ఉచిత న్యాయసేవలను పొందవచ్చు
ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె నరేంద్రరెడ్డి
చిలకలూరిపేట: ఆర్థిక స్థోమత లేని వారు మండల న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయసహాయం పొందవచ్చని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె నరేంద్రరెడ్డి చెప్పారు. మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పసుమర్రు గ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌లో జాతీయ న్యాయసేవా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ న్యాయ సహాయం కోసం స్వయంగా మండల న్యాయసేవాధికార సంస్థను సంప్రదించటంతోపాటు, ఉత్తరం రాయడం, లేదా నల్సా హెల్ప్‌లైన్ నంబర్ 15100లో సంప్రదించవచ్చన్నారు. దీంతో పాటుగా కక్షిదారులు లోక్‌అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా సత్వర న్యాయం పొందవచ్చని వెల్లడించారు. వివిధ చట్టాలపై సీనియర్ న్యాయవాదులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు పి వెంకటేశ్వరరావు, జీవీహెచ్‌ఎస్ ప్రసాద్, ఎం భానుప్రసాద్, రూరల్ ఎస్‌ఐ జి అనిల్‌కుమార్, స్కూల్ హెచ్‌ఎం వై హనుమంతరావు పాల్గొన్నారు.
అమరేశ్వరునికి లక్ష బిల్వార్చన
అమరావతి: పంచారామ క్షేత్రాలలో ప్రథమారామక్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలో శనివారం లోక కల్యాణార్ధం ప్రజలంతా సుభిక్షంగా సుఖసంతోషాలతో జీవించాలనే సంకల్పంతో దాతల సహకారంతో అమరేశ్వరునికి లక్షబిల్వార్చనను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయ అర్చకులు, వేదపండితులు జరిపించారు. తొలుత మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించి గణపతిహోమం నిర్వహించారు. స్వామివారికి విశేష అలంకరణ అనంతరం సహస్ర నామాలతో రుత్విక్కులు అమరేశ్వరునికి లక్ష బిల్వదళార్చన నిర్వహించారు. బాలచాముండికా అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు చేశారు. కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
వైభవంగా శ్రీవారి శ్రీపుష్పయాగం
నగరంపాలెం: స్థానిక ఆర్ అగ్రహారం శ్రీ వెంకటేశ్వరస్వామివారి దేవస్థానంలో శనివారం శ్రీ పుష్పయాగ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్తిక మాసం, శ్రవణా నక్షత్రం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, అలంకార పూజ అర్చన కార్యక్రమాలను వేద పండితులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవెంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవం అత్యంత రమణీయంగా చేపట్టారు. 21 రకాల పుష్పాలతో పుష్పయాగ మహోత్సవం భక్తి ప్రపత్తులతో నిర్వహించగా, భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమాలను ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల): కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద శనివారం 5706 క్యూసెక్కులు విడుదల చేశారు. హై లెవల్ కాలువకు 292 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్‌కు 1089 క్యూసెక్కులు, తూర్పు కెనాల్‌కు 540 క్యూసెక్కులు, పశ్చిమ కెనాల్‌కు 178 క్యూసెక్కులు, నిజాంపట్నం కాలువకు 398 క్యూసెక్కులు, కొమ్మమూరు కాలువకు 3040 క్యూసెక్కులు విడుదల చేశారు.
వీఆర్‌కు అరండల్ సీఐ
లక్ష్మీపురం: బోరుగడ్డ అనిల్‌కుమార్‌కు మర్యాదలు చేసిన విషయంలో అరండల్ పేట సీఐ కె.శ్రీనివాసరావును వీఆర్‌కు పంపిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఘటనకు సంబంధించి దర్యాప్తునకు ఆదేశించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది నిబంధనలు పాటించాలని లేని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment