దిగులుబడి!
● తగ్గిన ధాన్యం దిగుబడి ● రైతుల ఆశలు ఆవిరి ● మరోవైపు ధరల పతనం ● ప్రభుత్వం నుంచి ‘మద్దతు’ శూన్యం ● ఆవేదనలో అన్నదాతలు
తెనాలి/కొల్లిపర: ఈ ఏడాది ఖరీఫ్ సీజనుకు ఆదిలోనే ఆటంకాలు ఏర్పడిన విషయం తెలిసిందే. వర్షాలకు వరి వెదజల్లిన మాగాణి భూముల్లో పల్లపు చేలు నీట మునిగాయి. అన్నదాతలకు పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. ఏదోలా పంట సాగుకు ముందుకు సాగిన రైతుల ఆశలను ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన వర్షాలు, వరదలు దెబ్బతీశాయి. చేలల్లోంచి నీళ్లను బయటకు పంపి, ఎరువులు చల్లి, చీడపీడల నివారణ చర్యలతో కష్టపడి ఫలితం కోసం ఎదురుచూశారు. కానీ ప్రస్తుత పరిస్థితి రైతన్నలకు తీవ్ర నిరాశను మిగిల్చింది.
ఎక్కడ చూసినా అంతే...
కృష్ణా పశ్చిమ డెల్టాలోని కాల్వ ఎగువ భూములున్న తెనాలి వ్యవసాయ సబ్ డివిజనులో ముందుగా కొల్లిపర మండలంలో హార్వెస్టింగ్ ఆరంభమైంది. ముందుగా వెదజల్లిన వరి చేలల్లో గత వారం రోజుల్నుంచి రైతులు యంత్రాలతో కోత, నూర్పిడి చేస్తున్నారు. సమీపంలోని బాపట్ల జిల్లా పరిధిలోకి వచ్చే వేమూరు నియోజకవర్గంలోని చుండూరు, ఇతర మండలాల్లో రెండు రోజుల క్రితం నూర్పిళ్లకు శ్రీకారం చుట్టారు. అన్ని చోట్లా ఫలితం ఒక్కటేనన్నట్టుగా ఉంది. ఎక్కడ చూసినా దిగుబడి భారీగా తగ్గిపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
ఎకరాకు రూ.20 వేలు నష్టం
ఏడెకరాల్లో దిగుబడి అంతంత మాత్రమే వచ్చింది. నాలుగు రోజులు ఆగుదామనుకుంటే వాతావరణం సరిగా లేదు. వర్షాలు వస్తే ఇబ్బందని అమ్మేశాను. 75 కిలోల బస్తా రూ.1,400 చొప్పున కొనుగోలు చేశారు. గత సంవత్సరం రూ.2,100 ధర వచ్చింది. దిగుబడి తగ్గటం, ధర లేకపోవటంతో ఎకరాకు రూ.20 వేలు నష్టపోయాను.
– మర్రెడ్డి కోటిరెడ్డి, తూములూరు, రైతు
ధాన్యం గతేడాది ఎకరాకు 35–40 బస్తాలు రాలగా, ప్రస్తుత ఖరీఫ్ సీజను పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎకరాకు కేవలం 25–30 బస్తాలు మాత్రమే దిగుబడి వస్తోంది. అంటే ఎకరాకు పది బస్తాల వరకు తగ్గింది. డెల్టాలో అత్యధిక విస్తీర్ణం కౌలు సాగేనన్న విషయం తెలిసిందే. ఎకరాకు రూ.22 వేల నుంచి రూ.25 వేల వరకు కౌలు చెల్లిస్తున్నారు. మరో రూ.25 వేలకు పైగా పెట్టుబడి అవుతోంది. ఈ కౌలు రైతులకు ధాన్యం దిగుబడి తగ్గిపోవటంపై ఆవేదన వ్యక్తమవుతోంది. దీనికితోడు గత సంవత్సరం నూర్పిళ్ల సమయంలో చేల వద్దకే వచ్చిన వ్యాపారులు నూర్పిడి చేసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేశారు. ఆరంభంలోనే వచ్చిన వ్యాపారులు తేమ సంగతి కూడా పట్టించుకోకుండా బస్తా రూ.1,600లకు కొనుగోలు చేశారు. అదే సమయంలో వర్షాలు కురిసిన విషయం రైతులకు గుర్తుండే ఉంటుంది. వర్షాలు వెలిసి, మళ్లీ నూర్పిళ్లు ఆరంభించాక బస్తా రూ.1,800– రూ.1,900లకు కొనుగోలు చేశారు. మార్కెట్లో ఆశావహ ధరలతో అన్నదాతలు ప్రభుత్వంకేసి చూడాల్సిన పనిలేకుండా పోయింది. ఇందుకు పూర్తి భిన్నంగా ప్రస్తుత పరిస్థితి కనిపిస్తోంది. నూర్పిడి చేసిన ధాన్యానికి బయటి వ్యాపారులు బస్తాకు కేవలం రూ.1,400 మాత్రమే చెల్లిస్తున్నారు. ఇప్పుడే ఇలా వుంటే, అన్ని ప్రాంతాల్లో నూర్పిడులు ఆరంభించి ముమ్మరంగా ధాన్యం వచ్చేటప్పటికి ధర ఎలా ఉంటుందోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. పాత ధాన్యం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కొనేవారు కనిపించటం లేదంటున్నారు. మార్కెట్లో రూ.2,400 ధర ఉంటే కనీసం రూ.2100లకు కూడా కొనటం లేదని చెబుతున్నారు. ఈ క్రాప్ నమోదు చేసిన పంట చేలకు సంబంధించి రైతులకు రైతుసేవా కేంద్రాల ద్వారా కూపన్లు మంజూరు చేసి, కొనుగోళ్లు ఆరంభించనున్నట్టు మండల వ్యవసాయ అధికారి ప్రేమ్‌సాగర్ వెల్లడించారు.
పొలాల్లోనే విక్రయం
ఆరెకరాల మాగాణి కౌలుకు తీసుకుని వరి సాగు చేశాను. మూడెకరాల్లో హార్వెస్టింగ్ చేశాను. ఎకరానికి 34 బస్తాలొచ్చాయి. ధర కూడా లేదు. రూ.1,400లకే అమ్మేశాను. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటంతో ప్రైవేటు వ్యాపారులకే విక్రయించాల్సి వచ్చింది. కౌలు, పెట్టుబడి, నూర్పిడికి ఖర్చులు లెక్కేసుకుంటే ఎకరాకు రూ.20 వేల వరకు నష్టం వచ్చింది.
– నలకుర్తి చిన్నా, తూములూరు, కౌలు రైతు
Comments
Please login to add a commentAdd a comment