన తీసుకొచ్చారు. ఎట్టకేలకు ఏపీ క్యాబినెట్‌ దీనికి ఆమోదం తెలిపింది.

లేనిది ఉన్నట్టుగా కనికట్టు

2014లో చంద్రబాబు ప్రభుత్వం సీఆర్‌డీఏను ఏర్పాటు చేసి అమరావతిని అద్భుతమైన రాజధానిగా మారుస్తున్నట్లు గొప్పలు చెప్పింది. ఆచరణలో అది ఎక్కడా కనిపించలేదు. నిజంగా సీఆర్‌డీఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అలా కాకుండా అప్పట్లో ఐదేళ్ల మాదిరిగానే ఇప్పుడూ గ్రాఫిక్స్‌ చూపిస్తూ భ్రమరావతిగా మార్చితే మాత్రం ప్రయోజనం శూన్యం. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో అప్పట్లో సేకరించిన భూములతో వ్యాపారం చేసుకున్నారు తప్పించి రాజధాని నిర్మాణం మరిచారన్న ఆరోపణలు ఉన్నాయి. మొక్కుబడిగా నాలుగు భవనాలకు పునాదులు వేసి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. గ్రాఫిక్స్‌ రాజధానిని సిద్ధం చేసి పచ్చ పత్రికల్లో రోజుకో ఫొటో ప్రచురించి అసెంబ్లీ ఇలా, సచివాలయం అలా, కోర్టు భవనాలు ఇలా, రాజగోపురాలు అలా, సిటీ ఇలా అంటూ కేవలం ఆర్భాటాలకే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పరిమితమైంది. సింగపూర్‌ గ్రాఫిక్స్‌తో కొన్నాళ్లు నడిపించారు. ఇలా ఐదేళ్ల కాలం వెళ్లదీశారు. రాజధాని కన్నా అక్కడి భూములపైనే చంద్రబాబు సర్కార్‌కు మక్కువని, అందుకే రాజధాని నిర్మాణాన్ని పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి రాజధాని నిర్మాణ బాధ్యతలు మంత్రి నారాయణకే అప్పగించారు. సీఆర్డీఏను విస్తృతం చేయడాన్ని ఎవరూ వ్యతిరేకించరు. కానీ అభివృద్ధి చేయకుండా కేవలం పరిధి పెంచడంవల్ల ఒరిగే ప్రయోజనం మాత్రం ఉండదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. గతంలో వేమూరు నియోజకవర్గం సీఆర్‌డీఏలోనే ఉంది. ఐదేళ్లపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పాలన సాగించినా ఒరిగింది ఏమీ లేదు. ప్రత్యేకంగా మౌలిక వసతుల కల్పన జరగలేదు.

5 మండలాలు, వాటి పరిధిలోని 89 గ్రామాల విలీనానికి ఆమోదం వైఎస్సార్‌ సీపీ సర్కారు హయాంలో ‘బుడా’లో నియోజకవర్గం అంతకుముందూ సీఆర్‌డీఏలోనే ఉన్నా ప్రగతి శూన్యం చంద్రబాబు గ్రాఫిక్స్‌తో ప్రజలకు తప్పని అవస్థలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement