రైతులతో ‘బంతి’ ఆట
చేబ్రోలు: ప్రతికూల వాతావరణ పరిస్థితులు, నష్టాల వల్ల సంప్రదాయ పంటలను వదిలి ప్రత్యామ్నాయంగా బంతిపూల సాగు చేపట్టిన రైతులతో విధి బంతాట ఆడుతోంది. తెగుళ్లతోపాటు ధర పతనం కర్షకులను కుదేలు చేస్తోంది. ఫలితంగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖర్చు ఎక్కువే..
చేబ్రోలు మండలం శలపాడు, సుద్దపల్లి, గొడవర్రు, వేజండ్ల, నారాకోడూరు, గుండవరం తదితర గ్రామాల్లో ఈ ఏడాది సుమారు 30 ఎకరాల్లో బంతిపూల సాగు చేపట్టారు. గత ఏడాది ఏర్పడిన వాతవరణ పరిస్థితుల వల్ల మెట్ట పంటలు దెబ్బతీన్నాయి. దీంతో రైతులు ప్రయోగాత్మకంగా బంతిపూల సాగువైపు మళ్లారు. ఫలితంగా ఈ ప్రాంతంలో బంతిపూల సాగు విస్తీర్ణం పది ఎకరాల నుంచి 30 ఎకరాలకు పెరిగింది. వాస్తవానికి బంతి సాగుకు ఖర్చు ఎక్కువే. ఎకరానికి రూ.లక్ష వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక్కో మొక్కను రూ.మూడుకు కొని ఎకరానికి 15వేల మొక్కలను నాటాలి. దీనికి సుమారు రూ.40వేల వరకు ఖర్చు అవుతుంది. కౌలు రూ. 25 నుంచి 30వేలకు పోతుంది. నీటి తడులు, దుక్కులు, బలం మందుల పిచికారీ పెట్టుబడులు అదనం. పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే 80 నుంచి 90 క్వింటాళ్ల వరకు పూల దిగుబడి వస్తుంది. గిట్టుబాటు ధర లభిస్తే రైతుకు పండగే. ఖర్చులన్నీ పోను ఎకరానికి రూ.50వేల వరకు లాభం ఉంటుంది. అయితే ఈ ఏడాది అధిక వర్షాల వల్ల బంతికి తెగుళ్ల బెడద ఎక్కువైంది. మచ్చ తెగులుతో తోటలు దెబ్బతింటున్నాయి. మందులు వాడినా ఫలితం ఉండట్లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బంతిపూల ధర కుదేలైంది. మార్కెట్లో కిలో కేవలం రూ.20 పలుకుతున్నాయి. డిమాండ్ ఉన్నప్పుడు కిలోకు రూ.60 నుంచి రూ.80 వరకు ధర వస్తుంది. కార్తిక మాసం సమీపించిన నేపథ్యంలో ధర పెరుగుతుందేమోనని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ధరతో పూల కోత ఖర్చులూ రావట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
నష్టాల బాటలో పూల కర్షకులు ధర పతనంతో కుదేలు తెగుళ్లుతోనూ సతమతం మార్కెట్లో కిలో కేవలం రూ.20
నష్టాలు మిగులుతున్నాయి
ప్రస్తుతం మార్కెట్లో బంతి పూల ధర పూర్తిగా పతనం అయింది. కిలోకు కేవలం రూ. 20 మాత్రమే లభిస్తోంది. లక్ష రూపాయిల వరకు పెట్టుబడి అయింది. గిట్టుబాటు కావట్లేదు. నష్టాలు మిగులుతున్నాయి. కోత, రవాణా, గోతాం తదితర ఖర్చులూ వచ్చే పరిస్థితి కనపడడం లేదు. కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరం.
– పరిశా చిరంజీవి, శలపాడు, బంతి పూల రైతు
Comments
Please login to add a commentAdd a comment